అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-17T06:17:27+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సాంగ్విలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

దిలావర్‌పూర్‌, సెప్టెంబరు 16 : అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మండలంలోని సాంగ్వి శివారులోని ఎస్సారెస్పీ నీటిలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ఆలోచిస్తారని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాల్లన్నదే కేసీఆర్‌ ఉద్దేశ్యమన్నారు. నూతన అసెంబ్లీ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజమైన దళిత బంధువు అనిపించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది అవాకులు చెవాకులు పేలుస్తున్నారని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం అత్యాశే అవుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రభుత్వం తనపని తాను చేసుకుపోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. అన్ని వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ  పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి అల్లోల సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అచ్యుత్‌ రావు, ఎంపీపీ అక్షర అనిల్‌, ఎంపీటీసీ జయసుధ సురేష్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు డా. సుభాష్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పీవీ. రమణారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, మండల టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కేవేందర్‌ రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు చిన్నారెడ్డి, కదిలి దేవస్థానం చైర్మన్‌ భుజంగ్‌ రావు పటేల్‌, ఆత్మ డైరెక్టర్‌ సప్పల రవి, ధని రవి, మత్స్యకారులు పాల్గొన్నారు. 

Read more