అభయారణ్యంలో ప్రయాణం భయం..భయం

ABN , First Publish Date - 2022-09-13T06:15:31+05:30 IST

ఎటు చూసినా పచ్చనిచెట్లు, గలగల పారే సెలయేర్లు, అక్కడక్కడ కనిపించే అడవి జంతువుల అరుపులు, కిలకిల రావాలు పలికే అరుదైన జాతిపక్షులు ఇలా ఎక్కడ కనిపించని ప్రకృతి సహజసిద్ధమైన అందాలు కవ్వాల్‌ అభయారణ్యం సొంత. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను వీక్షిస్తూ కవ్వాల్‌ అభయారణ్యంలో ఆనందంగా సాగించే ప్రయాణం ఇప్పుడు అనుక్షణం భయం..భయంగా మారింది.

అభయారణ్యంలో ప్రయాణం భయం..భయం
ఖానాపూర్‌ మండలం ఎక్బాల్‌పూర్‌ వద్ద రోడ్డుపై వెళ్తున్న టాటా మ్యాజిక్‌ వాహనంపై విరిగిపడిన భారీ వృక్షం (ఫైల్‌)

వాహనదారుల పాలిట యమపాశాలవుతున్న భారీ వృక్షాలు

రోడ్డుకు ఇరువైపులా నేలకొరిగేలా అడుగడుగునా దర్శనమిస్తున్న చెట్లు

తాజాగా ఎక్బాల్‌పూర్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రయాణికుల పట్ల ప్రాణ సంకటంగా మారుతున్న ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం

ఖానాపూర్‌, సెప్టెంబరు 12 : ఎటు చూసినా పచ్చనిచెట్లు, గలగల పారే సెలయేర్లు, అక్కడక్కడ కనిపించే అడవి జంతువుల అరుపులు, కిలకిల రావాలు పలికే అరుదైన జాతిపక్షులు ఇలా ఎక్కడ కనిపించని ప్రకృతి సహజసిద్ధమైన అందాలు కవ్వాల్‌ అభయారణ్యం సొంత. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను వీక్షిస్తూ కవ్వాల్‌ అభయారణ్యంలో ఆనందంగా సాగించే ప్రయాణం ఇప్పుడు అనుక్షణం భయం..భయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీవర్షాలు కురుస్తుండడంతో భూమిలో భూగర్భ జలాలస్థాయి పెరిగిపోయింది. చిన్నపాటి జల్లులు కురిసినా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు సైతం కుంగిపోతున్నాయి. కవ్వాల్‌ అభయారణ్యంలో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న భారీవృక్షాల అడుగుభాగంలో ఉన్ననేల సైతం కుంగి పోవడంతో వందలాది వృక్షాలు నేలకొరిగేందుకు సిద్ధంగా రోడ్డు వైపునకు వంగి దర్శనమిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రయాణికుల పాలిటశాపంగా మారింది. 

అభయారణ్యంలో భయాందోళనతో ప్రయాణం

ఈయేడు కురిసిన భారీవర్షాలకు రోడ్డుకు ఇరువైపులా నేలకు ఒరిగేం దుకు సిద్ధంగా భారీ వృక్షాలు ఏ క్షణాన విరిగిపడతాయే తెలవని పరిస్థితి ఉంది. గత నెల రోజుల వ్యవధిలో వందలాది వృక్షాలు నేలకొరుగగా అం దులో సగానికి పైగా రోడ్లకు అడ్డంగా పడిపోవడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ఇటీవలకాలంలో వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే పెద్దసాహసం చేసినట్టుగానే మారింది. ఇక్కడి పరిస్థితి. రోడ్డుపై వాహనాలు వెళ్తున్న క్రమంలోనే భారీ వృక్షాలు విరిగి ఆ వాహనాలపై పడుతున్నాయి. దీంతో వాహనాలలో ఉన్న ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. నె లరోజుల క్రితం ఖానాపూర్‌ మండలం సత్తనపల్లి గ్రామం శివారుప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై టేకువృక్షం విరిగిపడగా కారు నుజ్జునుజ్జు అయ్యి కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. గతంలో జరిగిన ఓ సంఘటనలో సైతం రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనంపై చెట్టు విరిగిపడగా అందులోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. కానీ తాజాగా ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు వాహనంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన సంఘటన ఈ ప్రాంత ప్రజలను కలచివేసేలా చేసింది. ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల జలపాతం వద్దకు విహారయాత్ర కోసమని జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటి క్యాల గ్రామం నుంచి ఓ టాటా మ్యాజిక్‌ వాహనంలో 13 మంది ప్రయా ణికులు బయలుదేరారు. వీరి వాహనం ఖానాపూర్‌ మండలం ఎక్బాల్‌పూర్‌ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఊహించని మృత్యువు వారి కళ్ల ఎదుట నిలిచింది. రోడ్డు  పక్కన వంగి ఉన్న తుమ్మచెట్టు టాటా మ్యాజిక్‌పై విరిగి పడడంతో వాహనం ముందర క్యాబిన్‌లో కూర్చున్న డ్రైవర్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఆ చెట్టుపడిన దాటికి టాటా మ్యాజిక్‌  నుజ్జునుజ్జు అవ్వ డంతో అందులో ఇరుక్కుపోయారు. ఆ భారీవృక్షాన్ని తొలగించి వారిని బయటకు తీసేందుకు సుమారు గంటన్నర సమయం పట్టింది. అప్పటికే ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొక్కరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో నిర్మల్‌-మంచిర్యాల రహదారిపై ప్రయాణించాలంటే ప్రస్తుతం వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి. ప్రకృతిఅందాలకు నిలయమైన కవ్వాల్‌ అభయారణ్యంలో ప్రయా ణం ఇప్పుడు అదే ప్రకృతి బీభత్సానికి అనుక్షణం వాహనదారులకు భయం భయంగా మారింది. 

వాహనదారులకు శాపం.. 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కవ్వాల్‌ అభయారణ్యంలో ప్రయాణించే వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా భారీవృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడుతూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యం లో అధికారుల తీరు పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నో రోజు లుగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్డు వైపు వంగి విరిగిపడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇటు ఆర్‌ అండ్‌ బీ అధి కారులు గానీ అటు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గానీ, అటవీ శాఖ అధికారులు గానీ స్పందించకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ కొమురం భీం చౌరస్తా వరకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి వచ్చే రహదారికి ఇరువైపున చెట్లను తొలగింపు కోసం అటవీశాఖకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా నాన్‌ ఫారెస్ట్‌ పరిధిలో చెట్లను తొలగించేందుకు అనుమతులు ఇచ్చారు. ఫారెస్ట్‌ పరిధిలోకి వచ్చే చెట్ల తొలగింపుపై ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ పని అక్కడే ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఖానాపూర్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రహదారి ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి వస్తుంది. ఈ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించేందుకు అనుమతించాలని కోరినప్పటికీ అనుమతు లు ఇవ్వడం లేదని ఆర్‌ అండ్‌ బీ అధికారులు చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించేందుకు ఇటు ఆర్‌ అండ్‌ బీ కానీ అటు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కానీ రోడ్డు నిబంధనల ప్రకారం ఎన్ని చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయో గుర్తించి తమకు  నివేదిక అందజేసి నిబంధ నల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వాటి తొలగింపుకు అనుమతి ఇస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా ఈ మూడు ప్రభుత్వశాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే వాహనదారు లు భారీమూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కవ్వాల్‌ అభయా రణ్యంలో, నిర్మల్‌ మంచిర్యాల రహదారికి ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న వృక్షాలను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. 

అటవీ పరిధిలో లేని టేకు యేతర చెట్ల తొలగింపు 

నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ కొమరంభీం చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో నాన్‌ ఫారెస్ట్‌ పరిధిలో చెట్లను తొగించేందుకు అనుమతించారు. నాన్‌ ఫారెస్ట్‌ పరిధిలోని టేకు, ఇతర చెట్లను ఇప్పటికే తొలగించాము. టేకు చెట్ల తొలగింపు ప్రక్రియ మిగిలి ఉంది. ఫారెస్ట్‌ పరిధిలోని చెట్ల తొలగింపుకు ఇంకా ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు.

- సుభాష్‌ ఎన్‌హెచ్‌ఏఐ డీఈ, నిర్మల్‌

చెట్లకొమ్మల తొలగింపునకు సైతం అనుమతించడం లేదు

రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను సైతం తొల గించేందుకు అధికారులు అనుమతించడం లేదు. ఇదివరకే పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదు. 

- మల్లారెడ్డి, ఆర్‌ అండ్‌ బీ, డీఈ, ఖానాపూర్‌


 ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగింపునకు  అనుమతిస్తాం

రోడ్డు నిబంధనల ప్రకారం వారి స్థలంలో రోడ్డుకు ఇరువైపులా ప్రమాద కరంగా ఉన్న చెట్లను గుర్తించి అటవీశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. రెవె న్యూ పరిధిలోని చెట్ల తొలగింపుకు వెంటనే అనుమతి ఇస్తాం. అటవీశాఖ పరిధిలోని వాటి కి అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.

- కోటేశ్వరరావు, ఎఫ్‌డీవో, ఖానాపూర్‌


ప్రమాదకరంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలి

నిర్మల్‌- మంచిర్యాల రహదారికి ఇరువైపులా ప్రమాద కరంగా రోడ్డువైపుకు వంగిఉన్న చెట్లను వెంటనే తొలగిం చాలి. రోడ్డుపై వెళ్లే వాహనాలపై ప్రమాదకరంగా ఉన్న చెట్లు విరిగిపడి ప్రయాణికుల ప్రాణాలు కోల్పోతు న్నారు. అధికారులు ఇకనైనా స్పందించకపోతే మరింత నష్టం తప్పదు. 

రాజుర సత్యం, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ లీడర్‌, ఖానాపూర్‌

Read more