బతుకమ్మ ఆడలేదని జీతం కట్‌...!

ABN , First Publish Date - 2022-10-19T03:48:25+05:30 IST

బతుకమ్మ ఆడలేదని ఏకంగా వేతనం కట్‌ చేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగను అవహేళన చేసే విధంగా కింది స్థాయి ఉద్యోగులు కొందరు ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పి స్తోంది. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతోంది.

బతుకమ్మ ఆడలేదని జీతం కట్‌...!

అంగన్‌వాడీ ఆయాల వేతనంలో కోత

క్రిస్టియన్‌, ముస్లిం వర్గాల ఆయాలపై చర్యలు  

జిల్లాలో వెలుగుచూసిన ఘటన  

మంచిర్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ ఆడలేదని ఏకంగా వేతనం కట్‌ చేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగను అవహేళన  చేసే విధంగా కింది స్థాయి ఉద్యోగులు కొందరు ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పి స్తోంది. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా జరుపుతోంది. ఇటీవల జరిగిన బతుకమ్మ పండుగలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిపార్టుమెంట్‌ల వారీగా మహిళా ఉద్యోగులు తొమ్మిది రోజుల పాటు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కలెక్టర్‌ భారతి హోళికేరి బతుకమ్మ ఆడి కింది స్థాయి ఉద్యోగులు, మహిళల్లో ఉత్సాహం నింపారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. 

వేడుకల్లో పాల్గొనలేదని వేతనం కట్‌ 

బతుకమ్మ ఆడలేదనే కారణంతో జిల్లాలోని కొందరు అంగన్‌వాడీ ఆయాల వేతనాలను అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. బతుకమ్మ పండుగను హిందూ మహిళలు ఆడడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా మతాలకతీతంగా బతుకమ్మలో పాల్గొనాలని అంగన్‌వాడీ ఆయాలను ఆదేశించారు. కొందరు క్రిస్టియన్‌, ముస్లిం మహిళలు బతుకమ్మ ఆడలే దనే నెపంతో వారి వేతనాల్లో రూ. 300 చొప్పున మినహాయించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాధితురాలి వేతనం నిలిపి వేయగా తన పేరు ప్రస్తావించవద్దని తెలిపింది. బతుకమ్మ ఆడలేదనే నెపంతో పై ఉద్యోగులు ఆయాలకు గైర్హాజరు వేయడంతో సెప్టెంబరు నెల వేతనంలో కోత విధించినట్లు సమాచారం. బతుకమ్మ తమ పండుగ కాదని, ఆడడం తమ మతానికి విరుద్ధమని చెప్పినా వినిపించుకోలేదని గోడు వెల్లబోసుకుంది. నెలకు వచ్చే వేతనం రూ.7800 నుంచి రూ.300 కోత పెడితే తమ కుటుంబాన్ని ఎలా పోషించేదని ఆమె వాపోయారు. 

బలవంతంగా ఆడించారు 

జిల్లా వ్యాప్తంగా  969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా  ఆ సంఖ్యకు  సరిపడా ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ ఆయాల్లో  సుమారు 150 వరకు ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు.  తాము బతుకమ్మ ఆటకు రాలేమని, తమ వేతనం నిలిపివేయవద్దని అధికారు లను వేడుకొన్నా కనికరించలేదనే విమర్శలున్నాయి. స్వయంగా కలెక్టరే  బతుకమ్మ ఆడగా లేంది... మీకేంటి అభ్యంతరం అని ఎదురు ప్రశ్నించి నట్లు తెలుస్తోంది. 

సెలవులు అడిగితే వేతనంలో కోత..? 

అంగన్‌వాడీ కేంద్రాల్లో అధికారులు ఆడింతే ఆటగా తయారైంది. ఆయాలు సెలవు అడిగితే  వేతనం  నుంచి కోత విధించడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికే చెందిన ఓ ఆయా రెండు  రోజులు సెలవుపై వెళ్లడంతో రోజుకు రూ.300 చొప్పున వేతనం కట్‌ చేశారని బాధితురాలు వాపోయింది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ముఖ్యమైన పనుల మీద వెళ్లినప్పుడు వేతనం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి వేతనంలో కోత విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ను ఆయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

చిన్నయ్య, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి

బతుకమ్మ ఆడలేదనే కారణంతో వేతనం నిలిపివేసిన విషయం నా దృష్టికి రాలేదు. అలా చేయడం సమంజసం కాదు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే  బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ నిబంధన ఏదీ విధించలేదు. ఇతర మతాల మహిళలను బతుకమ్మ వారి  ఇష్టాఇష్టాల మేరకే ఉంటుంంది. బలవంతంగా ఆడించడం సరైంది కాదు.  

Read more