అరచేతిలో ప్రాణాలు

ABN , First Publish Date - 2022-08-01T04:11:57+05:30 IST

సింగరేణి బొగ్గు బావుల్లో పేల్చే బత్తి దెబ్బలకు ఇళ్ల గోడలు బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతాయోనని ప్రభావిత గ్రామాల ప్రజలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు

అరచేతిలో ప్రాణాలు
కాసిపేట మండలం గుండ్లపాడ్‌లో బీటలు వారిన ఇల్లు

- పేలుళ్లకు బీటలు వారుతున్న ఇళ్లు

- బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం

- పట్టించుకోని సింగరేణి యాజమాన్యం  

కాసిపేట, జూలై 31: సింగరేణి బొగ్గు బావుల్లో పేల్చే బత్తి దెబ్బలకు ఇళ్ల గోడలు బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతాయోనని ప్రభావిత గ్రామాల ప్రజలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కేకే ఓసీపీ, కాసిపేట, కాసిపేట 2 గనుల్లో పేలుతున్న బత్తి దెబ్బలకు సమీపంలోని ఇండ్లు బీటలు వారుతున్నాయి. కేకే ఓసీపీ పేలుళ్ళకు సోమగూడెం, సోమగూడెం భరత్‌ కాలనీ, ఎన్‌టీఆర్‌ కాలనీ, ట్యాంకు బస్తీ, చొప్పరిపల్లె, గోండుగూడెం గ్రామాల్లో ఇండ్లు బీటలు వారగా కాసిపేట భూగర్భ గనిలో పేలుతున్న బత్తి దెబ్బలకు ముత్యంపల్లి, గుండ్లపాడ్‌, కాసిపేట గ్రామాల్లో కొన్ని ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. గుండ్లపాడ్‌లో పగిలిన గోడలను చూస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకు ని కాలం వెళ్లదీస్తున్నామని బాధిత గిరిజన కుటుంబాలు విలపిస్తున్నాయి. 

మౌలిక వసతుల కల్పనలో..

సింగరేణి ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో యా జమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి డివిజన్‌ పరిధిలోని కాసిపేట మండలంలో కళ్యాణిఖని మెగా ఓసీపీతో పాటు రెండు భూగర్భ గనులు ఉన్నాయి. ఉపరితల గని వల్లనే అనేక దుష్పరిణామాలు ఎదురవుతండగా గ్రామాల మధ్య వెలిసిన భూగర్భ గనులతో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను నేరుగా ప్రభుత్వ ఖాతా లో జమ చేయడంతో ప్రభావిత గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకో వడం లేదు. దీంతో బొగ్గు బావుల్లో పేల్చే బత్తి దెబ్బలకు ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులవుతున్నారు. మరికొన్ని ఇండ్లు బీటలు వారి ఎప్పుడు కూలుతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.  అలాగే ప్రభావిత గ్రామాల్లో మిన రల్‌ వాటర్‌ ప్లాంటు (శుద్దజలం) ఏర్పాటు చేసి నీరందించాల్సిన యాజ మాన్యం బొగ్గు బావుల నుంచి వెలికితీసిన నీటిని అందిస్తుంది. ఈ నీరు కూడా కొన్ని గ్రామాలకే అందడంతో సమీప ప్రాంతాల్లోని గిరిజన గూడాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను ప్రభుత్వ ఖాతాల్లో జమ చేస్తున్నామని చెబుతున్న సింగరేణి యాజ మాన్యం చేతులు దులుపుకుంటుంది. భూగర్భ గనులతో చేదబావుల్లోని నీరు ఎండిపోగా చేతి పంపులు చెడిపోతే మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. కనీస అవసరాలు కల్పించాల్సిన సింగరేణి యాజమా న్యం మౌలిక వసతులు కల్పించకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

-  సాగు భూములు సింగరేణి ఆధీనంలో..

సాగు భూములు సింగరేణి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. మండలంలోని వ్యవసాయ కూలీలందరు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారిపోయారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో చదువుకున్న యువకులకు వృత్తి విద్య నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సింగరేణి  ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జీఎంకు విన్నవించినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భయంతో బతుకుతున్నాం

 - పెంద్రం గంగుబాయి, గుండ్లపాడ్‌ గ్రామం

కాసిపేట గనిలో పేలుతున్న బత్తి దెబ్బలకు నా ఇల్లు బీటలు వారింది. గోడ రెండు ముక్కలు అయ్యింది. ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది. నాకు ఎవరు లేరు. ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఇల్లు పగులుతుందని గ్రామ పటేల్‌ అధికారులకు చెప్పినా ఎవరు వచ్చి చూడడం లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు మళ్లీ ఇల్లు కట్టుకోవాలంటే అయ్యే పని కాదు. సింగరేణి నన్ను ఆదుకోవాలి. 

నాకు న్యాయం చేయాలి 

- నాయిని బుచ్చమ్మ, ముత్యంపల్లి 

2013లో నా ఇంటి ఆవరణలో పెద్ద బుంగ పడి ఇంటి ప్రహారీ గోడ, చేద బావి కూలిపోయింది. జరిగిన సంఘటనకు ఇంట్లో వాళ్లందరం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాం. సింగరేణి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి గమనించి ఇల్లు కట్టిస్తామని, సింగరేణి క్వార్టర్‌ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. అధికారుల చు ట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. సింగరేణి అధికారులు మాకు న్యాయం చేయాలి. 

Updated Date - 2022-08-01T04:11:57+05:30 IST