శంకుస్థాపనలకే పరిమితం...!

ABN , First Publish Date - 2022-09-14T03:36:59+05:30 IST

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న నర్సింగ్‌ కళాశాలకు మోక్షం కలగడం లేదు. మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించినప్పటికి అది ప్రతి పాదనలకే పరిమితమైంది. మెడికల్‌ కాలేజీ పనులు దాదాపు పూర్తి కాగా నర్సింగ్‌ కాలేజీ నిర్మాణాన్ని శంకుస్థాపనతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాకు మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

శంకుస్థాపనలకే పరిమితం...!
నర్సింగ్‌ కళాశాల, డయగ్నోస్టిక్‌ హబ్‌లకు శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర మంత్రి హరీష్‌రావు (ఫైల్‌)

ఆరు నెలలు గడుస్తున్నా నర్సింగ్‌ కాలేజీ ఊసే లేదు  

రూ. 40 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన 

డయగ్నోస్టిక్‌ హబ్‌ది అదేదారీ

పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు  

ఇబ్బందులు పడుతున్న ప్రజలు  

మంచిర్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేయనున్న నర్సింగ్‌ కళాశాలకు మోక్షం కలగడం లేదు. మెడికల్‌ కాలేజీతో పాటు నర్సింగ్‌ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించినప్పటికి అది ప్రతి పాదనలకే పరిమితమైంది. మెడికల్‌  కాలేజీ పనులు దాదాపు పూర్తి కాగా నర్సింగ్‌ కాలేజీ నిర్మాణాన్ని శంకుస్థాపనతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన తర్వాత  ప్రతీ జిల్లాకు మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.  జిల్లాల పునర్విభజన అనంతరం పనులు చేపట్టేందుకు అవసరమైన స్థలం ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో   ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి స్థలా న్ని ఎంపిక కూడా చేశారు. అయినప్పటికీ పనులు ముందుకు సాగక పోవడం గమనార్హం. దీంతో ఈ ప్రాంతానికి చెందిన నర్సింగ్‌ విద్యార్థులు ఇతర ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లి విద్యను అభ్యసించాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాకు కళాశాల మంజూరైనందున నిర్మాణం త్వరితగతిన  చేపట్టాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  

శంకుస్థాపన చేసి ఆరు నెలలు 

నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచినా పనుల్లో ఎలాంటి పురోగతి కానరావడం లేదు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల భూదాన్‌ యగ్న బోర్డు భూముల్లో సర్వే నంబర్లు  708, 709లోని 22 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఇందులో మెడి కల్‌ కళాశాలతోపాటు నర్సింగ్‌ కాలేజీ, డయగ్నోస్టిక్‌ హబ్‌ తదితర నిర్మా ణాలు చేపట్టేందుకు నిశ్చయించారు. నర్సింగ్‌ కళాశాల కోసం హెల్త్‌ మిష న్‌ ద్వారా రూ.40 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ అయ్యాయి. దీంతో ఈ ఏడాది మార్చి 4న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆరు నెలలు గడుస్తున్నా కళాశాల నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. గతంలో ఎంపిక చేసిన స్థలం కూడా ఇప్పుడు పనికి వచ్చేలా కానరావడం లేదు.  

నర్సింగ్‌ క ళాశాల నిర్మాణం ఎక్కడ?

గతంలో కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం జూలైలో సంభవించిన భారీ వరదల కారణంగా ముంపునకు గురైంది. ఈ స్థలాన్ని ఆనుకొని ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనం మొదటి అంతస్థు వరకు నీట మునిగింది. ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా మారింది.  బాలింతలు, గర్భిణులకు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. ఎంసీహెచ్‌ పక్కనే ఉండడంతో స్థలం మొత్తం నీట మునిగింది. అదే స్థలంలో నర్సింగ్‌ కళాశాల భవనం నిర్మిస్తే తర చుగా వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ఆ ప్రయత్నా న్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరో చోట స్థలం ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. 

డయగ్నోస్టిక్‌ హబ్‌దీ అదే దారీ...!

జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన డయగ్నోస్టిక్‌ హబ్‌ నిర్మాణం  పునాదుల స్థాయిలో ఉండడం కొసమెరుపు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులు రూ. 1.25 కోట్లతో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా అవే భూదాన్‌ భూముల్లో స్థలాన్ని ఎంపిక చేశారు. దీనికి కూడా మార్చి  4న   మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థలాన్ని కాలేజీ రోడ్డులోని వయో వృద్ధుల డేకేర్‌ సెంటర్‌, సఖీ కేంద్రం మధ్యలోకి మార్చారు. అక్కడ పనులు ప్రారంభించినప్పటికి పిల్లర్ల దశలోనే నిర్మాణం ఉంది. శంకు స్థాపన చేసి ఆరు నెలలు గడుస్తున్నా పనులు పునాదులు దాటకపోవ డంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డయగ్నోస్టిక్‌ హబ్‌ పూర్తయితే   ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుతాయి. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్‌, ఎక్స్‌రేతో పాటు రక్త, మల, మూత్ర పరీక్షలకు ల్యాబ్‌ సౌకర్యం ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. డయగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని ల్యాబ్‌ల మాదిరిగా సేవలందే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాలు, అర్భన్‌ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల పరిధిలోని వివిధ ఆసు పత్రుల్లో అన్ని రకాల పరీక్షలు చేయడం సాధ్యం కాదు. దీంతో  ప్రభు త్వం  డయగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేయాలనే నిశ్చయానికి వచ్చింది. భవన నిర్మాణం పూర్తయి డయగ్నోస్టిక్‌ హబ్‌ ప్రారంభిస్తే రేడియాలజీ, పాథాలజీ, వైరాలజీ విభాగాల్లో అధునాతన సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.  ప్రభుత్వం అవసరమైన నిధులు త్వరితగతిన విడుదల చేసి  డయగ్నోస్టిక్‌ హబ్‌ నిర్మాణం పూర్తయ్యేలా  చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2022-09-14T03:36:59+05:30 IST