‘తొలిమెట్టు’ సామర్ధ్యాలపై పట్టు

ABN , First Publish Date - 2022-08-02T04:27:24+05:30 IST

కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా బడులు మూతపడడంతో విద్యార్థుల్లో కనీస పరిజ్ఞానం కన్నా తక్కువగా ఉన్నారని జాతీయ సర్వేలో తేలడంతో ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. విద్యార్థులకు చదవడం, రాయడంతోపాటు కనీస సామర్ధ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ తొలిమెట్టు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో మౌలిక అక్షరాస్యత, గణిత సామర్ధ్యాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లెక్కల్లో బేసిక్స్‌తోపాటు ప్రత్యేక మెళకువలు నేర్పనున్నారు.

‘తొలిమెట్టు’ సామర్ధ్యాలపై పట్టు

పంద్రాగస్టు నుంచి బడుల్లో తొలిమెట్టు ప్రారంభం 

విద్యార్థుల్లో సామర్ధ్యాలు పెంచే దిశగా కార్యక్రమం 

ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ 

కోటపల్లి, ఆగస్టు 1: కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా బడులు మూతపడడంతో విద్యార్థుల్లో కనీస పరిజ్ఞానం కన్నా తక్కువగా ఉన్నారని జాతీయ సర్వేలో తేలడంతో ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. విద్యార్థులకు చదవడం, రాయడంతోపాటు కనీస సామర్ధ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ తొలిమెట్టు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుంచి ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో మౌలిక అక్షరాస్యత, గణిత సామర్ధ్యాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లెక్కల్లో బేసిక్స్‌తోపాటు ప్రత్యేక మెళకువలు నేర్పనున్నారు. విద్యార్థులకు సొంతంగా చదవడం, రాయడం నేర్పిస్తారు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు, పూర్వసంఖ్య భావనలు, ఆసారాలు, పరిమా ణాలు, కొలతలు, తదితర గణితాంశంపై శిక్షణ ఇస్తారు. దీనిపై సెంట్రల్‌ స్వ్కేర్‌ ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రస్థాయిలో రీసోర్స్‌పర్సన్‌లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.  జూలై 26 నుంచి 28 వరకు జిల్లాస్థాయిలో రీసోర్స్‌ పర్సన్‌, కో ఆర్డినేటర్‌లకు శిక్షణ ఇచ్చారు. జూలై 30 నుంచి క్షేత్రస్ధాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం కాగా విడతల వారీగా ఈ నెల 11 వరకు కొనసాగుతుంది. 

విద్యార్థుల్లో సామర్ధ్యాలు పెరిగేలా...

విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్ధ్యాలు పెరిగేలా ఇది ఉపయోగపడ నుంది. విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన తొలిమెట్టు కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగుతుంది. గతంలో ఏబీసీ, త్రీఆర్స్‌ పేరిట తెలుగు, గణితం, ఆంగ్లం అభ్యసనాల పెంపునకు 60 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కానీ ఈసారి విద్యా సంవత్సరం ముగిసే వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధన (ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరుతో తొలిమెట్టు ప్రారంభం కానుంది. 1, 2 తరగతులకు 5 రోజులపాటు పాఠ్యాంశాల బోధన, 6న మూల్యాంకనం నిర్వహిస్తారు. మూడు నుంచి ఐదు తరగతులకు పది రోజులకు ఒకసారి పాఠం, చివరి రోజు మూల్యాంకనం పద్ధతిలో బోధన జరగనుంది. ప్రతీ నెల చివరలో విద్యార్థుల ప్రగతి నమోదు చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల సామర్ధ్యా లను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రగతిని పరిశీలించనున్నారు. 

కరదీపికలతో ముందుకు ....

తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం సంబంధించిన కర దీపికల సహాయంతో తొలిమెట్టు విజయవంతానికి ముందుకు వెళ్లనున్నారు. తెలుగు కర దీపికలో ఆయా తరగతులకు అనుగుణంగా సరళ పదాలు, వర్ణమాల, ఒత్తుల అక్షరాలు, చదవడం, రాయడం,  సొంత మాటల్లో రాయడం లాంటి అంశాలు పెంపొందించనున్నారు.  గణితంలో అంకెలు, సంఖ్యాభావన, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలను రూపొందించారు. ఆంగ్లంలో ఇంగ్లీష్‌ అక్షరాలు, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, పదాల అభ్యసనం, గ్రామర్‌, వ్యాఖ్య నిర్మాణం లాంటి అంశాలతో ఫస్ట్‌ స్టెప్‌ అనే కరదీపికను ముద్రించారు. ఇక పరిసరాల విజ్ఞానానికి సంబంధించి మన చుట్టూ ఉన్న పరిసరాలు,  ప్రకృతికి మనుకున్న సంబంధం, వ్యక్తిగత,  పరిసరాల పరిశుభ్రత, పర్యా వరణం, అడవులతో పాటు పరిసరాలపై అవగాహన పెంపొందించేలా కరదీపికను సిద్ధం చేశారు. కరదీపికల ద్వారా ప్రణాళికబద్దంగా విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల విద్యార్థుల్లో సామర్ధ్యాలను పెంచనున్నారు. 

తొలిమెట్టుతో ప్రయోజనం

డాక్టర్‌ గట్టు త్రివేణి, రాష్ట్ర పరిశీలకులు 

తొలిమెట్టు ద్వారా విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.  పాఠ్య బోధనలో కరదీపికలు ఎంతో అవసరం. కనీస సామర్ధ్యాల సాధనతో పాటు తరగతి వారీగా సామర్ధ్యాల సాధనకు కృషి చేయడమే తొలిమెట్టు లక్ష్యం. 

విద్యార్థుల్లో సామర్ధ్యాల పెంపునకు శ్రీకారం

ఎస్‌.  వెంకటేశ్వర్‌, జిల్లా విద్యాధికారి, మంచిర్యాల 

విద్యార్థుల్లో సామర్ధ్యాల పెంపునకు తొలిమెట్టు శ్రీకారం చుట్టనుంది. తెలుగు, ఆంగ్లం భాషాభివృద్ధితోపాటు గణితంలో సామర్ధ్యాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. తొలిమెట్టు విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇప్పటికే జిల్లా స్ధాయిలో శిక్షణ పూర్తి కాగా , మండల స్ధాయిలో శిక్షణ కొననగుతోంది.   

Updated Date - 2022-08-02T04:27:24+05:30 IST