పోడురైతుల్లో కొత్త ఆశలు

ABN , First Publish Date - 2022-09-27T05:00:30+05:30 IST

ఎట్టకేలకు పోడు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించటంతో పోడు రైతుల్లో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.140 ద్వారా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాలని సంకల్పించింది.

పోడురైతుల్లో కొత్త ఆశలు

-గ్రామకమిటీలను పక్కన పెట్టి ప్రక్రియ ప్రారంభించిన అధికారులు

-జిల్లాలో లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన షురూ

-గ్రామాల వారీగా అర్హుల గుర్తింపు కోసం చర్యలు 

-ఈ దఫా గిరిజనేతరులకు హక్కులు లేనట్టే

-అనధికారికంగా సాగు చేసుకునేందుకు అనుమతి 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఎట్టకేలకు పోడు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించటంతో పోడు రైతుల్లో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.140 ద్వారా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాలని సంకల్పించింది. అయితే దీనిపై ఆదివాసీ సంఘాలు ప్రజాప్రతినిధుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కటంతో హైకోర్టు గ్రామకమిటీల ఏర్పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారయంత్రాంగం గ్రామకమిటీలతో నిమిత్తం లేకుండా పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పోడు హక్కులను కల్పించే విషయంలో ప్రస్తుతానికి ఆదివాసీ గిరిజనులకే పరిమితం చేయటంతో గిరిజనేతర పోడురైతుల సమస్య ఇంకా యధాతథంగానే కొనసాగుతున్నట్లయింది. వాస్తవానికి జిల్లాలో పోడుసాగు వ్యవహారంలో అటవీశాఖ, రైతులకు మధ్య తలెత్తుతున్న వివాదంలో 99శాతం వివాదాలు గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న భూముల్లోనే కొనసాగుతున్నాయి. తాజా నిర్ణయం ప్రకారం గిరిజనేతరులకు హక్కులు కల్పించే అవకాశం లేకపోవటంతో గిరిజనేతర పోడురైతుల్లో కొంత అసంతృప్తి కన్పిస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వీరికి హక్కులు కల్పించకపోయినా రైతులు సాగు చేసుకుంటున్న భూములను గుర్తించి అనధికారికంగా సాగు చేసుకునేలా వెసులు బాటు కల్పించనున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అటవీ శాఖ అనధికారిక సాగుపై ఏమేరకు ప్రభుత్వానికి సహకరిస్తుందనేది మిలియిన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా వ్యతిరేకతను పెంచే పరిస్థితి ఉందని అధికారపార్టీ నేతలు జంకుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు సంకటంగా మారే అవకాశాలున్నాయి. గిరిజనులకు మాత్రమే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులిచ్చే ప్రొవిజన్‌ ఉంది. గిరిజనేతర రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్పా గిరిజనేతరులకు హక్కులు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో పోడు సమస్య మళ్లీ రావణ కష్టంలా రగిలే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.

రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం 2006 ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టానికి అనుగుణంగా 2005 కంటే ముందు నుంచి పోడు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించటంతో ప్రస్తుతంలో జిల్లాలో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే దరఖాస్తు చేసుకున్న గిరిజనుల్లో 65శాతానికి పైగా 2006 తర్వాత పోడు సాగులోకి వచ్చిన వారేనని అటవీశాఖ వర్గాలు అంటున్నాయి. ఆదివాసీ సంఘాలు మాత్రం 2005 కంటే ముందు నుంచే సాగులోఉన్నామని, అప్పట్లో అటవీశాఖ, ఐటీడీఏలు ఉద్దేశ్యపూర్వకంగా తమకు దక్కాల్సిన హక్కులను రాకుండా అడ్డుకునే క్రమంలో తమ దరఖాస్తులను బుట్టదాఖలు చేశారన్నది వారి ఆరోపణ. తాజాగా 2005నిబంధన కనుక ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని తలపిస్తే మాత్రం మరోసారి ఆదివాసీల్లో అలజడిరేగే అవకాశాలున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే వాస్తవానికి అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దులపై స్పష్టత లేకపోవటంతో వేలాది ఎకరాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఏజేన్సీలోని పదిమండలాల్లో ఒకేభూమిని రెండు శాఖలు తమవిగానే పరిగణిస్తుండటంతో వివాదాలు కొనసాగుతున్నాయి. అదీ కాకుండా 2006ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం పట్టాలు జారీచేసిన రైతులకు కూడా ఇప్పటికీ భూములకు సంబంధించిన సరిహద్దులు చూపటంలో రెండు శాఖలు విఫలమయ్యాయి. ఈ కారణంగానే కొలాంగొంది మొదలు ఆసిఫాబాద్‌ మండలం కాగజ్‌నగర్‌లోని కొత్తసార్సాల వరకు అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. సరిహద్దులపై స్పష్టత రాకుండా మళ్లీ పట్టాలు జారీ చేసినా ఫలితం ఉండదనేది రెవెన్యూ వర్గాల వాదన. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టిన పోడు హక్కుల ప్రక్రియ ఈ చిక్కు ముడులన్నింటిని పరిష్కరిస్తేనే సాఫీగా సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

జిల్లాలో పోడు పరిస్థితి..

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో గిరిజనేత రైతులు కూడా పోడునే జీవనాధారంగా చేసుకొని ఐదుదశాబ్ధాల నుంచి జీవనం సాగిస్తున్నారు. ఇందులో జైనూరు మొదలుకొని బెజ్జూరు వరకు 15మండలాల్లోని గిరిజనేతర రైతుల ఆధీనంలో వేలాది ఎకరాలు అటవీ భూములున్నాయి. వీరికి ఎలాంటి పట్టాలు లేవు. అయితే అక్కడకక్కడ రెవెన్యూశాఖ జారీ చేసిన లావుణీ పట్టాలున్నప్పటికీ వాటిని కూడా అటవీ శాఖ తమకు చెందినవిగానే క్లెయిమ్‌ చేస్తోంది. జిల్లాలో పోడు సాగును పరిశీలిస్తే జైనూరు మండలంలో 392మంది గిరిజన రైతులుంటే అంతే సంఖ్యలో గిరిజనేత రైతులు కూడా ఉన్నారు. అలాగే శ్యాందామ్‌, జామిని, పవర్‌గూడ, కొలాస, రాసిమెట్ట, కొండిబగూడ, ఆశపెల్లి, నందునాయక్‌ తండా, జైనూరు, పోచం లొద్ది తదితర గ్రామాల్లో గిరిజనేతర రైతులు ఎక్కువగా సాగు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. అటు లింగాపూర్‌, సిర్పూరు(యూ) మండలాల్లోను దాదాపు 1200ఎకరాల భూములు గిరిజనేతర రైతుల చేతుల్లో ఉన్నాయి. ఇటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని సిర్పూరు(టి) రేంజ్‌ 1000-1500 ఎకరాల్లో గిరిజనేతర రైతులు పోడుసాగు చేసుకుంటున్నట్టు అంచనా వేయగా, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో దాదాపు 2వేల ఎకరాలకు పైగా గిరిజనేతర రైతుల చేతుల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే దహెగాం, పెంచికల్‌పేట మండలాల్లో పోడుభూముల సాగు అధికంగా ఉందంటున్నారు. ఇక్కడ ఏయేటికాయేడు కొత్తగా సాగు జరుగుతుందన్నది అటవీఅధికారుల ఆరోపణ. మొత్తం మీద ఆసిఫాబాద్‌ జిల్లాలో 20వేల ఎకరాలకుపైగా పోడు భూముల సాగు జరుగుతుండగా ఇందులో 8వేల నుంచి 12వేల ఎకరాల్లో గిరిజనేతరులే సాగుచేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-09-27T05:00:30+05:30 IST