ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు

ABN , First Publish Date - 2022-03-19T05:15:03+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన దరిమిలా రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ హడావుడి మొదలైంది. జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఆశావహులు టికెట్లపై కన్నేసి అనుచరులను సమీకరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు

- మొదలైన రాజకీయ హడావుడి

- రెండు నియోజకవర్గాల్లోనూ ఆశావహుల సందడి

- కొత్తగా బలం పుంజుకునేందుకు యత్నిస్తున్న బీఎస్పీ 

- ఆసిఫాబాద్‌, సిర్పూరులో కన్నేసిన బీజేపీ 

- సంక్షేమ పథకాలతో ముందుకెళ్లుతున్న టీఆర్‌ఎస్‌

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన దరిమిలా రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ హడావుడి మొదలైంది. జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఆశావహులు టికెట్లపై కన్నేసి అనుచరులను సమీకరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రప్రభుత్వం పనితీరుపై అధికారపార్టీ ఓవైపు అంతర్గత సర్వేలు జరిపిం చగా మరోవైపు బీజేపీ కూడా అధికార పార్టీ విజయ అవకాశాలపై సర్వేలు జరిపించిందని ప్రచారం జరుగుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అప్ర మత్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల వ్యూహంతోనే ఈ సర్వేలకు శ్రీకారం చుట్టిందని భావిస్తున్నా విపక్షాలు కూడా పార్టీని పటిష్టం చేసుకునే దిశగా కార్యచరణను మొదలెట్టాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ప్రబలశక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ జిల్లాలోని రెండు నియోజక వర్గాలపైనా దృష్టి సారించి బూత్‌లెవల్‌ నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని నిర్మించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త అధ్యక్షుడిని కూడా హడావుడిగా ప్రకటించింది. ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో ఈ సారి ఆదివాసీల నాయకత్వంపై వ్యతిరేకత ఉంటుందన్న అంచనాతో ఆపార్టీ నాయకత్వం లంబాడా సామాజిక వర్గం నుంచి టిక్కెట్టు ఇస్తోందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ లంబాడ సామాజికవర్గానికి చెందిన ఆత్మరాంనాయక్‌ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. అయితే ఆదివాసీల్లోనూ ఆసిఫాబాద్‌ స్థానంపై పలువురు నాయకులు కన్నేసి లాబీయింగ్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అలాగే సిర్పూరు నియో జకవర్గంలో ప్రస్తుతం పాల్వాయి హరీష్‌బాబు టిక్కెట్టు తనకే వస్తుందన్న ధీమాతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ కూడా టిక్కెట్టును ఆశిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆ పార్టీకి చెందిన వర్గాలు అంటున్నాయి. బీజేపీ అంచనాల ప్రకారం రాష్ట్ర సీఎం డిసెంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌పార్టీ కూడా ఇదే అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చిన దరిమిలా వ్యతిరేకత ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఐతే కర్ణాటకతో పాటు తెలంగాణ ఎన్నికలకు వెళ్లితే అక్కడి ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే గుజరాత్‌ ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబరులోనే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉండొచ్చని కాంగ్రెస్‌ నేతలు అంచనాలు వేస్తున్నారు. దాంతో ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకత్వం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసే దిశగా కార్యచరణ ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి సానుకూల ఫలి తాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటీవలి పీకే(ప్రశాంత్‌ కిషోర్‌) సర్వేలో వెల్లడైందని ఆ పార్టీ చెబుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రస్తుతం చురుగ్గా కార్యకలపాలు సాగిస్తున్న నాయకులతోపాటు మరో ఐదు, ఆరుగురు నేతలు పోటీలో ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌ కూడా ఇక్కడ ఆదివాసీయేతర గిరిజనులకే టిక్కెట్టు కేటాయించాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పరస్పరం మార్పు పద్ధతిలో ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఎజెం డాగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యచరణకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే జిల్లా అధ్యక్షుడిగా సిర్పూరు శాసనసభ్యుడు కోనేరు కోనప్పకు పార్టీలు అప్పగించింది ముందస్తు వ్యూహంతోననే భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు స్వచ్ఛదంగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రెండు నియోజక వర్గాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

కీలకంగా మారుతున్న బీఎస్పీ

ముందస్తు ఊహగానాలతో ప్రధాన రాజకీయ పక్షాల్లో ఓ వైపు రాజకీయ హడావుడి కొనసాగుతుండగా మరో వైపు బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కూడా చాప కింద నీరులా కార్యకలపాలు చేస్తోంది. ముఖ్యంగా సిర్పూరు నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ నాయకత్వం కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే బీఎస్పీకి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐపీ ఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇప్పటికే నాలుగు పర్యాయాలు నియోజకర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. ఇందుకు కారణం లేక పోలేదు. 2014ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతశాసన సభ్యుడు కోనేరు కోనప్ప బీఎస్పీ తరుపున పోటీచేసి విజయం సాధించారు. దాంతో ఆ పార్టీకి ఇక్కడ సంస్థాగతంగా బలం ఉందన్న భావన ఆ పార్టీ నేతల్లో కన్పిస్తోంది. దానికి తోడు నిన్న, మొన్నటి వరకు ఎమ్మెల్యేకు ప్రధాన అను చరుడిగా కొనసాగిన బెజ్జూరు మైనార్టీ నేత హర్షద్‌ హుస్సేన్‌ ఆయనతో విభేదించి బీఎస్పీలో చేరడం ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ఇక్కడ బీఎస్పీకి దళితులు, మైనార్టీల్లో పట్టు పెరగవచ్చని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే గెలుపు, ఓటములు నిర్ణయించడంలో బీఎస్పీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు. 

Read more