చెన్నూరులో మెడికల్‌ కాలేజీ?

ABN , First Publish Date - 2022-10-15T03:47:53+05:30 IST

జిల్లాకు మంజూరైన మెడికల్‌ కాలేజీ చెన్నూరుకు తరలిపోనుందా..అంటే అవుననే సమాధా నమే వస్తోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలనుబట్టి చూస్తే జిల్లా కేంద్రంలో కాకుండా చెన్నూరు మున్సిపాలిటీలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం

చెన్నూరులో మెడికల్‌ కాలేజీ?
జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మెడికల్‌ కళాశాల

 - ధ్రువీకరిస్తున్న  తాజా పరిణామాలు  

 - అక్కడి సింగరేణి క్వార్టర్లలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం

 - హడావిడిగా వంద పడకల ఆసుపత్రికి గ్రీన్‌ సిగ్నల్‌ 

 - జిల్లా కేంద్రంలో అనుమతులు నిరాకరించడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి  

మంచిర్యాల, అక్టోబరు  14 (ఆంధ్రజ్యోతి ): జిల్లాకు మంజూరైన మెడికల్‌ కాలేజీ చెన్నూరుకు తరలిపోనుందా..అంటే అవుననే సమాధా నమే వస్తోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలనుబట్టి చూస్తే జిల్లా కేంద్రంలో కాకుండా  చెన్నూరు మున్సిపాలిటీలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు  చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బయటకు ఎక్కడ కూడా పొక్కకుండా వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులు  ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎంతో కాలంగా మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం జిల్లాల పూర్వ విభజన  చేపట్టిన తర్వాత వైద్య కళాశాల అంశం ప్రస్తావనకు వచ్చింది.  2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మంచి ర్యాల జిల్లాకు వైద్య కళాశాలను కేటాయిస్తూ  జీవో జారీ చేశారు. దీంతో దశాబ్దాల ప్రజల కల సాకారం అయింది. 

ఎన్నో మలుపుల మధ్య..

మంచిర్యాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరైన నాటి నుంచి ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. కళాశాల ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం చివరిదాకా  తీవ్ర ఉత్కంఠను రేపింది. జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, జైపూర్‌ మండలంలోని ఇందారం ఎక్స్‌రోడ్‌ ప్రాంతాల్లో వైద్య కళాశాల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన కూడా జరిపారు. వైద్య కళాశాల తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి  ప్రజలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆందోళనలు సైతం చేపట్టారు. అనంతరం జైపూర్‌ మండలానికి తరలిపోతుందన్న కళాశాల అనేక మలుపుల మద్య ఎట్టకేలకు జిల్లా కేంద్రానికి తరలి వచ్చింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ యార్డులో తాత్కాలిక కళాశాల భవనం నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. రూ. 12 కోట్ల పైచిలుకు నిధులతో ఆర్‌ఆండ్‌బీ శాఖ మార్కెట్‌ యార్డులోని గోదాములకు మార్పులు చేసి కళాశాలకు ఉపయోగపడేలా మార్పులు, చేర్పులు చేపట్టింది.  ప్రస్తు తం కళాశాల నిర్వాహణకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. 

ఎన్‌ఎంసీ వైఖరితో..

జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అధికారులు అనుమతి నిరాకరించడంతో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయి. రెండు దఫాలుగా త నిఖీలను చేపట్టిన ఎన్‌ఎంసీ బృందం మూడో దఫా తనిఖీల్లో అనుమతిని ఇచ్చేందుకు నిరాకరిచింది. రెండు దఫాల్లో కనబడని రేకుల షెడ్‌ విషయమై మూడో దఫాలో  అభ్యంతరాలు వెలువరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో చేపట్టిన పనులు సంతృప్తికరంగా లేవనే  ఉద్దేశంతో ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడం తో ప్రజా ధనం  వృఽథా కావడమే కాకుండా ఇక్కడి ప్రజల దశాబ్దాల కోరికపై నీళ్లు చల్లినట్లయింది. మార్కెట్‌ యార్డులో తాత్కాలిక భవనంలో కొంత కాలం పాటు తరగతులు నిర్వహించిన అనంతరం పక్కా భవనంలోకి మారేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట భూదాన్‌ బోర్డు భూముల్లో  వైద్య కళాశాలకు సుమారు  22 ఎకరాల స్థలం కేటాయించారు.  గత నెలలో ముంచెత్తిన వరదల కారణంగా అది నీట మునగడంతో నస్పూర్‌ మున్సిపాలిటీలోని సీసీసీలో స్థలా న్ని పరిశీలించారు. త్వరలో స్థలం మంజూరుకు అధికారికంగా అనుమతులు కూడా  రానున్నాయి.  అయితే హఠాత్తుగా ఎన్‌ఎంసీ అను మతులు నిరాకరించడంతో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయి. 

మంచిర్యాలలో ఏర్పాటుకు..

మంచిర్యాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతులు నిరాకరించినందున ప్రత్యామ్నాయంగా చెన్నూరులో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. ఎక్కడో ఒక చోట కళాశాల  ఏర్పాటు చేయని  పక్షంలో మొత్తంగా రద్దయ్యే ప్రమాదం ఉన్నందున  చెన్నూరును ఎంపిక చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. గతంలో  చెన్నూరులో సింగరేణి భూగర్బ గనులు ఉండడంతో కార్మికుల కోసం యాజమాన్యం సుమారు  4 వందల వరకు క్వార్టర్లు నిర్మించింది. ప్రస్తుతం అక్కడి గనులు మూసివేయడంతో క్వార్టర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మెడికల్‌ కళాశాలను ఇక్కడ ఏర్పాటు  చేస్తే ఆ క్వార్టర్లను వినియోగిం చుకోవచ్చనే ఉద్దేశంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి క్వార్టర్లకు అవసరం మేరకు మరమ్మత్తులు చేపడితే కళాశాల నిర్వాహణ కు పూర్తి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. క్వార్టర్లు పక్కా భవనాలు కావడంతో ఎన్‌ఎంసీ అభ్యంతరాలు ఉండవనే భావనతో ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసేందుకు దానికి అనుబంధంగా వంద పడకల ఆసుపత్రి ఉండాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో ఈ నెల  11న చెన్నూరులో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందుకోసం రూ. 7 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి పునరావృత వ్య యం రూ.  10.45 కోట్లు,  పునరావృతం కాని వ్యయం రూ.  21.7 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే హడా విడిగా  వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం వెనుక మెడికల్‌ కళాశాల అంశం దాగి ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. 

ప్రజలకు ఉపయోగకరంగా ఉండేనా?

ప్రచారం జరుగుతున్న విధంగా వైద్య కళాశాలను చెన్నూర్‌కు మార్చితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా అనే చర్చ మొదలైంది. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఉంటే ప్రొఫెసర్లు అందుబాటులో ఉండి జిల్లా నలు మూలలా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో  40 కిలోమీటర్ల దూరంలోమారు మూల ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే మిగతా రెండు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర సమయాల్లో జిల్లా కేంద్రం నుంచి చెన్నూరుకు వెళ్లాలంటే రిస్క్‌తో కూడుకున్న పని అవుతుందని, రాత్రి వేళల్లో ఆ రూట్‌లో ప్రయా ణం రక్షణతో కూడుకున్నది కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నా యి. అక్కడ ఏర్పాటు చేసే  వంద పడకల ఆసుపత్రితో సరిపెట్టి జిల్లా  కేంద్రంలోనే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

సమాచారం లేదు..

- ఎండీ సులేమాన్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ 

వైద్య కళాశాల వేరే చోటికి తరలిపోతుందన్న సమాచారం లేదు. ప్రస్తుతం కళాశాల కోసం ఏర్పాటు చేసిన భవనానికే అనుమతులు లభిస్తాయని వేచి చూస్తున్నాం. కళాశాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పా ట్లు, ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం. ఎన్‌ఎంసీ అనుమతులు జారీ చేస్తే కళాశాల ఏర్పాటవుతుంది. మరోవైపు  విధ్యార్థులకు ఇప్పటికే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో వెంటనే అనుమతులు జారీ చేస్తే ఎంతో వెసులుబాటు ఉంటుంది.  

Read more