సేవలు బారెడు..జీతం మూరెడు

ABN , First Publish Date - 2022-10-05T03:27:03+05:30 IST

గ్రామాల్లో అందుబాటులో ఉంటూ రైతులకు నిత్యం సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈవోలు, సిబ్బంది కష్టాల కడలిని ఈదుతున్నారు.

సేవలు బారెడు..జీతం మూరెడు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం

- కష్టాల కడలిలో సొసైటీల సీఈవోలు, సిబ్బంది

- పేరివిజన్‌ అమలు కోసం ఎదురుచూపు

బెజ్జూరు, అక్టోబరు 4: గ్రామాల్లో అందుబాటులో ఉంటూ రైతులకు నిత్యం సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈవోలు, సిబ్బంది కష్టాల కడలిని ఈదుతున్నారు. ఏళ్ల తరబడిగా వారు  సేవలు అందిస్తున్నా తగిన జీతం మాత్రం అందకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 సంఘాలు ఉన్నాయి. ఇందులో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12సొసైటీలు ఉన్నాయి. అందులో సభ్యుల సంఖ్య మేరకు ఒక సీఈవో, ఇద్దరు స్టాఫ్‌ అసిస్టెంట్లు, ఒక అటెండర్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009లో ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగులకు 151జీవో ద్వారా ఒక పే స్కేలు స్ట్రక్చర్‌ను ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు అదే స్కేలు అమలవుతోంది. మారిన జీవన ప్రమాణాల మేరకు కొత్త పేస్కేలు ఇవ్వకపోవడంతో వారంతా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొత్తగా నియమితులైన సీఈవోలకు మూలవేతనం రూ.1640, కరువు భత్యం రూ. 9,107, ఇంటి అద్దె భత్యం 300 మొత్తం కలిపి రూ.11047జీతం వస్తోంది. స్టాఫ్‌ అసిస్టెంట్లకు కూడా ఇంచుమించు ఇదే పద్ధతిలో జీతాలు వస్తున్నాయి. సీనియార్టీని బట్టి రూ.75 నుంచి రూ.180వరకు ఏడాదికి వేతనాన్ని పెంచుతున్నారు. ఇక 25ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగికి కూడా రూ.30వేల లోపు వేతనం మాత్రమే అందుతోంది. వీరికి సొసైటీల ద్వారా జీతాలు ఇస్తుండటంతో సంఘాలు నష్టంలో ఉంటే సిబ్బందిని వేరే చోట కు పంపిస్తారు. ఉన్న ఉద్యోగం వదులుకోలేక, వేరే పనిచేయలేక ఇబ్బందులతోనే నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ భద్రత, పేరివిజన్‌ అమలు, హెచ్‌ఆర్‌ పాలసీలను అమలు చేసి రైతు మిత్రులుగా ఉండే తమను అదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతులకు నిర్విరామంగా సేవలు

సొసైటీల సీఈవోలు, సిబ్బంది నిర్విరామంగా పని చేస్తూ సెలవులు లేకుండా రైతులకు సేవలు అందిస్తున్నారు. రైతులకు రుణాల పంపిణీతోపాటు వసూళ్లు, రికార్డుల నిర్వహణ, ఎరువులు, విత్తనాల పంపిణీ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తుంటారు. సొసైటీల ద్వారా డిపాజిట్ల సేకరణ, పొదుపులు, ధాన్యం కొనుగోలు చేయడం, వాటికి సంబంధించిన డబ్బులను రైతులకు అందజేయడం చేస్తుంటారు. సొసైటీల బలోపేతానికి కొన్ని సంఘాల్లో ఆర్థికంగా వనరులు వచ్చే కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. అన్ని రకాల సేవలు అందిస్తున్న సీఈవోలకు మాత్రం ప్రభుత్వం తగిన వేతనాలు ఇవ్వడం లేదు. అరకొరగా వచ్చే వేతనాలు కుటుంబ పోషణకు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరివిజన్‌ అమలు చేయాలి

  - పర్శ సంజీవ్‌, సీఈవో బెజ్జూరు

సొసైటీల సీఈవోలు, సిబ్బందికి వేతనాలు పెంచేలా ప్రభుత్వం పేరివిజన్‌ అమలు చేయాలి. తక్కువ వేతనాలతో పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సంఘాలు, రైతుల కోసం అంకితభావంతో పని చేసు న్నాం. అందుకు తగినట్లుగా తమ సేవలను పరిగణలోకి తీసుకోవాలి.

ఉద్యోగ భద్రత కల్పించాలి

  - చప్పిడి బక్కయ్య, సీఈవో దహెగాం

సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం తమను గుర్తించి కష్టాలను నెరవేర్చాలి.

Read more