రాయితీకి రాం రాం...

ABN , First Publish Date - 2022-06-08T04:22:32+05:30 IST

వ్యవసాయంలో ఆధునిక మార్పులు తీసుకువస్తున్న ప్రభుత్వం మరో వైపు విత్తనాలపై సబ్సిడీని ఎత్తేసింది. రెండేండ్ల క్రితం వరకు విత్తనాలపై ఇచ్చిన సబ్సిడీకి మంగళం పాడింది. రాయితీకి ప్రభుత్వం రాం రాం పలకడంతో ఇది అన్నదాతకు అదనపు భారంగా మారింది. కేవలం పచ్చి రొట్టకు సంబంధించి నేలలో సారం పెంచే జీలుగ, జనుము విత్తనాలు మాత్రమే రాయితీపై కేటాయించారు.

రాయితీకి రాం రాం...
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు

విత్తనాలకు సబ్సిడీ ఎత్తివేసిన ప్రభుత్వం

పచ్చిరొట్ట విత్తనాలే పంపిణీ 

ఐదేండ్లుగా జాడ లేని ఆర్కేవీవై, టార్పాలిన్‌లది అదే పరిస్థితి 

కోటపల్లి, జూన్‌ 7: వ్యవసాయంలో ఆధునిక మార్పులు తీసుకువస్తున్న ప్రభుత్వం మరో వైపు విత్తనాలపై సబ్సిడీని ఎత్తేసింది. రెండేండ్ల క్రితం వరకు విత్తనాలపై ఇచ్చిన సబ్సిడీకి మంగళం పాడింది. రాయితీకి ప్రభుత్వం రాం రాం పలకడంతో ఇది అన్నదాతకు అదనపు భారంగా మారింది. కేవలం పచ్చి రొట్టకు సంబంధించి నేలలో సారం పెంచే జీలుగ, జనుము విత్తనాలు మాత్రమే రాయితీపై కేటాయించారు. జీలుగ, జనుము విత్తనాలను 60 శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా ఆగ్రోస్‌ సేవా కేంద్రాలతో పాటు డీసీఎంఎస్‌లు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో రైతులకు అందిస్తున్నారు. 

విత్తనాలపై రాయితీకి స్వస్తి..

వానాకాలం సీజన్‌లో సుమారు 4 లక్షల పై చిలుకు ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఇందులో ఎక్కువగా వరి, పత్తి, కందులు, పెసర, మినుము, జొన్న వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ సారి 1.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వరి పంటకు సంబంధించి యాసంగిలో 73,340 ఎకరాల్లో వరి సాగు అయ్యింది. వానాకాలంలో ఇది మూడు రెట్లు పెరగనుంది. పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుండగా తృణధాన్యాల సాగుపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అయితే ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను మాత్రం ప్రభుత్వం సబ్సిడీపై అందించడం లేదు. 2019 వానాకాలంలో పెసర, కంది, మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందించారు. ప్రస్తుతం రాయితీ లేకపోవడంతో రెట్టింపు ధర చెల్లించడం ఈ సారి రైతులకు భారమే. వరి దొడ్డు రకాలు 30 కేజీల బస్తా ఎంటీయూ 1010 రకానికి రూ.900, కేఎన్‌ఎం 118 రకానికి రూ. 900 ఉండగా గత రెండేండ్ల క్రితం రూ. 450లకే రాయితీపై ఇచ్చారు. కానీ ఇప్పుడు సబ్సిడీ లేకపోవడం రైతులకు ఇది అదనపు భారంగా మారింది...

అటకెక్కిన ఆర్కేవీవై

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్కేవీవై) పథకం కింద రాయితీపై గతంలో కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. ఐదేండ్లుగా ఈ పథకం ఊసే లేదు. దీంతో కూరగాయల సాగు తగ్గుతుంది. జిల్లాలోని భీమారం, కిష్టంపేట, కన్నెపల్లి, బెల్లంపల్లి, వేమనపల్లి , దుగ్నేపల్లి, కొండంపేట తదితర గ్రామాల్లో 6 వేల ఎకరాల్లో కూరగాయల సాగు అవుతుంది. ఇప్పుడు ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో కూరగాయల రేట్లు అమాంతం పెరగడానికి కారణమవుతుంది. 

టార్పాలిన్‌లది ఇదే పరిస్థితి...

ప్రభుత్వం గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్‌లు అందించేవారు. 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్‌ ధర రూ. 2500 కాగా సబ్సిడీపై రూ. 1250కు అందించేవారు. వీటిని నాలుగేండ్లుగా నిలిపివేశారు. దీంతో రైతులు బయట మార్కెట్‌లో రూ. 2 వేల నుంచి 3 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. లేదంటే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసి మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్‌లు సబ్సిడీపై అందిస్తే కొంతలో కొంత రైతులకు ఉపయోగపడేదని రైతులు పేర్కొంటున్నారు. 

టార్పాలిన్‌లు అందించాలి 

కందుల వెంకటేష్‌, రైతు, కోటపల్లి

వ్యవసాయ శాఖ రాయితీలపై పరదాలు సరఫరా చేయాలి. బయట ఒక్కో దానికి రూ. 3 వేల ధర పలుకుతుంది. రాయితీపై అందిస్తే రైతులకు అదనపు భారం తగ్గుతుంది. ఇటీవల కురిసిన ఒక్క వర్షానికే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. అదే టార్పాలిన్‌లు ఉంటే నష్టం తగ్గేది. మరో వైపు ధాన్యం తడుస్తుండడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఎంత ధర అయినా చెల్లించాల్సి వస్తుంది.

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం

మహేందర్‌, వ్యవసాయ శాఖ అధికారి, కోటపల్లి

సబ్సిడీపై అందించే విత్తనాలు, కానీ టార్పాలిన్‌లు కానీ సరఫరా కావడం లేదు. జిల్లాలో 25 వేల టార్పాలిన్‌ల అవసరం ఉంది. రైతులు టార్పాలిన్‌లు,  విత్తనాలు అడుగుతున్నారు. వారి వినతులను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటిస్తాం.  

Read more