మృత్యు తీగలు

ABN , First Publish Date - 2022-08-11T04:33:41+05:30 IST

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమో.. ప్రజలు, రైతుల అజాగ్రత్తో కరెంటు తీగలు మూగజీవాల పాలిట యమపాశాలు అవుతున్నాయి.

మృత్యు తీగలు
నెన్నెల మండలం ఆవడం వద్ద కరెంట్‌ తీగలు తెగిపడి మృతి చెందిన ఆవులు(ఫైల్‌)

- యమపాశాలుగా మారుతున్న కరెంట్‌ వైర్లు

- విద్యుదాఘాతంతో మృత్యువాత పడుతున్న మూగజీవాలు 

- జిల్లాలో రెండు నెలల్లో 37 పశువులు మృతి

  ఇతడి పేరు మంచర్ల పోశం. నెన్నెల మండలం ఆవడం గ్రామస్థుడు. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాడు. సాగులో సాయం కోసం రెం డు ఎడ్లు, రెండు ఆవుులు ఉండేవి. వ్యవసాయ పనులు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కరెంటు రూపంలో ఆపద వచ్చింది. 20 రోజుల వ్యవధిలో మూడు పశువులు కరెంట్‌ షాక్‌తో మృత్యవాత పడ్డాయి. గ్రామంలోని రక్షణ లేని ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద జీవనాధారమైన ఎద్దు మృతి చెందగా, మామిడి తోటలో మేతకు వెళ్లిన రెండు ఆవులు తెగిపడిన కరెం టు తీగలకు తగులడంతో షాక్‌కు గురై మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 1.80 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో పాటు ఎద్దు లేక సాగు పనులు వెనుకబడ్డాయి. నిండా మునిగిన తనకు అధికారులు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రాదేయపడుతున్నాడు.

నెన్నెల,  ఆగస్టు 10: విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమో.. ప్రజలు, రైతుల అజాగ్రత్తో కరెంటు తీగలు మూగజీవాల పాలిట యమపాశాలు అవుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్‌ తీగలు, ఎళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక చిన్న పాటి గాలికే తెగిపడే వైర్లు, కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు, ఎర్తింగ్‌ లోపాల కారణంగా పదుల సంఖ్యలో మూగజీవాలు కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడుతు న్నాయి. రైతులు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. సాగు లో సాయమందించే కాడెడ్లు, పాడి గేదెలు, ఆవులు మేతకు వెళ్లినప్పుడు షాక్‌కు గురై మృతి చెందడం రైతుల కుటుంబాలకు తీవ్ర ఆ వేదన మిగుల్చుతోంది. వేల రూపాయల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో 37 పశువులు విద్యుదాఘాతంతో మృతి చెందాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు 

- ప్రమాదాలు ఇలా..

విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువ శాతం వర్షాకాలంలోనే జరుగుతున్నాయి. ఈ ఏడు ఎడతె రిపి లేని వర్షాల కారణంగా సమస్య మరింత తీవ్రమెంది.  గ్రామాల్లో వ్యవసాయ మోటర్ల కనెక్షన్ల కోసం స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తీగలు కిందికి వేలాడు తున్నాయి. పైకి ఎత్తితే చేతికి అందే ఎత్తులో ఉండే ఈ తీగలు చిన్నపాటి గాలికి తెగి కింద పడిపోతున్నాయి. ఎర్తింగ్‌ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలకు సపోర్టుగా ఉండే స్టే వైర్లకు కరెంటు సరఫరా కావడం వల్లా కొన్ని సార్లు సమస్య వస్తోంది. చాలా చోట్ల రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లే ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేత మేస్తూ అటువైపుగా వెళ్లే పశువులు కరెంట్‌ షాక్‌కు గురవుతున్నాయి. జిల్లాలో మామిడి తోటలు, అడవుల మీదుగానే 11 కేవీ లైన్లు ఉన్నాయి. తీగలకు చెట్ల కొమ్మలు తగిలి  మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయి. రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడే తీగల విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపునకు రైతులు ఒప్పుకోవడం లేదని అధికారులంటున్నారు. ఎక్కువ విద్యుత్‌ ప్రమాదాలు అవగాహన లోపాలతోనే జరుగుతున్నాయని, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

- పరిహారంలో జాప్యం..

మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే విద్యుత్‌ సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కాగా నెలలు గడుస్తున్నా చాలా మందికి పరిహారం అందడం లేదు. నిబం ధనల ప్రకారం విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెందిన కాడెడ్లు, కోడెలు, పాలిచ్చే గేదెలకు రూ. 40 వేల వరకు, మేకలు, గొర్రెలకు రూ. 7 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.  పోస్టుమార్టం రిపోర్ట్టు,  క్షేత్రస్థాయి విచారణ, నివే దికల పేరిట కాలయాపన చేస్తారనే ఆరోపణలున్నాయి. రేపుమాపంటూ తిప్పుకోవడంతో పరిహారం మంజూరీ కోసం నెలలు గడిచిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో రైతులదే తప్పిదంగా నివేదిక రూపొందించి పరిహారం రాకుండా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. జరిగిన నష్టంలో 50 శాతం మాత్రమే అందజేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఆవులు, బర్రెల విలువ రూ. 50 వేల నుంచి 80 వేలు, కాడెడ్ల విలువ రూ. 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. కాగా అం దులో   50 శాతం కూడా ఇవ్వడం లేదని బాధిత రైతులు చెబుతున్నారు. నష్టపోయిన పశు వుల మార్కెట్‌ విలువ ఆధారంగా పూర్తిస్థాయి పరిహారం వచ్చేలా చూడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పొంచిఉన్న ప్రమాదాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైన ఉంది. పాత లైన్లకు కొత్త తీగలు వేయడం, వేలాడతున్న చోట  స్తంభాలు ఏర్పాటు చేయడం, రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

-  గడిచిన రెండు నెలల్లో చోటు చేసుకున్న ప్రమాదాలు..

- జూన్‌ 11న భీమారం మండలం ఎల్కేశ్వరం పంచాయతి పరిధిలోని ఎల్‌బీపేట గ్రామస్థుడు ఓడేటి రాజమల్లుకు చెందిన రూ. 60 వేల విలువైన ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎర్త్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. 

- జూన్‌ 13న చెన్నూరు మండలం కొమ్మెరకు చెందిన కొరకొప్పుల రా జు, దెబ్బ సాంబయ్యల ఎడ్లు ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్త్‌ వైర్‌ తగిలి చని పోయాయి. 

- జూన్‌ 16న భీమారం మండలం పోతన్‌పల్లి సమీప పొలాల్లో విద్యు త్‌ తీగలు తెగిపడి ఉస్కమల్ల మల్లేష్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, నరేందర్‌లకు చెందిన మూడు ఆవుులు బలయ్యాయి.

- జూన్‌ 25న కోటపల్లి మండలంలోని నాగంపేటలో జాడి శంకర్‌కు చెందిన ఎద్దు కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కరెంట్‌షాక్‌కు గురై మృత్య వాత పడింది.

- జూలై 1న చెన్నూరు మండలం బీరెల్లి గ్రామానికి చెందిన రామిండ్ల లింగయ్య ఎద్దు నాగపూర్‌ శివారులో తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు తగిలిమృతి చెందింది.

- జూలై 10న నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్‌ గ్రామంలో పిడుగు రాజ య్యకు చెందిన రెండు ఆవులు, అగ్గెన భీరయ్య బర్రె విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందాయి.

- జూలై 10న ఆవడం శివారు మామిడి తోటల్లో మంచర్ల పోశంకు చెందిన రెండు ఆవులు, దుర్గం సుశీల, ఎనగందుల రాజలింగు, గేడెం రాజలింగుల  ఒక్కో ఆవు తెగిపడిన విద్యుత్‌ తీగలకు బలయ్యాయి.

- జూలై 17న కోటపల్లి మండలం అన్నారంలో కరెంటు స్తంభాలు విరిగి పడి తీగలు తగలడంతో అంగూరి మల్లయ్య, సల్పల మల్లయ్య, అంగ రాజయ్యకు చెందిన మూడు గేదెలు షాక్‌కు గురై మృతి చెందాయి. 

- ఆగస్టు 4న కన్నెపల్లి మండలం మెట్‌పల్లి బెస్తవాడలో ముడుసు బాపుకు చెందిన గేదె తెగిపడిన తీగలు తగిలి విద్యుదాఘాతంతో చనిపోయింది.

- ఆగస్టు 5న వేమనపల్లి మండలం రాజారం సమీపంలోని నీల్వాయి ఎడమ కాలువ మ ట్టి కుప్పలపై వేలాడుతున్న తీగలు తగిలి ఒక ఆవు, మరో గేదె మృతి చెందాయి. ఇంత కం టే రెండు నెలల ముందు అదే ప్రాంతంలో జుంజు కొమురయ్య, బురుస హన్మంతులకు చెందిన  రెండు ఎడ్లు, మరో రైతుకు చెందిన గేదె కరెట్‌ షాక్‌కు మృత్యువాత పడ్డాయి. 

- ఆగస్టు 9న నెన్నెల మండలం దమ్మిరెడ్డిపేట గ్రామానికి చెందిన మానెపల్లి రఘుపతి అనే వ్యక్తికి చెందిన ఎద్దు మేత మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్త్‌వైర్‌ తగిలి షాక్‌కు గురై మృత్యువాత పడింది. 

Read more