సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

ABN , First Publish Date - 2022-01-28T05:47:49+05:30 IST

జిల్లాలో సఖి కేంద్రాల ద్వారా అభాగ్యులకు, వేధింపులకు గురైన మహిళలు, నిస్సహాయులకు సత్వర న్యాయం జరిగే విధంగా సంబంధిత శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

-  కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 27: జిల్లాలో సఖి కేంద్రాల ద్వారా అభాగ్యులకు, వేధింపులకు గురైన మహిళలు, నిస్సహాయులకు సత్వర న్యాయం జరిగే విధంగా సంబంధిత శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎస్పీ(అడ్మీన్‌) వైవీఎస్‌ సుదీంధ్రతో కలిసి సఖి నిర్వాహణ కమిటీ సమావేశానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సఖి కేంద్రం ద్వారా అభాగ్యులకు, వేధింపులకు గురైన మహిళలు, నిస్సహాయులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సఖి కేంద్రం ద్వారా అందించే సేవలపై సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలకు తెలిసే విధంగా గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సఖి హెల్ప్‌ లైన్‌పై మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు తెలియజేసి వాటిని నియంత్రించే విధంగా సఖి కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నెలల వారీగా ఒక నిర్దేశిత లక్ష్యం ఏర్పర్చుకొని పని చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక బృందాల మహిళలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. జూన్‌ నుంచి డిసెంబరు మాసం వరకు విద్యార్థులలో చైతన్యం పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సఖి కేంద్రం సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి మనోహర్‌, జిల్లా సంక్షేమాధికారి సావిత్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి రవికృష్ణ, ఎన్‌ఏఐడీఎన్‌ కార్యనిర్వాహక సంచాలకులు సురేందర్‌, బార్‌ కౌన్సిల్‌ జిల్లా చైర్మన్‌ సతీష్‌, సఖీ కేంద్రం నిర్వహకులు సౌజన్య, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Read more