కదిలిస్తే కన్నీరే

ABN , First Publish Date - 2022-07-19T03:34:16+05:30 IST

భారీ వర్షాలకు వరద నీరు పలు కాలనీలకు చేరింది. వరద నీరు తగ్గి నాలుగు రోజులైనా ముంపు ప్రాంత బాధితుల కష్టాలు తీరడం లేదు. వరద ఉధృతికి ఇంటిపై కప్పు రేకులు కొట్టుకుపోగా మొండి గోడలు మిగిలాయి. ఇండ్లలోని సామగ్రి, గృహోపకరణాలు బురదతో నిండిపోయాయి. తాగునీటి సరఫరా, విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. బోర్‌లు, బావులు, సెప్టిక్‌ట్యాంక్‌ల్లో వరద నీరు చేరి నిరుపయోగంగా మారాయి. ఆర్థికంగా కోలుకోలేని నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు పెడుతున్నారు.

కదిలిస్తే కన్నీరే
ఎన్‌టిఆర్‌ నగర్‌లో కూలిపోయిన ఇండ్లు

- వరద ప్రభావిత ప్రాంతాల్లో దయనీయ స్థితి

- కొట్టుకుపోయిన పైకప్పులు, శిథిలమైన గోడలు

- సరఫరా కాని నల్లానీరు, విద్యుత్‌

- వీధుల్లో పేరుకుపోయిన పారిశుధ్యం

- నాలుగు రోజులైనా తీరని కష్టాలు 

 భారీ వర్షాలకు వరద నీరు పలు కాలనీలకు చేరింది.  వరద నీరు తగ్గి నాలుగు రోజులైనా ముంపు ప్రాంత బాధితుల కష్టాలు తీరడం లేదు. వరద ఉధృతికి ఇంటిపై కప్పు రేకులు కొట్టుకుపోగా మొండి గోడలు మిగిలాయి. ఇండ్లలోని సామగ్రి, గృహోపకరణాలు బురదతో నిండిపోయాయి. తాగునీటి సరఫరా, విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. బోర్‌లు, బావులు, సెప్టిక్‌ట్యాంక్‌ల్లో వరద నీరు చేరి నిరుపయోగంగా మారాయి. ఆర్థికంగా కోలుకోలేని నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరు పెడుతున్నారు. 

ఏసీసీ, జూలై  18 : మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌, రాంనగర్‌ కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నీరు వెళ్లిపోయి నాలుగు రోజులు గడిచినా ఇంకా ప్రజల కష్టాలు తీరడం లేదు. కాలనీల్లో అనేక ఇండ్లు నీటిలో పూర్తిగా తడిసినందున అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించడం లేదు. నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు కొద్ది మందికి మాత్రమే చేరుతుంది. పలు వాడల్లో రోడ్లు ఇంకా బురద, మట్టి, చెత్తా, చెదారం పేరుకొని వాహనదారులకు, బాటసారులకు ఇబ్బంది కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వెలువడుతోంది.  పారిశుధ్య లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. అనేక ఇండ్లు కూలి ఇంటి పైకప్పులు కొట్టుకుపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇండ్లలోని వంట సామగ్రి, సరుకులు, బియ్యం తడిసి పాడైపోయాయి. అనేక మంది ప్రజలు తినేందుకు తిండి లేక, తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  బట్టలు, చెద్దర్లు, పరుపులు నీళ్లతో తడిసి పూర్తిగా చెడిపోవడంతో కట్టు బట్టలతో మిగిలారు. దాతలు అందజేసిన ఆహారం, సరుకులతో కడుపు నింపుకుంటున్నారు.  గృహోపకరణాలైన టీవీ, ఫ్రిడ్జ్‌, కూలర్‌లు, తదితర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నష్టం నుంచి తేరుకోవడానికి నెలల సమయం పడుతుందని, ఉండేందుకు నీడ లేక, పనికి వెళ్లలేక రోజుల తరబడి అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్తను తొలగించడం, పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నా అరకొర సిబ్బందితో పనులు త్వరగా జరగడం లేదు. బావులు, బోర్‌లు, సెప్టిక్‌ట్యాంక్‌లలో వరద నీరు నిండి నిరుపయోగంగా తయారయ్యాయి.

వండుకోవడానికి ఏమీ మిగలలేదు

....ఇప్ప యశోద, ఎన్‌టిఆర్‌ నగర్‌   

కొడుకులు, కోడండ్లు అందరం ఒకే ఇంట్లో ఉంటాం. ఇల్లు ఇలా అయింది. ఇప్పుడు మేమందరం ఎక్కడ ఉండాలో అర్ధం కాని పరిస్థితి. బీరువాలో కొన్ని దుస్తులు ఉంటే వాటిని పిండుకొంటున్నాం. వండుకోవడానికి ఏమి మిగలలేదు. మాకు ప్రభుత్వం సహాయం చేయాలి. 

నీళ్లు వచ్చి ఇంటి రేకులు కూలిపోయాయి ....

కుర్మ నాగరాజు  

నీళ్లు వచ్చి ఇంటి రేకులు కూలిపోయినయి. సామగ్రి అంతా కొట్టుకుపోయింది. నాలుగు  రోజుల నుంచి శుభ్రం చేసినా కూడా ఇంకా పరిస్థితి ఇలానే ఉంది. దుస్తులు, తిండి లేదు. ఎవరైనా ఇస్తే తింటున్నాం. లేదంటే పస్తులుంటున్నం. ప్రభుత్వం సహాయం చేయాలి. 

వరదకు ఇల్లు కూలిపోయింది..

సుందిల్ల సమ్మయ్య, ఎన్‌టిఆర్‌ నగర్‌   

వరదకు ఇల్లు కూలిపోయింది. గ్యాస్‌, వంట సామను  అన్ని నీళ్లలో కొట్టుకుపోయినయ్‌. వండుకుందామన్నా ఏమి లేదు.  ప్రభుత్వం ఆదుకోవాలె. మా లైన్‌లో 20 ఇండ్ల వరకు వరదతో కూలిపోయాయి. పరిస్థితి అంతా అస్తవ్యస్థంగా ఉంది. 

మాతా శిశు ఆసుపత్రిలో పేరుకుపోయిన బురద

- త్వరగా వినియోగంలోకి తేవాలని కలెక్టర్‌ ఆదేశం

- శుభ్రం చేస్తుండగా స్వీపర్‌కు పాముకాటు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై  18 : గోదావరి సమీపంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వరద నీటిలో మునిగిపోవడంతో భారీగా మట్టి పేరుకుపోయింది. భవనం పూర్తిగా మునగడంతో విలువైన మందులు, పరికరాలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. భవనం వెంటిలెటర్ల వరకు నీరు చేరడంతో గోడలు, ఫ్లోరింగ్‌ అంతా మట్టి పేరుకుపోయింది. ఆదివారం కలెక్టర్‌ పరిశీలించి మట్టిని తొలగించి త్వరగా వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. సోమవారం 30 మంది సిబ్బందితో పారిశుధ్య పనులు ప్రారంభించారు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి నీటి సరఫరాకు ఇబ్బందిగా మారింది. దీంతో చేసేది లేక బకెట్‌లతో నీరు తీసుకువచ్చి శుభ్రం చేస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.  వరదల్లో మునిగిన విద్యుత్‌ బోర్డులకు మరమ్మతు చేయాలంటే మరో నాలుగైదు  రోజుల పడుతుందని, వాతావరణం అనుకూలించాలని  ఆసుపత్రి సూపరింటెండెంట్‌  హరీష్‌చంద్ర పేర్కొన్నారు.  

పాముకాటుకు గురైన స్వీపర్‌

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్పీపర్‌ సునీత సోమవారం పాముకాటుకు గురైంది. అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో  ఎంసీహెచ్‌ భవనం ఇటీవల నీట మునిగింది.  ఆసుపత్రి ఆవరణ మొత్తం వరద ద్వారా కొట్టుకు వచ్చిన వండ్రు పేరుకు పోయి బురదమయమైంది. వరదలో పదుల సంఖ్యలో పాములు కొట్టుకువచ్చి ఆస్పత్రిలో చేరాయి. ఆసుపత్రిని వినియోగంలోకి తేవాలని అధికారులు 30 మంది సిబ్బందితో పారిశుధ్య పనులు చేపట్టారు. పనులు చేస్తుండగా స్వీపర్‌  సునీత పాము కాటుకు గురైంది. తోటి కార్మికులు ఆమెను చికిత్స నిమిత్తం తరలించారు. సునీతకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆవరణలో పాముల సంచారం ఎక్కువగా ఉండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

 వరదలో కొట్టుకువచ్చిన  పాము  

నస్పూర్‌: నస్పూర్‌  వినూత్న కాలనీ చుట్టు గోదావరి వరద పోటెత్తడంతో  పాములు కొట్టుకువస్తున్నాయి.  కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో సోమవారం రెండు తలల పామును స్థానికులు గుర్తించారు.  పామును పట్టుకొని తోళ్లవాగు నీటిలో వదిలిపెట్టారు. 


Updated Date - 2022-07-19T03:34:16+05:30 IST