ఏజెన్సీలో విజృంభిస్తున్న అంటువ్యాధులు

ABN , First Publish Date - 2022-08-18T04:18:45+05:30 IST

జిల్లాలో అంటువ్యాధులు ఒక్కసారిగా విజృంభించాయి. ఏజెన్సీలో విషజ్వరాలు, డెంగీ, మలేరియాతోపాటు అతిసారవ్యాధి కూడా పడగవిప్పింది. దాంతో జిల్లాలో వైద్య,ఆరోగ్యశాఖ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఏజెన్సీలో విజృంభిస్తున్న అంటువ్యాధులు
బెజ్జూరు మండలం సల్గుపల్లి డయేరియాతో చికిత్స పొందుతున్న రోగులు

- పడగ విప్పిన డయేరియా 

- పెరుగుతున్న జ్వరపీడితులు

- జిల్లాలో ఇప్పటికే నాలుగువేలకుపైగా కేసులు

- మళ్లీ పంజా విసురుతున్న డెంగీ

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో అంటువ్యాధులు ఒక్కసారిగా విజృంభించాయి. ఏజెన్సీలో విషజ్వరాలు, డెంగీ, మలేరియాతోపాటు అతిసారవ్యాధి కూడా పడగవిప్పింది. దాంతో జిల్లాలో వైద్య,ఆరోగ్యశాఖ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలవచ్చని అధికార యంత్రాంగం ముందుగానే ఊహించి జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఆసిఫాబాద్‌, తిర్యాని, దహెగాం, బెజ్జూరు తదితర మండలాల్లో సీజనల్‌ వ్యాధుల తీవ్రత బాగా పెరిగినట్టు స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా నీటి వనరులు కలుషితం కావడంతో డయేరియా పడగ విప్పుతోంది. ఇందుకు బెజ్జూరు మండలం సల్గుపల్లి గ్రామంలో విస్పోటం చెందిన అతిసార వ్యాధియే నిదర్శనం. ఇక్కడ గ్రామానికి మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధ తాగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ గ్రామస్థుల్లో డయేరియా బారినపడటం అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఇక్కడ వారం రోజుల వ్యవధిలో 40మందికిపైగా అతిసార వ్యాధిబారిన పడి తీవ్రఅస్వస్తతకు కాగా ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. నిపుణుల బృందం గ్రామాన్ని సందర్శించి అన్నిరకాల శాంపిల్స్‌ను సేకరించినప్పటికీ డయేరియా అనుమానిత కేసులు మళ్లీమళ్లీ ఎందుకు నమోదు అవుతున్నాయన్నది తేల్చలేకపోతున్నారు. తాజాగా గత గురువారం కూడా ఇదే గ్రామంలో మరో పదిమంది గ్రామస్థులు అతిసార వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. దాంతో చుట్టుపక్కల గ్రామాల్లో అతిసారపై వదంతులు మొదలయ్యాయి. అయితే వైద్యఆరోగ్యశాఖ నిపుణులు మాత్రం వాతావరణ మార్పులు నీటి కారణంగా ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మలేరియా, టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే 8డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండేళ్ల క్రితం జిల్లాలో డెంగీ విజృంభించి వందలాది మంది ఆస్పత్రి పాలు కాగా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మరోసారి డెంగీ విజృంభిస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై పారిశుధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సగటున ప్రతి రోజు 450-500మంది వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలవుతున్నట్టు చెబుతున్నారు. వీరు కాకుండా గ్రామాలస్థాయిలో ప్రతి గ్రామంలోను 20నుంచి 30మంది జ్వరాల బారినపడి స్థానిక ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద వైద్యం చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా వ్యాధులు చుట్టుముట్టడంతో జిల్లాలోని ఆస్పత్రులపైన ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా జిల్లాలో వైద్యచికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక పోవడంతో బాధితులు పొరుగున ఉన్న మంచిర్యాల, బల్లార్షా, ఆదిలాబాద్‌ వంటి పట్టణాలకు వెళ్లుతుండగా, పరిస్థితి తీవ్రత అధికంగా ఉన్న బాధితులు కరీంనగర్‌, హైదరాబాద్‌ నగరాలకు చికిత్స కోసం తరలుతున్నారు.  

ఇప్పటికే నాలుగువేలకుపైగా కేసులు నమోదు..

జిల్లాలో వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతుండటంతో అధికారులు అప్రమత్తమం అయ్యారు. జిల్లాలో ఇప్పటికే 4478 జ్వరపీడి తులు చికిత్స తీసుకున్నట్టు వైద్యఆరోగ్యశాఖ నివేదికలను బట్టి తెలుస్తోంది. జిల్లాలోని 22ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రుల్లో సగటున రోజు 450నుంచి 500మంది ఓపీ పెషెంట్లు నమోదు అవుతుండగా ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సగటున రోజుకు 20నుంచి 25మంది చికిత్స పొందుతున్నారు. సిర్పూరు(టి) సామాజిక ఆస్పత్రిలో ప్రతిరోజు సగటున 50నుంచి 60మంది రోగులు వైద్యులను సంప్రదిస్తుండగా జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌ ఆస్పత్రిలో సగటున వందనుంచి 150మంది ఔట్‌పేషెంట్లు నమోదు అవుతున్నట్టు చెబుతున్నారు. ఇందులో వీరందరికీ రక్తపరీక్షలు నిర్వహించి జ్వరతీవ్రతను బట్టి చికిత్స అందిస్తుండగా పరీక్షల్లో డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా కేసులు వెలుగు చూస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు రోగులకు నిర్వహించిన రక్తపరీక్షల్లో 8మందికి డెంగ్యూ నిర్ధారించినట్టు చెబుతున్నారు. అటు మలేరియా, టైఫాయిడ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు.

Read more