శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-11-16T22:17:44+05:30 IST

కాగజ్‌నగర్‌, నవంబరు 16: రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణంలో పలు ప్రారంభోత్సవాల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం

- కాగజ్‌నగర్‌, రెబ్బెనలో పోలీస్‌స్టేషన్లు ప్రారంభం

- ఎమ్మెల్యే కోనప్ప సేవలు భేష్‌

కాగజ్‌నగర్‌, నవంబరు 16: రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణంలో పలు ప్రారంభోత్సవాల అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సెక్యూలరిజం వ్యవస్థ తెచ్చినట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా షీం టీం వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిధులు మంజూరు చేయించి పోలీస్‌ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించినట్టు తెలిపారు. పోలీసు శాఖలో 33శాతం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నూతన పోలీస్‌స్టేషన్లకు రూ.12.30కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఈ నిధులతో కాగజ్‌నగర్‌, రెబ్బెన, వాంకిడి, కౌటాల, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్‌ మండలాల్లో నూతన పోలీస్‌స్టేషన్లు నిర్మించామన్నారు. ఇటీవల కూలిన అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పరిశీలిస్తామన్నారు. ఈ బ్రిడ్జి స్థానంలో మరమ్మతులు చేయటమా..? కొత్త బ్రిడ్జికి ఏర్పాటు చేయటమా అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ల అభివృద్ధికి సీఎం ప్రత్యేక నిధులు విడుదలు చేస్తున్నట్టు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖలో అనేక మార్పులు తెస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీని తెలంగాణ పోలీసులు వాడుతున్నట్టు తెలిపారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రూపాయలు 12 కోట్లతో పోలీసు భవనాలు మంజూరు చేయటం గొప్ప విషయమన్నారు. మారుమూల ప్రాంతానికి ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ కేటాయించటంతో చక్కటి సేవలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌, అదనపుకలెక్టర్‌ వీరేశం, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఏఎస్పీ అశ్చేశ్వర్‌రావు, డీఎస్పీ కరుణాకర్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో హెలిప్యాడ్‌ ఏర్పాటు

రాష్ట్ర హోం మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో కాగజ్‌నగర్‌ ఎస్పీఎం క్రీడా మైదానంలో ప్రత్యేక హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటలకు మంత్రి కాగజ్‌నగర్‌కు రాగా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆధ్వర్యంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీవైస్‌ చైర్మన్‌కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, ఏఎస్పీ ఆశ్చేశ్వర్‌ రావు తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే కోనప్ప సేవలు భేష్‌

సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేపడుతున్న అన్నదాన సత్రాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం సత్రాన్ని నిర్వహించే తీరు తెన్నులను ఎమ్మెల్యే కోనప్పను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి భోజనం చేస్తున్న వారితో కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే కోనప్ప విద్యార్థులకు చేపడుతున్న ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనం తరం విద్యార్థులతోకాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప చేస్తున్న సేవలు భేష్‌గా ఉన్నాయన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయటం బాగుందన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు గతేడాది రాష్ట్ర స్థాయిలో ద్వితీయస్థానం తెచ్చారని, ఈ సారి ప్రథమ స్థానం తేవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్పను అభినందించారు.

కాగజ్‌నగర్‌లో మంత్రుల పర్యటన..

హోం మంత్రి పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవాలను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ మండలంలోని బలగల గ్రామంలో ఏర్పాటు చేసిన బాలుర మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలలను ప్రారంభించారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన మంత్రులు..

రెబ్బెన: మండలకేంద్రంలో బుధవారం రెబ్బెన, వాంకిడి పోలీస్‌స్టేషన్లను హోంశాఖ మత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు సాంకేతికతను పెంపొందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతోపాటు స్థానిక సీఐ అల్లం నరేందర్‌, ఎస్సై భూమేష్‌, జడ్పీటీసీ సంతోష్‌, ఎంపీపీ సౌందర్య, సర్పంచి వినోద, ఎంపీటీసీ హరిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T22:18:24+05:30 IST

Read more