గడువులోగా గగనమే..

ABN , First Publish Date - 2022-09-25T05:28:27+05:30 IST

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు గడువులోగా పూర్తికావడం గగనంగానే కనిపిస్తోంది. పట్టణవాసుల సౌకర్యార్థం అన్ని హంగులతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ యార్డుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులను దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

గడువులోగా గగనమే..
జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు

నత్తనడకన సాగుతున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు 

పట్టణంలో తోపుడు బండ్లతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు

కొరవడుతున్న పర్యవేక్షణ.. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

మామూలుగా తీసుకుంటున్న మున్సిపల్‌ అధికారులు

పట్టణవాసులకు తప్పని తిప్పలు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు గడువులోగా పూర్తికావడం గగనంగానే కనిపిస్తోంది. పట్టణవాసుల సౌకర్యార్థం అన్ని హంగులతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్‌ యార్డుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులను దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సకల సౌకర్యాలను ఒకేచోట కల్పించే ఉద్దేశంతో మార్కెట్‌ నిర్మాణం పనులను ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి వెనకాల సాత్నాల క్వాటర్స్‌లో ఉన్న ఖాళీ స్థలంలో గత ఆరు నెలల క్రితం పనులు ప్రారంభమైనా.. ఇప్పటికీ పునాది దశలోనే కనిపిస్తోంది. నిధులు మంజూరు కావడంతో హడావుడిగా స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించినా.. మార్కెట్‌కు వచ్చి పోయేందు కు ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుడా ఈ మార్కెట్‌కు వెళ్లే రోడ్డు మార్గం ఇరుకుగా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సమీకృ త మార్కెట్‌ నిర్మాణం పనుల పర్యవేక్షణ బాధ్యతను మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు అప్పగించారు. దీంతో అడుగడుగునా.. అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోవడంతో పాటు పనులు ఆగుతూ సాగుతున్నాయి. అదేవిధంగా పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనుల నాణ్యతపై సందేహాలే వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌ అడ్డగోలుగా పనులు చేపట్టడంతో అడుగు ముందుకు పడడం లేదు. పనులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో కూడా నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తికావడం అనుమానంగానే కనిపిస్తోంది.

రహదారులపైనే వ్యాపారం

ఆరు నెలలు గడిచిపోతున్నా.. సమీకృత మార్కెట్‌ యార్డు నిర్మాణం పనులు పూర్తికాకపోవడంతో పట్టణ రోడ్ల పైననే వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాలమైన ఆరు ఎకరాల స్థలంలో సమీకృత మార్కెట్‌ పనులు పూర్తియితే అన్నిరకాల వ్యాపారాలు ఒకేచోటకు చేర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూరగాయాలు, పండ్ల వ్యాపారులు రోడ్ల పైననే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా సినిమా రోడ్డు, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, వినాయక్‌ చౌక్‌, తదితర ప్రాంతాలలో చిరు వ్యాపారులతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. పట్టణవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం సమీకృత మార్కెట్‌ యార్డును మంజూరు చేసినా.. ప్రయోజనం కనిపించడం లేదు. అధికారుల నిండు నిర్లక్ష్యంతో నెలల తరబడి పనులు నత్తనడకనే సాగుతున్నాయి. అయినా.. అధి కారులు కాంట్రాక్టర్‌ను హెచ్చరిచండం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలలో పునాదులు కూడా దాట లేదంటే మిగితా.. పనులకు మరింత కాలం పాటు సమయం పడుతుందో ఇట్టే స్పష్టమవుతుంది. సమీకృత మార్కెట్‌ అందుబాటులోకి వస్తే పట్టణ పారిశుధ్యం కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. 

రాజకీయ నేతల అండ

సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌కు కొందరు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇష్టా రాజ్యంగా పను లు నిర్వహిస్తున్న ట్లు తెలుస్తుంది. సంబంధిత శాఖలకు చెందిన అధికారులు హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నా.. రాజకీయ నేతల అండతో కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నెలల తరబడి సమీకృత మార్కెట్‌ యార్డు పనుల వైపు కన్నెత్తి చూపకపోవడంతోనే పురోగతి కనిపించడం లేదంటున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు చేపడుతూ అమ్మేసుకుంటున్నా.. అడ్డగించే అధికారే కరువవుతున్నారు. అంచనాల ప్రకారం కాకుండా నాసిరకం గా అడ్డగోలుగా పనులు చేపడుతున్న అధికారుల పర్యవేక్ష ణ కరువవుతోంది. భూమిపూజ చేసిన రోజు తప్ప గడిచిన ఆరు నెలల్లో మున్సిపల్‌ ఉన్నతాధికారులు సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలించ లేదం టే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తూనే ఉంది. కేవలం కిందిస్థాయి అధికారుల పర్యవేక్షణలోనే సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. మున్సిపల్‌ ఈఈ, డీఈలు పత్తాలేకుండానే పోయారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, మున్సిపల్‌కు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనులపై పర్యవేక్షణ కరువవుతోంది. కాంట్రాక్టర్‌తో కుమ్మకైన అధికారు లు ముడుపులు ముట్టచెప్పడంతో పనుల వైపు కనీసం కన్నెత్తయినా చూడడం లేదంటున్నారు. దీంతో గత నాలుగైదు నెలలుగా పనులు పూర్తిగా నిలిపి వేసిన కాంట్రాక్టర్‌, పత్తా లేకుండానే పోయాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం పనులు చేపట్టని కాంట్రాక్టర్‌పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదోనన్న ప్రశ్నలూ లేకపోలేదు.

పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం

: శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదిలాబాద్‌

జిల్లాకేంద్రంలో చేపట్టిన సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు మరింత వేగవంతమయ్యేలా చూస్తాం. వెంటనే సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశిస్తాం. పనుల నాణ్యతపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యేలా పర్యవేక్షణ ఉంటుంది. గడువులోగానే పనులు పూర్తిచేసి సమీకృత మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. పనులు నాణ్యతగా చేపట్టకుంటే బిల్లులను చెల్లించేది లేదు. నిబంధనల ప్రకారం పనులు చేయాల్సి ఉంటుంది.  

Read more