హరితహారం వైపు అడుగులు

ABN , First Publish Date - 2022-07-23T06:05:26+05:30 IST

జిల్లాలో హరితహార కార్యక్రమం ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. జూలై గడిచిపోతున్నా.. ఇంకా నామమాత్రంగానే హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి రెండు దశల్లో అధికారులు హడావుడి చేసినా.. ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోయింది.

హరితహారం వైపు అడుగులు
నర్సరీలో ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు

జిల్లాలో 8వ విడత హరితహారానికి సిద్ధమవుతున్న అధికారులు

ఈ దఫా 44.74 లక్షలకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యం

ఇన్నాళ్లు నామమాత్రంగానే సాగిన హరితహారం కార్యక్రమం

పథకం అమలుకు కరువవుతున్న ప్రాధాన్యత

జిల్లావ్యాప్తంగా లక్షా 874 హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం

ఆదిలాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో హరితహార కార్యక్రమం ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. జూలై గడిచిపోతున్నా.. ఇంకా నామమాత్రంగానే హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి రెండు దశల్లో అధికారులు హడావుడి చేసినా.. ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోయింది. ఇప్పటి వరకు చేపట్టిన ఏడు దశల్లో పథకం అమలుపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకం కింద మొక్కలను నాటేందుకు ప్రతియేటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. 4,153 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో లక్షా 874 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కార, గడిచిన ఏడేళ్లలో అడవుల విస్తీర్ణం ఏ మాత్రం పెరిగినట్లు కనిపించడం లేదు. ఉన్న అడవులను రక్షించక పోవడంతో ఏటేటా అడవుల విస్తీర్ణం అంతరించి పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సారి ఎనిమిదో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 44లక్షల 74వేల 500 మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 23లక్షల 3696 మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. జిల్లాలోని 18 మండలాలతో పాటు మున్సిపల్‌ పరిధిలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు దిశా నిర్దేశం చేయడంతో జిల్లా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి వేప, చింత, మర్రి మొక్కలతో పాటు పండ్ల మొక్కలు ఉసిరి, మర్రి, తెల్లమద్ది, గుల్మర్గ, వేప, ఈత, ఖర్జుర వనాలను పెంచేందుకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈసారి టార్గెట్‌ 44 లక్షలు

ఈసారి జిల్లావ్యాప్తంగా 44లక్షల 74వేల 500 మొక్కలను నాటేందుకు అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. శాఖల వారీగా కేటాయింపులు చేసిన అనుకున్నంత స్థాయిలో లక్ష్యం నెరవేరినట్లు కనిపించడం లేదు. అటవీ శాఖ 8లక్షల లక్ష్యం పెట్టుకోగా డీఆర్‌డీఏ 25లక్షలు, మున్సిపాలిటీ ఐదు లక్షలు, ఐటీడీఏ లక్ష, ఇతర శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు 23 లక్షల 3,696 మొక్కలను నాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 51.5 శాతం మొక్కలను నాటినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి స్థానికంగానే మొక్కలను పెంచి నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో హరితహారం కార్యక్రమానికి ఆ టంకాలు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే నాటిన మొక్కలు వరద నీటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. మళ్లీ మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు నర్సరీల్లో సరిపడా మొక్కలను పెంచక పోగా.. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చూపుతూ నిధులను డ్రా చేస్తున్నట్లు తెలుస్తుంది.

నాటడం.. వదిలేయడం

ప్రతియేటా హరితహారం పథకం కింద మొక్కలను నాటడం, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఆశించిన స్థాయిలో మొక్కల పెంపకం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల టార్గెట్‌తో హడావుడిగా మొక్కలు నాటేయడం, ఆ తర్వా త సంరక్షణ చర్యలను చేపట్టకపోవడంతో నాటిన మొక్కలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించేం దుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. కాని అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కో మొక్క రక్షణకు రూ.ఐదు చెల్లించి 400 మొ క్కల బాధ్యతను ఒక్కో వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. కాని నిర్వహణ, కూలి బిల్లు లు సకాలంలో చెల్లించక పోవడంతో మొక్కలను సంరక్షించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కిందిస్థాయి అధికారులు చెప్పిందే లెక్కాగా మారు తోంది. దీంతో రికార్డుల్లో ఉన్న మొక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న మొక్కలకు ఎ లాంటి పొంతన లేకుండా పోతోంది. ప్రతియేటా టార్గెట్‌ ప్రకారం మొక్కలను నాటి సంరక్షిస్తే కొన్ని లక్షల మొక్కలు ఎదిగి కనిపించేవి. కానీ, ప్రతియేటా నాటిన ప్రదేశాల్లోనే మళ్లీ మళ్లీ మొక్కలను నాటడం కనిపిస్తోంది. ట్రీగార్డ్స్‌ను ఏ ర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని గ్రా మాల్లో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రోడ్డుకు ఇరువైపుల నాటి వదిలేయడంతో.. మొక్కలు కనిపించకుండానే పోతున్నాయి. రోడ్డు విస్తర్ణ, ఇతర అభివృద్ధి పనుల పేరిట నాటిన మొక్కలను తొలగించడం గమనార్హం. 

మొక్కల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

: కిషన్‌, డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌

జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కలను సంరక్షించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ వారిగా టార్గెట్‌ను నిర్ణయించి దిశానిర్దేశం చేస్తున్నాం. ఎనిమిదో హరితహార కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి స్థానికం గానే ఎక్కువగా మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి జిల్లా వ్యాప్తంగా 44లక్షల 74వేల 500 మొక్కలను నాటేందుకు టార్గెట్‌ పెట్టుకున్నాం. ఇప్పటికే 51.5 శాతం మొక్కలను నాటడం జరిగింది. ఆగస్టు చివరి వరకు  లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని అందరు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read more