కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!

ABN , First Publish Date - 2022-01-29T04:27:21+05:30 IST

జిల్లాలోని ఏజేన్సీని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఇటు ఒమైక్రాన్‌, అటు వాతావరణ మార్పుల కారణంగా జిల్లాలోని 15మండలాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా కన్పిస్తోంది.

కుమరం భీం ఆసిఫాబాద్‌లో ఏజెన్సీకి జ్వరమొచ్చింది!

-జిల్లాలో భారీగా జ్వర పీడితులు

-మంచం పట్టిన బెజ్జూరు

-ఫీవర్‌ సర్వేలోనూ వెల్లడి

-జిల్లాలో 3వేల మందికిపైగా గుర్తింపు 

-రెండో విడత సర్వే షురూ 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

జిల్లాలోని ఏజేన్సీని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఇటు ఒమైక్రాన్‌, అటు వాతావరణ మార్పుల కారణంగా జిల్లాలోని 15మండలాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా కన్పిస్తోంది. మొదటి దఫా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తుండగానే వాతావరణంలో ఊహించని మార్పులు ఏర్పడి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ రెండో విడత ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈనెల 21న నుంచి 27వరకు ఆరు రోజుల పాటు ఫీవర్‌ సర్వే నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వేలో కొవిడ్‌ లక్షణాలు కలిగిన బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు గుర్తించారు. వీరి నివేదికల మేరకు సమీక్షించిన అధికార యంత్రాంగం ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు ఫీవర్‌ సర్వేను నిరంతరం కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగాలో శుక్రవారం 642 వైద్య బృందాలు గ్రామాల్లో రెండో విడత స్ర్కీనింగ్‌ మొదలెట్టాయి. మొదటి విడత స్ర్కీనింగ్‌లో భాగంగా మొత్తం 1.53లక్షల కుటుంబాలను స్ర్కీనింగ్‌ చేయగా 3,007మందికి ఒమైక్రాన్‌ కొవిడ్‌ లక్షణాలున్నట్టు గుర్తించి వారికి మందుల కిట్‌లను అందించారు. అయితే ఈ కేసులన్నీ కొవిడ్‌ కేసులని చెప్పలేమని అన్నారు. వాతావరణం కారణంగా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయంటున్నారు. సర్వే సందర్భంగా చాలామంది లక్షణాలున్నప్పటికీ సమాజానికి భయపడి వాస్తవాలు వెల్లడించలేకపోయారు. అలాంటి వారు పొరుగు జిల్లాలోకి వెళ్లి చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. మూడు రోజులుగా ఆసిఫాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, సిర్పూరు(యూ), లింగాపూర్‌ మండలాల్లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో తిరిగి జ్వరాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. అయితే పెద్దసంఖ్యలో బాధితులున్న కారణంగా ఏది సాధారణ జ్వరమో, ఏది కొవిడ్‌ జ్వరమో నిర్ధారించే పరిస్థితి లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రామానిక లక్షణాలు ఆధారంగా బాధితులందరికీ కొవిడ్‌ కిట్‌లను అందజేస్తోంది. 

అటవీ గ్రామాల్లో పెరుగుతున్న విష జ్వరాలు

జిల్లాలోని కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల్లో విషజ్వరాలు కూడా భారీగా ప్రభలుతున్నట్టు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో వ్యవసాయ పనుల కోసం బయట ఉండే వారు ఉదర సంబంధమైన సమస్యలకు గురవుతున్నారు. దీంతో చలితో కూడిన జ్వరంతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని ప్రైవేటు నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా బెజ్జూరు మండలంలో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్యఆరోగ్యశాఖ రెండో విడత స్ర్కీనింగ్‌ను అటవీ గ్రామాలపై ఎక్కువగా ఫోకస్‌ చేసింది. పోలీసులు కూడా ప్రత్యేక కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-01-29T04:27:21+05:30 IST