రేషన్‌బియ్యం.. పక్కదారి!

ABN , First Publish Date - 2022-10-11T05:56:10+05:30 IST

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు పక్కదారి పట్టిస్తూ అమ్మేసుకుంటున్నారు. దీంతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. కొందరు వ్యాపారులు ఇదే పనిగా గ్రామాల్లో తమ ప్రతినిధుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరించి

రేషన్‌బియ్యం.. పక్కదారి!
ఇటీవల అధికారుల తనిఖీల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యం(ఫైల్‌)

జిల్లా సరిహద్దుల్లో తరచుగా పట్టుబడుతున్న వైనం

కట్టడి చేసేందుకు డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌) విధానం అమలుకు రాష్ట్ర సర్కారు యోచన

ఎన్నో పోషక విలువలున్నా.. తినేందుకు ఇష్టపడని జనం

రాయితీ బియ్యాన్ని అమ్మేసుకుంటున్న రేషన్‌ లబ్ధిదారులు

మహారాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద కొరవడిన నిఘా

పత్తాలేని సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా అధికారులు

ఆదిలాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు పక్కదారి పట్టిస్తూ అమ్మేసుకుంటున్నారు. దీంతో అక్రమ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. కొందరు వ్యాపారులు ఇదే పనిగా గ్రామాల్లో తమ ప్రతినిధుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరించి పెద్దమొత్తంలో సరిహద్దులు దాటిస్తున్నారు. గడిచిన ఎనిమిది మాసాల్లోనే జిల్లాలో వెయ్యి క్వింటాళ్లకు పైగా రేషన్‌ బియ్యం అధికారుల తనిఖీల్లో పట్టుబడడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తునే ఉంది. దీంతో కొందరు లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడడం లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రాయితీ బియ్యాన్ని తీసుకోవడం.. దళారులకు అమ్మేసుకోవడం పరిపాటిగానే మారుతుంది. గ్రామాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు మండలాలైనా తలమడుగు, బోథ్‌, తాంసి, బేల, జైనథ్‌, నార్నూర్‌ మండలాల మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని బోరి, కిన్వట్‌, నాగ్‌పూర్‌, పాండ్రకవడ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మేసుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న  జిల్లా మీదుగానే అక్రమ రేషన్‌ బియ్యం దందా కొనసాగుతుంది. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారుల నిఘా కొరవడుతుంది. అయిన సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పత్తాలేకుండానే పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

నేరుగా నగదు చెల్లింపులు

రేషన్‌ బియ్యం అక్రమదందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ స్కీమ్‌) విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డీబీటీ పథకం అమలుతో రేషన్‌ బియ్యం అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధానం ద్వారా రేషన్‌ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని లబ్దిదారులను గుర్తించి నేరుగా వారి అకౌంట్లలో నగదును జమ చేసే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కిలో రేషన్‌ బియ్యానికి రూ.10 చొప్పున లబ్దిదారులకు చెల్లించాలని అధికారులు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విధానం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుందని సివిల్‌ సప్లయ్‌ అధికారులు పేర్కొంటున్నారు. డీబీటీ విధానం అమలైతే అక్రమదందాకు ఆస్కారమే లేకుండా పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో కిలో రూ.16

దళారులు సేకరిస్తున్న రేషన్‌ బియ్యానికి మహారాష్ట్రలో భారీగా డిమాండ్‌ ఉంది. ఇక్కడ కిలో రేషన్‌ బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12 వరకు పెట్టి సేకరిస్తున్న వ్యాపారులు మహారాష్ట్రకు తరలిస్తూ కిలో రూ.16కు అమ్మేసుకుంటున్న ట్లు తెలుస్తుంది. ఇలా కిలో రేషన్‌ బియ్యం వెంటా రూ.4 నుంచి రూ.6 వరకు లాభం వస్తుంది. అంటే క్వింటాలు బియ్యానికి రూ.400 నుంచి రూ.600 వరకు సంపాధిస్తున్నారు. కొందరు దీనినే పనిగా పెట్టుకోవడంతో పోలీసుల తనిఖీల్లో పదేపదే పట్టుబడుతున్నారు. మహారాష్ట్ర దళారులతో కుమ్మకై దందా కొనసాగి స్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యం, గుట్కాను దిగుమతి చేసుకుంటు జిల్లా నుంచి రేషన్‌ బియ్యం, గంజాయిని సరఫరా చేస్తు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అక్రమదందాలను అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు మాముళ్ల వసూలుకు ఎగబడుతున్నట్లు విమర్శలు వస్తున్నా యి. పట్టుబడుతున్న దళారులే పదే పదే పట్టుబడుతున్న అధికారులు కఠినం గా వ్యవహరించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పక్కన పెట్టి..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరు రకాల పోషక గుణాలు ఉన్న ఫోర్టీఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్న లబ్ధిదారులు మాత్రం ఈ బియ్యాన్ని పక్కన పెట్టి సన్న బియ్యంపై మోజు చూపుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు ఆసిఫాబాద్‌, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా పోషక గుణాలు ఉన్న రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఇందులో మైక్రోన్యూట్రిషియన్‌, ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌, బీకాంప్లెక్స్‌, విటామిన్‌ 2, విటామిన్‌ ఏ, జింక్‌, మరికొన్ని పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఛౌకధరల దుకాణాలలో సరఫ రా చేస్తున్నారు. దీంతో అక్రమ రేషన్‌కు అడ్డుకట్ట వేయాలని కూడా అధికారు లు భావించారు. అయినా ఆగడమే లేదు. ఎందుకంటే నిరుపేదలే తప్ప మధ్య తరగతి, ఆర్థికంగా బలపడిన వారంతా సన్న బియ్యం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని తీసుకుంటూ అమ్మేసుకుంటున్నారు. వచ్చిన డబ్బులతో నెలనెల కిరాణా సరుకులను కొనుగోలు చేసుకుంటున్నారు. దొడ్డుగా, జిగుటుగా కావడంతో తినేందుకు  ఇష్టపడడం లేదంటున్నారు. గ్రామాల్లో కొందరు రైతు లు బియ్యాన్ని తమ పశువులకు దాణాగా వాడుతున్నట్లు తెలుస్తుంది.  

డీబీటీ విధానంపై చర్చ జరుగుతోంది

: సుదర్శన్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి, ఆదిలాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్‌ బియ్యం అక్రమదందాకు అడ్డుకట్ట వేసేందుకు డీబీటీ విధానం అమలుపై చర్చ జరుగుతోంది. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని తిరిగి లబ్ధిదారులకే సరఫరా చేస్తున్నాం. మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను సారిస్తున్నాం. రేషన్‌ బియ్యం సరఫరాలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డిజిటల్‌ విధానం ద్వారా రేషన్‌ సరుకులను విజయవంతంగా సరఫరా చేస్తున్నాం. రేషన్‌ బియ్యాన్ని అమ్ముకుంటున్న లబ్ధిదారులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం.

Read more