అటవీ, పంచాయతీ శాఖల మఽధ్య లొల్లి

ABN , First Publish Date - 2022-07-07T07:29:46+05:30 IST

జిల్లాలో అటవీ, పంచాయతీశాఖల మధ్య లొల్లి ముదురుతోంది.

అటవీ, పంచాయతీ శాఖల మఽధ్య లొల్లి

రేంజ్‌ ఆఫీసుకు తాళం వేసిన ఘటనపై అటవీశాఖలో దుమారం 

అటవీశాఖనే టార్గెట్‌ చేయడంపై అధికారులు, ఉద్యోగుల అసంతృప్తి 

నిబంధనల ప్రకారమేనంటున్న పంచాయతీశాఖ 

చర్చనీయాంశమవుతున్న ఉన్నతాధికారుల తీరు 

నిర్మల్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అటవీ, పంచాయతీశాఖల మధ్య లొల్లి ముదురుతోంది. గత కొంతకాలం నుంచి ఈ రెండుశాఖల మధ్య సమన్వయం కొరవడడం చర్చనీయాంశమవుతోంది. చిలికిచిలికి గాలివానలాగా ఈ రెండుశాఖల తీరు పరస్పర విమర్శలకు దారి తీస్తోంది. కడెం మండలంలోని ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసుకు పన్ను బకాయిలు చెల్లించడం లేదన్న ఆరోపణలపై పంచాయతీశాఖ సీజ్‌ చేయడం దుమా రం రేపుతోంది. ఈ వ్యవహారం అటవీశాఖ అధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. రేంజ్‌ ఆఫీసుకు పంచాయతీ అధికారులు తాళం వేయడంతో ఫారెస్టు అధికారులంతా ఆరుబయట టేబుళ్లపై తమ విధులను నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే పంచాయతీశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తమ శాఖను టార్గెట్‌గా చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆస్తి పన్ను బకాయి పేరిట కేవలం అటవీశాఖ కార్యాలయాన్నే టార్గెట్‌ చేసి ఏకంగా కార్యాలయానికి తాళం వేయడం వెనక వేరే ఉద్దేశం ఉందంటున్నారు. అటవీశాఖ భూముల్లో డంపింగ్‌ యార్డులు, స్మశానవాటికలు, ప్రకృతివనాలు, క్రీడామైదానాలు లాంటివి ఏర్పాటు చేస్తున్న కారణంగానే ఈ రెండుశాఖల మధ్యదూరం పెరిగిందంటున్నారు. మొదట్లో నిర్మాణా లకు అటవీశాఖ నిబంధనల పేరిట అడ్డు తగిలినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో నిర్మాణాలకు అంగీకారం తెలిపింది. అయితే కొన్ని చోట్ల పంచాయతీశాఖ అధికారులు టైగర్‌జోన్‌ కోర్‌ ఏరియాలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవ్వడంతో అటవీశాఖ ఆ నిర్మాణాలను సీరియస్‌గా అడ్డుకుంది. ముఖ్యంగా కడెం మండలంలోని బుట్టాపూర్‌ గ్రామంలో గల టైగర్‌ రిజర్వ్‌కోర్‌ ఏరియాలో క్రీడామైదానాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రతిపాదించారు. అయితే అటవీ నిబంధనల ప్రకారం టైగర్‌రిజర్వ్‌కోర్‌ ఏరియాలో ఎలాం టి నిర్మాణాలు చేపట్టరాదని, అలాగే ఎలాంటి అభివృద్ది పనులు కూడా చేయవద్దంటూ నిబంధనలున్నాయి. అయితే ఈ నిబంధనలను పట్టించుకోకుండా పంచాయతీశాఖ క్రీడామైదానం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అటవీశాఖ అధికారులు దీనిని సీరియస్‌గా అడ్డుకోవడమే కాకుండా అనుమతి నిరాకరించారు. అప్పటి నుంచి అటవీశాఖపై పంచాయతీశాఖ అధికారులు కక్షగట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఈ రెండుశాఖల మధ్య చిలికిచిలికి గాలివాన లాగా పరిస్థితి మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గల అనేక ప్రభుత్వ కార్యాలయాలు పన్నుల బకాయిలు ఉన్నప్పటికి కేవలం ఫారెస్ట్‌రేంజ్‌ ఆఫీసునే లక్ష్యంగా చేసుకోవడం చర్చకు తావిస్తోంది. ఈ వ్యవహారం వెనక ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందంటూ ప్రచారం జరుగుతోం ది. ఏ ఇతర శాఖలకు లేని పన్ను నిబంధన కేవలం అటవీశాఖకే వర్తిస్తుందా అని ఆశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ, పంచాయతీ శాఖల మధ్య ఈ వ్యవహారం అగ్గి రాజేస్తోందంటున్నారు. 

మంత్రికి ఫిర్యాదు

కాగా అటవీశాఖ రేంజ్‌ ఆఫీసుకు తాళం వేసిన వ్యవహారాన్ని ఆ శాఖ అధికారులు సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. అయితే ఇది శాఖల మధ్య వ్యవహారం గనక ఉన్నతాధికారులే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతారని పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా అటవీశాఖ ఉద్యోగుల సంఘం బాధ్యులు మంగళవారం నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మంత్రి సైతం పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అటవీశాఖపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిపోయి కక్షపూరితంగా వ్యవహరించడం సమంజసం కాదంటూ మంత్రి సంబంధిత అధికారులపై మండిపడినట్లు తెలిసింది. 

ఆరుబయటనే విధులు

ఇదిలా ఉండగా కడెంలోని అటవీరేంజ్‌ ఆఫీసుకు పంచాయతీ అధికారులు మంగళవారం తాళం వేసినప్పటి నుంచి సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ కార్యాలయం ఆరుబయటనే విధులు నిర్వహిస్తున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కారణంగా జరిగిన పరిణామాలపై తమ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, తాము ఈ విషయంలో చేసేదేమి లేదంటూ అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాము మాత్రం విధులను ఆపేది లేదంటూ బుధవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు ఆరుబయట కుర్చీలు వేసుకొని పను లు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు పంచాయతీ శాఖలోనూ అటు అటవీశాఖలోనూ చర్చనీయాంశంగా మారిందంటున్నారు. 

జిల్లా యంత్రాంగం స్పందనపై ఆసక్తి

ఇదిలా ఉండగా పంచాయతీ, అటవీశాఖల మధ్య నెలకొన్న తాజా వివాదంతో జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాం గం తీరుపై కూడా అటవీశాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము టైగర్‌జోన్‌ కోర్‌ ఏరియాలో క్రీడా మైదానాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతోనే పంచాయతీశాఖ అధికారులు కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారంటూ అటవీ అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు. అటవీశాఖరేంజ్‌ కార్యాలయానికి పన్ను బకాయిల పేరిట తాళం వేసిన వ్యవహారం వెనక జిల్లా యంత్రాంగం పాత్ర కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకే అటవీశాఖ కార్యాలయానికి తాళం వేసి ఉండవచ్చన్న అనుమానాలను కూడా సంబంధితశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి తాము ఆరుబయటనే విధులు నిర్వహిస్తున్నప్పటికి జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోతుండడం పట్ల అటవీశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొ త్తానికి ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లోపం అన్నిశాఖల్లో కొత్త చర్చకు దారితీస్తోందంటున్నారు.

నిబంధనల ప్రకారమే

 అటవీశాఖ కార్యాలయానికి నిబంధనల ప్రకారమే తాళం వేశారు. పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే తాము నాలుగైదు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికి అటవీశాఖ స్పందించలేదు. కాగా పన్ను బకాయి చెల్లింపు కోసమే అటవీశాఖ కార్యాలయానికి తాళం వేశామే తప్పా మరో దురుద్దేశం లేదు. నిబంధనల ప్రకారం మిగతా వ్యవహారమంతా ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. 

- శ్రీలత,  జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్‌

ఫారెస్ట్‌ ఆఫీసునే టార్గెట్‌ చేయడం సమంజసం కాదు

జిల్లాలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పన్ను బకాయిలు ఉన్నప్పటికి కేవలం అటవీశాఖపైనే చర్యలు తీసుకోవడం వెనక మరేదో ఉద్దేశం ఉండవచ్చు. పంచాయతీ అధికారులు గంగాపూర్‌లోని అటవీస్థలంలో తమ సిబ్బంది క్వార్టర్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. మా శాఖపై కక్ష పూరిత చర్యలు సమంజసం కాదు. 

Read more