వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ

ABN , First Publish Date - 2022-08-25T06:32:07+05:30 IST

కరోనా వైరస్‌ ముప్పు తప్పిందనుకుంటున్న తరుణంలోనే.. డెంగ్యూ జ్వరాల భయం మొదలయ్యింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 84 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో..

వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ
జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర బాధితులు

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులు

మొదలైన ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీ దందా 

ర్యాపిడ్‌ టెస్టులతోనే వ్యాధి నిర్ధారణ

క్షేత్రస్థాయిలో కరువవుతున్న వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం అధికారికంగా 84 కేసులు

ఆదిలాబాద్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ముప్పు తప్పిందనుకుంటున్న తరుణంలోనే.. డెంగ్యూ జ్వరాల భయం మొదలయ్యింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 84 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. డెంగ్యూ వ్యాప్తి మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల్లో డెంగ్యూ జ్వరాల విజృంభణ ఉంటుందని చెబుతున్నారు. గడిచిన పక్షం రోజుల్లోనే పది పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు కట్టడి చర్యలు చేపట్టామని చెబుతున్నా.. కేసుల సంఖ్య భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వానాకాలం సీజన్‌లో మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా, డెంగ్యూ జ్వరాలు రావడం సర్వసాధారణమేనని అధికారులు చెబుతున్నా..  డెంగ్యూ భయంతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. చిన్నపాటి జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చినా డెంగ్యూ జ్వరమేమోనని భయపడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు దోపిడీ దందాకు తెరలేపుతున్నాయి. ఎలాంటి జ్వరం వచ్చినా డెంగ్యూ జ్వరం అంటూ వసూలు దందాకు ఎగబడుతున్నాయి. సొంతంగానే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుని రక్త పరీక్షలు నిర్వహిస్తూ డెంగ్యూ జ్వరమంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మౌనం వహించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రైవేట్‌ ఆసుపత్రుల ఇష్టారాజ్యం

జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే.. ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ బాధితులు వాపోతున్నారు. మ్యాక్‌ ఎలిసా టెస్టులు చేయకుండానే డెంగ్యూ వ్యాధి అంటూ ఆసుపత్రుల్లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో రిమ్స్‌ ఆసుపత్రిలో తప్ప, ఎక్కడా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవకాశం లేదు. కానీ ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా చికిత్సలు చేస్తూ బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రక్త పరీక్షలు మొదలుకొని మందులు, బెడ్‌ చార్జీలు, ఇతర ఖర్చుల పేరిట వసూలు చేస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు ఆసుపత్రుల్లో మాములు చికిత్సలు అందిస్తూ ఖరీదైన వైద్యం పేరిట ఒక్కో బాధితుడినుంచి రూ.50 వేల వరకు గుంజుతున్నారు. ఇది చాలదంటూ మళ్లీ టెస్టుల పేరిట అదనంగా దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదేమిటని అడిగితే డెంగ్యూ జ్వరం తో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయంటూ కుటుంబ సభ్యుల ను భయపెడుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు అందిస్తున్న చికిత్సల పై వైద్య ఆరోగ్య శాఖకు డేలీ రిపోర్టు ఇవ్వాల్సి ఉన్నా.. కొన్ని ఆసుపత్రులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. గుట్టుచప్పుడుకాకుండా వైద్యాన్ని అందిస్తూ అడ్డగోలుగా బిల్లులు వసూలు చే స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఆర్‌ఎంపీ వైద్యుల కమిషన్‌ దందాతో ఆసుపత్రి ఖర్చులు మరింత పెరిగి పోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు గాలికి..

జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన బాధితులకు రక్త పరీక్షలు నిర్వహించి డెంగ్యూ పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాతనే సంబంధిత చికిత్సను అందించాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ర్యాపిడ్‌ టెస్టుల ద్వారానే డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేస్తున్నాయి. దీంతో బాధితులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మ్యాక్‌ ఎలిసా టెస్టు ద్వారానే డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇవేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అనుమానితుల రక్త నమునాలను రిమ్స్‌ ఆసుపత్రికి పంపిస్తే ఉచితంగానే వ్యాధి నిర్ధారణ చేసి వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత ఆసుపత్రికి పూర్తి సమాచారం అందిస్తుంది. కారీ దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఎలాంటి లాభం ఉండదని భావించి సొంత ల్యాబ్‌ల్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్సను అందిస్తున్నారు. అత్యవసర సమయంలో ర్యాపిడ్‌ టెస్టులను చేసినా.. తప్పనిసరిగా మ్యాక్‌ ఎలిసా టెస్టును చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ర్యాపిడ్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చినా.. ఎలిసా టెస్టులో మాత్రం నెగెటివ్‌ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ప్లేట్‌లెట్స్‌ మూడు లక్షల నుంచి రెండు లక్షల వరకు పడిపోయినా.. పెద్దగా ప్రమాదం ఉండదంటున్నారు. 20వేల నుంచి 30వేలలోపు ఉంటేనే ప్రమాదం అని గుర్తించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్‌ ఆసుపత్రులు డెంగ్యూ బాధితుల సంఖ్యను గోప్యంగా ఉంచి వైద్యం అందించడంతో అసలు కేసులు బయటకు రావడం లేదంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 84 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నా.. అనధికారికంగా మాత్రం వందలాది సంఖ్యలో బాధితులు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. క్రమం తప్పకుండా ప్రైవేట్‌ ఆసుపత్రులను తనిఖీలు చేపడితే వాస్తవ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

సమాచారం అందించాలని సర్క్యులర్‌ జారీ చేశాం

: రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

ఇప్పటికే జ్వర బాధితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ప్రైవేట్‌ ఆసుపత్రులకు సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరిన బాధితులకు రక్త పరీక్షలు నిర్వహించినా.. డెంగ్యూ నిర్ధారణ మాత్రం రిమ్స్‌ ఆసుపత్రుల్లోనే చేయాల్సి ఉంటుంది. ఎలిసా టెస్టు అనంతరమే డెంగ్యూ నిర్ధాణ అయినట్లు గుర్తించాలి. ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా వ్యాధిని నిర్దారణ చేసి, వైద్యం చేయడం సరైంది కాదు. డేలీ రిపోర్టును ఇవ్వాలని కోరుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా డెంగ్యూ చికిత్సలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం. 

Read more