రోడ్డు అలైన్‌మెంట్‌ రాజకీయ చట్రంలో

ABN , First Publish Date - 2022-12-30T00:25:46+05:30 IST

జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ మీదుగా వెళ్లే ప్రధానరోడ్డు నిర్మాణ వ్యవహారం రాజకీయ చక్రబంధంలో చిక్కుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

రోడ్డు అలైన్‌మెంట్‌ రాజకీయ చట్రంలో
కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనుల దృశ్యం (ఫైల్‌)

చేతులు మారుతున్న లక్షల రూపాయలు

అనుకూలమైన వారి కోసం కలెక్టరేట్‌ రహదారి నిర్మాణ రూట్‌మ్యాప్‌ మార్పు

చోటా నేతలపై మంత్రి గుస్సా

నిర్మల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొత్త కలెక్టరేట్‌ మీదుగా వెళ్లే ప్రధానరోడ్డు నిర్మాణ వ్యవహారం రాజకీయ చక్రబంధంలో చిక్కుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కొంతమంది ఈ రోడ్డు అలైన్‌మెంట్‌ను తలకిందులు చేస్తూ లక్షల రూపాయలు సెటిల్‌మెంట్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెతుత్తున్నాయి. నేషనల్‌ హైవేనంబర్‌ 61, రెడ్డి ఫంక్షన్‌హాల్‌ ఎదురు నుంచి ఎల్లపెల్లి మీదు గా బంగల్‌పేట్‌ వరకు ఈ రోడ్డును నిర్మించేందు కోసం ప్రభుత్వం రూ. 28 కోట్లను మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే మొదటశిఖం భూమిని తాకకుండా ప్రైవేటు భూములను సేకరించి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 80 అడుగులతో నాలుగు వరుసలుగా నిర్మించే ఈ రోడ్డుకు ఇరువైపులా విలువైన భూములు ఉండడం, ఆ భూముల ధరలు కోట్ల రూపాయల్లో పలుకుతున్న కారణంగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల కన్ను ఇటువైపు పడింది. వారంతా భూముల యజమానులతో సెటిల్‌మెంట్‌లు చేసుకొని వారి భూముల నుంచి రోడ్డు నిర్మాణం జరగకుండా అలైన్‌మెంట్‌లను మార్చినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ భూములకు ఆనుకొని ఉన్న శిఖంభూమిలో రోడ్డును శిఖంభూమిలోకి రోడ్డును మార్చినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నాయకులు ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసి శిఖంభూముల్లో రోడ్డును నిర్మించవద్దని భూసేకరణకు సంబంధించి నిధులు కూడా మంజూరైనప్పటికి అఽధికార పార్టీ నాయకులు శిఖం భూముల్లో రోడ్డును నిర్మించాలంటూ ఒత్తిడి తీసుకువస్తుండడం చర్చనీయాంశమవుతోంది. కొంతమంది అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గత వారం రోజుల నుంచి సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి అలైన్‌మెంట్‌నే మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకుల ఆందోళనలతో అధికారులు అప్రమత్తం కాగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం మంత్రి పార్టీ నాయకులతో మాట్లాడి అలైన్‌మెంట్‌ను మార్చే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో మళ్ళీ ఈ అలైన్‌మెంట్‌ వ్యవహారం పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసే అవకాశం ఉందన్న భావనతో మంత్రి పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలంటూ అఽధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా జిల్లా కలెక్టర్‌తో కూడా మంత్రి ఈ విషయమై చర్చించి నిబంధనల ప్రకారం రోడ్డును నిర్మించాలని ఎక్కడ కూడా అలైన్‌మెంట్‌ మార్పు జరగకుండా చూడాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌ కూడా పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో చర్చించి అలైన్‌మెంట్‌ మార్పు చేయవద్దని మొదట్లో నిర్దేశించిన విధానంలోనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని హెచ్చరించినట్లు సమాచారం. గత కొద్దిరోజుల నుంచి అధికార పార్టీ నేతల భూముల విషయంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్‌ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం సర్వేనంబర్‌లతో సహా ఆధారాలు చూపుతున్నామని విచారణకు సిద్ధం కావాలంటూ డిమాండ్‌ చేయడం లాంటి వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ కలెక్టరేట్‌ కొత్త రోడ్డు అలైన్‌మెంట్‌ వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడం అఽధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి మింగుడు పడడం లేదంటున్నారు. చిలికి చిలికి గాలివానలాగా అలైన్‌మెంట్‌ మార్పు విషయం అఽధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చిక్కుముడిగా మారే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

చేతులు మారిన లక్షల రూపాయలు

ఇదిలా ఉండగా రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కొంతమంది బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తుల భూములను కాపాడేందుకు రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్పు చేయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకున్న రాజకీయ పలుకుబడితో వీరు చక్రం తిప్పి అలైన్‌మెంట్‌ను మార్పు చేయించినట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అంతటా ఈ వ్యవహారం హట్‌ టాఫిక్‌గా మారింది. కొంతమంది అమాయకుల భూముల విషయంలో అధికారులు నిక్కచ్చిగా వ్యవహారిస్తూ వారి భూముల నుంచే రోడ్డును నిర్మిస్తుండగా కొంతమంది కోసం మాత్రం అలైన్‌మెంట్‌ను మార్చడం విమర్శలకు తావిస్తోంది. ఒకరిద్దరు భూముల యజమానులు పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొనసాగిస్తున్న కారణంగానే ఈ అలైన్‌మెంట్‌ మార్పు కోసం లక్షల రూపాయలను అధికార పార్టీ నేతలకు చెల్లించుకున్నారన్న ఆరోపణలు న్నాయి.

ప్రతిపక్షాలకు ప్రధానఅస్త్రం

కాగా అఽధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కలెక్టరేట్‌ రోడ్డు నిర్మాణ అలైన్‌మెంట్‌ను మార్పు చేసి లక్షల రూపాయల్లో వసూలు చేశారన్న ఆరోపణలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు రాజకీయ అస్త్రం గా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు ఓ అడుగు ముందుకు వేసి రోడ్డు నిర్మాణ స్థలాన్ని సందర్శించడమే కాకుండా అలైన్‌మెంట్‌ మార్పు విషయాలను మీడియాకు వెల్లడించింది. అలాగే ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు సైతం బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశా రు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం ఈ వ్యవహారంపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి రోడ్డు నిర్మాణస్థలాన్ని సందర్శించి అలైన్‌మెంట్‌ మార్పు వ్యవహారంపై నిజనిర్ధారణ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈ వ్యవహారం మరో అస్త్రంగా మారనుందంటున్నారు.

చోటా నేతలపై మంత్రి గుస్సా

ఇదిలా ఉండగా రోడ్డు అలైన్‌మెంట్‌ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ట్లు ఆరోపణలున్న నేతలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సొంతపార్టీకి చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు అలైన్‌మెంట్‌ మార్పు కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని కొంతమంది మంత్రి దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఆ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో చర్చించి అలైన్‌మెంట్‌ను మార్చవద్దని ఒత్తిళ్ళలకు తలొగ్గవద్దంటూ ఆదేశించినట్లు సమాచారం. అలాగే మంత్రి జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకుపోయారంటున్నారు. చిలికి చిలికి గాలివానలాగా ఈ రోడ్డు అలైన్‌మెంట్‌ వ్యవహారం మారే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-12-30T00:25:47+05:30 IST