మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-13T03:49:02+05:30 IST

మావోయిస్టుల్లో చేరేందుకు సిద్ధమైన ఆరుగురు సానుభూతిపరులను ఆది వారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ తెలిపారు.

మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సురేష్‌ కుమార్‌

- 53 డిటోనేటర్స్‌, 27 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

- విలేకరుల సమావేశంలో ఎస్పీ సురేష్‌కుమార్‌ వెల్లడి

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 12: మావోయిస్టుల్లో చేరేందుకు సిద్ధమైన ఆరుగురు సానుభూతిపరులను ఆది వారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ తెలిపారు. కాగజ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ఉన్న మడె హన్మం తు కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడె ఏక్‌నాథ్‌, నాగపురి చక్రపాణి, జాడె శాంతరాంలను మావోయిస్టు పార్టీలో చేర్పించేందుకు తీసుకెళుతుండగా పట్టుకున్నామని ఎస్పీ ప్రకటించారు. బెజ్జూరు మండలం కుశ్నపల్లిలోని వాగు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరంతా ద్విచక్రవాహనాలతో అనుమానాస్పదంగా కనిపించారన్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 53 డిటోనేటర్స్‌, 27 జిలెటిన్‌ స్టిక్స్‌తోపాటు 5సెల్‌ఫోన్స్‌, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నాయకులు భాస్కర్‌ అలియాస్‌ మైలారపు ఆడెల్లు, వర్గీస్‌ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సంద్ర అటవీ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టు నాయకులను హన్మంతు కలిశారన్నారు. 1989లో కరువు దాడుల్లో పాల్గొన్న మడె హన్మంతుతో పాటు మరో ఇద్దరు మడె నారాయణ, ఆలం భగవాన్‌లు కలిసి వీరిని పోత్సహించారన్నారు. వీరు కొంత కాలంగా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. మావోయిస్టుల మాయమాటలతో ముగ్గురిని పార్టీలో చేర్పించేందుకు తీసుకెళుతున్నట్లు ఒప్పుకున్నారన్నారు. ఈ సందర్భంగా  సానుభూతిపరులను పట్టుకునేందుకు కృషి చేసిన కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ స్వామిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో కాగజ్‌నగర్‌ టౌన్‌, రూరల్‌ సీఐలు రవీందర్‌, నాగరాజు, ఎస్సైలు పాల్గొన్నారు.

Read more