గోదాములో గోల్‌మాల్‌...!

ABN , First Publish Date - 2022-01-29T03:31:53+05:30 IST

పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యంలో గోల్‌మాల్‌ చోటుచేసుకొంది. బియ్యం నిల్వ ఉంచే ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్టు) పాయింట్‌లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంచిర్యాల మండలంలోని 142 చౌకధరల దుకాణాలకు పంపిణీ చేసే బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ గోదాములో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి నెలనెలా రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా అవుతాయి

గోదాములో గోల్‌మాల్‌...!
గోదాములో రికార్డులు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, అధికారులు

527 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం మాయం..?

మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఘటన

రూ.16 లక్షల 60వేల సరుకు పక్కదారి

విచారణ జరిపిన అదనపు కలెక్టర్‌

మంచిర్యాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యంలో గోల్‌మాల్‌ చోటుచేసుకొంది. బియ్యం నిల్వ ఉంచే ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్టు) పాయింట్‌లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంచిర్యాల మండలంలోని 142 చౌకధరల దుకాణాలకు పంపిణీ చేసే బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌  గోదాములో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి నెలనెలా రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా అవుతాయి. ఏ నెల ఎంత స్టాకు గోదాముకు వస్తుంది, అక్కడి నుంచి ఏ షాపులకు ఎంత సరుకు పంపిణీ జరిగింది, ఎంత మిగిలి ఉంది అనే సమాచారం పక్కాగా ఉంటుంది. గోదాం ఇన్‌చార్జి బియ్యం లెక్కలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తుండాలి. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉండగా, గోదాములో ప్రస్తుతం ఉన్న నిల్వల్లో దాదాపు 527 క్వింటాళ్లకు పైబడి బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టవలసిన పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

రూ.16 లక్షల సరుకు గోల్‌మాల్‌

చౌకధరల దుకాణాల ద్వారా నెలనెలా పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్ల వద్ద అవసరమైన బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఇందుకుగాను క్వింటాలు బియ్యానికి రూ.32 చొప్పున మిల్లర్లకు చెల్లిస్తోంది. అలా సేకరించిన బియ్యాన్ని కేవలం రూపాయికి కిలో చొప్పున పేదలకు పంపిణీ చేస్తోంది. కరోనా కష్టకాలంలో కుటుంబంలోని ప్రతీ ఒక్కరి పేరిట 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసింది. దారిద్య్ర దిగువన ఉన్న పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం బియ్యం కొనుగోలుకు నెలనెలా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పెద్ద మొత్తంలో భారం భరిస్తూ ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ కిందిస్థాయి అఽధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. గోదాం నుంచి మాయమైన బియ్యం విలువ సుమారు రూ.16 లక్షల 60వేలు వరకు ఉంటుందని అంచనా. స్టాకు లేని కారణంగా రెండు మూడు నెలలుగా రేషన్‌ షాపులకు బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

రక్షణ కల్పించడంలో విఫలం

వందల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడం వెనుక కంచే చేను మేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గోదాంతో సంబంధం ఉన్నవారే బియ్యాన్ని మాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పట్టణంలోని వ్యవసాయశాఖ మార్కెట్‌ యార్డు ఆవరణలోని గోదాముల్లో ఉండేది. నిత్యం జనసంచారం, సీసీ కెమెరాలతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేది. జిల్లాకు మంజూరైన మెడికల్‌ కాలేజీ తరగతి గదుల కోసం ఆ గోదాములను వినియోగిస్తుండటంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను ఇటీవల అక్కడి నుంచి హాజీపూర్‌ మండలం వేంపల్లి గ్రామ శివారుకు తరలించారు. ఊరు చివరన గోదాం ఉండటం, సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో బియ్యం తరలింపునకు మార్గం సుగమమైనట్లు ప్రచారం జరుగుతోంది. 

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

బియ్యం గోల్‌మాల్‌ విషయం కలెక్టర్‌ భారతిహోళికేరి దృష్టికి రావడంతో సంబంధిత అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో మాయమైన బియ్యం లెక్కలు తీయాలన్న ఆదేశాలతో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సమక్షంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేంకుమార్‌, జిల్లా మేనేజర్‌ గోపాల్‌ వేంపల్లిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రికార్డులు పరిశీలించారు. గోదాముకు ఎప్పుడు ఎంత బియ్యం చేరింది, ప్రస్తుతం ఉన్న స్టాకు ఎంత అనే విషయాలపై పూర్తిస్థాయిలో లెక్కలు తీస్తున్నట్లు సమాచారం.  రేషన్‌ బియ్యం గోల్‌మాల్‌ విషయంలో అధికారులు సంపూర్ణ విచారణ జరిపితే తప్ప అసలు దోషులు పట్టుబడే అవకాశం లేదు. కాగా ఏదోలా మేనేజ్‌ చేసి, అధికారుల దృష్టి మరల్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి బియ్యం నిల్వలు మాయం కావడానికి కారకులెవరో తేల్చాల్చిన బాధ్యత  అఽధికారులపై ఉంది. కాగా ఈ విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు సమావేశమై లోటును భర్తీ చేసేందుకు కొందరు డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.

విచారణ జరుపుతున్నాం

జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

గోదాములో బియ్యం నిల్వలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపు తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్వయంగా గోదాముకు వెళ్లి రికార్డులు పరిశీలించాం. గోదాములో స్టాకు పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నందున లోనికి వెళ్లి పరిశీలించేందుకు కొంత అసౌకర్యంగా ఉంది. వారం, పది రోజుల్లో పీడీఎస్‌ రైస్‌ బయటకు వెళ్లిపోతే మిగులు లెక్కలు పక్కాగా తెలుస్తాయి. ఈ విషయమై విచారణకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, జిల్లా మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశాం.

Updated Date - 2022-01-29T03:31:53+05:30 IST