విద్య, వైద్యమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-05T07:32:51+05:30 IST

ప్రస్తు తం కీలకంగా మారి ఖరీదైపోయిన విద్య, వై ద్యరంగాలు జిల్లాలో గా డిన పడుతున్నాయి.

విద్య, వైద్యమే లక్ష్యం

లైవ్‌ లోకేషన్‌, బయోమెట్రిక్‌ హాజరుతో మారిన పరిస్థితులు 

మెరుగైన రెండు శాఖల పనితీరు 

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఫోకస్‌తో రెండు శాఖల పనితీరు మెరుగుదల 

ప్రత్యేకచర్యలతోనే ఎస్‌ఎస్‌సీలో రెండోస్థానం 

మారిన సర్కారు ఆసుపత్రుల తీరు 

నిర్మల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తు తం కీలకంగా మారి ఖరీదైపోయిన విద్య, వై ద్యరంగాలు జిల్లాలో గా డిన పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఈ రెండుశాఖలు తమ పనితీరులో వెనకబడడమే కా కుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశించిన మేర సేవలు అందించలేకపోయాయన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ విద్య, వైద్యశాఖలపై ప్రత్యేకదృష్టి సారించారు. ఇటు ప్రభుత్వ పాఠశాలలు, అటు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ హడలెత్తించారు. శాఖల పనితీరు మెరుగుదలకు అక్కడికక్కడే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది తమ విధులకు గైర్హాజరవుతున్న వ్యవహారాన్ని కూడా కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును క్రమబద్దీకరించేందుకే కాకుండా డాక్టర్‌ల హాజరుశాతాన్ని మెరుగుపర్చేందుకు కొత్తవిధానంను తెరపైకి తెచ్చారు. టీచర్లు పాఠశాలలకు సకాలంలో హాజరయ్యేందుకు వినూత్నంగా లైవ్‌లోకేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొదట్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఆ తరువాత ఈ విధానం ఫలితమిచ్చింది. కలెక్టర్‌ ఎప్పటికప్పుడు లైవ్‌ లోకేషన్‌ హాజరు విధానాన్ని స్వయంగా పరిశీలించడంతో విద్యాశాఖ పనితీరు గాడిన పడింది. మరోవైపు వైద్యశాఖపై ఆయన ఫోకస్‌ పెట్టారు. డాక్టర్‌లకు, సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును అమలు చేశారు. దీంతో డాక్టర్‌లు, వైద్యసిబ్బంది హాజరుశాతం పూర్తిస్థాయిలో మెరుగైంది. అలాగే కలెక్టర్‌ ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ రోగులతో అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీయడమే కాకుండా డెలవరీలపై ప్రత్యేక దృష్టికి సారించారు. సీజేరియన్‌లను తగ్గించి నార్మల్‌ డెలవరీలకు ప్రాధాన్యతనివ్వాలంటూ కలెక్టర్‌ సీరియస్‌గా ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితుల్లో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలా రెండుశాఖలపై కలెక్టర్‌ దృష్టి సారించిన నేపథ్యంలో ఆ శాఖలు రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిం చి అగ్రస్థానం లో నిలుస్తుండ డం ప్రాధాన్యత ను సంతరించుకుంటోంది. 

ప్రత్యేకచర్యలతోనే ఎస్‌ఎస్‌సీలో రెండోవస్థానం

కాగా కలెక్టర్‌ దిశానిర్దేశంతో విద్యాశాఖలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మెరుగైన విద్యాభోధనతో పాటు పరీక్ష ఫలితాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన చర్యలతో జిల్లా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో రాష్ట్రంలోనే రెండోవస్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. ఎస్‌ఎస్‌సీలో జిల్లాను మొదటివరుసలో నిలిపేందుకు కలెక్టర్‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. దీనికి అనుగుణంగా ప్రత్యేకక్లాసులతో పాటు విద్యార్థులకు మోడల్‌టెస్ట్‌ల నిర్వహణ అలాగే ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేత లాంటి చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యల కారణంగా జిల్లా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో తృటిలో. మొదటిస్థానం కోల్పోయినప్పటికీ రెండోస్థానం దక్కించుకోగలిగింది. ఎస్‌ ఎస్‌సీ ఫలితాలు విద్యాశాఖకు కొత్త ఊపునిచ్చాయంటున్నారు. ఈ ఫలితాల కారణంగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గవర్నమెంట్‌ స్కూల్స్‌లో అడ్మిషన్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్చందంగా సహాకరిస్తూ తోడుగా నిలుస్తున్నారు. 

మారిన సర్కారు ఆసుపత్రుల తీరు

జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారిపోయాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు మెటర్నీటీ ఆసుపత్రి, అలాగే మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. ఇటీవలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని ప్రభుత్వం ముప్పై పడకలకు పెంచింది. కాగా ఇక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను మరింత మెరుగుపర్చారు. డయాగ్నోస్టిక్‌హబ్‌తో పాటు డయాలసిస్‌ సెంటర్‌ లాంటి సౌ కర్యాలను సమకూర్చారు. సీజేరియన్‌లను తగ్గిస్తూ నార్మల్‌ డెలవరీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇక్కడి మెటర్నీటీ ఆసుపత్రి డెలవరీల కోసం గర్బిణీలు క్యూ కడుతున్నారు. ఇలా మెరుగైన పనితీరు , ఉత్తమసేవలతో జిల్లా ఆసుపత్రితో పాటు మెటర్నీటీ ఆసుపత్రి కూడా ఎన్‌క్యూఎఎస్‌ (నేషనల్‌ క్వాలిటీ అశ్యూరెన్స్‌ స్టాండర్డ్‌) సర్టిఫికెట్‌ను సాధించాయి. జాతీయస్థాయిలో ఈ నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్‌ సాధించడం వైద్య,ఆరోగ్యశాఖలో విశేషంగా పేర్కొంటున్నారు. 

ఉమ్మడి కృషి తోనే ఉత్తమ ఫలితాలు

కాగా జిల్లాలోని వైద్య,ఆరోగ్యశాఖ అలాగే విద్యాశాఖలు క్రమంగా గాడిన పడి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడానికి సంబంధిత శాఖల ఉమ్మడికృషి కారణమంటున్నారు. ఈ రెండు శాఖలతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆ శాఖల పనితీరును గాడిన పెట్టడంతో ప్రగతి సాధ్యమైందంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులకు కలెక్టర్‌ ప్రత్యేకనిధులు మంజూరు చేసి పరిష్కారం చూపారు. దీంతో పాటు సంబంధిత శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆ శాఖల గ్రేడింగ్‌ పెరిగేందుకు ప్రయత్నాలు చేశారు. క్రమంగా ఈ ప్రయత్నాలన్నీ ఫలించడంతో కీలకమైన ఈ రెండుశాఖలు ప్రస్తుతం ప్రజల ప్రశంసలకు నోచుకుంటున్నాయన్న అభి ప్రాయాలున్నాయి. ప్రజలకు అత్యంత అవసరమైన సేవలల్లో అధికారగణం చొరవ చూపి పనిచేయడం పట్ల జిల్లా వాసులు హర్షిస్తున్నారు.

Read more