మూడు మెస్‌లకు.. ముగ్గురే

ABN , First Publish Date - 2022-09-24T07:18:51+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీమెస్‌ల టెండర్లలో ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది.

మూడు మెస్‌లకు.. ముగ్గురే

బిడ్‌లు రాక ట్రిపుల్‌ ఐటీ టెండర్లు రద్దు 

రూ. 10 కోట్ల  టర్నోవర్‌ నిబంధన కారణంగా  ముందుకు రాని సంస్థలు 

ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి 

బాసర, సెప్టెంబరు, 23 : బాసర ట్రిపుల్‌ ఐటీమెస్‌ల టెండర్లలో ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. మూడు మెస్‌లకు ముగ్గురే టెండర్‌ దాఖలు చేశారు. ఈసారి కొత్తగా రూ.10 కోట్ల టర్నోవర్‌ నిబంధన విధించడంతో ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అధికారులు టెండర్లను రద్దు చేశారు. క్యాంపస్‌లో 9 వేల మంది విద్యార్థులకు 3 వేల చొప్పున విడదీసి వారి భోజన బాధ్యతలు అప్పగించేందుకు టెండర్లను పిలిచారు. గతంలో ఉన్న టెండర్‌ నిబంధనలో కొన్నింటిని పెంచి, మరికొన్నింటిని తగ్గించడంపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఎక్కడా లేని విధంగా గత నాలుగేళ్ల నుండి రూ. 10 కోట్ల టర్నోవర్‌ ఉండాలని విధించడంతో పెద్దపెద్ద క్యాటరింగ్‌ సంస్థలు కడా అర్హత కోల్పోయాయి. ఈ క్రమంలో కొందరి కోసమే రూల్స్‌లకు విరుద్దంగా ఇలా నిబంధనలు మార్చి టెండర్‌ పిలిచారనే ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్ని ఈ నెల 20వ తేదిన ఆంధ్రజ్యోతి లో ట్రిపుల్‌ ఐటీ మెస్‌ టెండర్లలో మాయాజాలం అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. శుక్రవారం టెండర్‌బిడ్‌లను ఓపెన్‌ చేసిన అధికారులకు ఆంధ్రజ్యోతి చెప్పినట్టే పరిస్థితి ఎదురైంది. కేవలం ముగ్గురు మాత్రమే టెండరు దాఖలు చేయడంతో అధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా టెండరు ప్రక్రియ ముగిద్దామని చూశారు కానీ గత్యంతరం లేక రద్దు చేశారు. పొరపాట్లను సరిదిద్ది మరోసారి నోటిఫికేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-09-24T07:18:51+05:30 IST