వేగంగా రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2022-11-12T01:43:15+05:30 IST

జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈద్గాం - కౌట్ల(కె) రహదారి పనులు చకాచకా సాగుతున్నాయి.

వేగంగా రోడ్డు నిర్మాణం
చురుకుగా కొనసాగుతున్న సిద్దాపూర్‌, కౌట్ల రహదారి పనులు

యుద్ధ ప్రాతిపాదికన రోడ్డు నిర్మాణం పనులు

మూడు వార్డులు, ఆరు గ్రామాలకు తొలగనున్న రవాణా సమస్య

పదేళ్ల తర్వాత దొరికిన పరిష్కారం

నిర్మల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఈద్గాం - కౌట్ల(కె) రహదారి పనులు చకాచకా సాగుతున్నాయి. గత పదేళ్ల నుంచి ఈద్గాంతో పాటు ఆదర్శనగర్‌, సిద్దాపూర్‌ వార్డులతో పాటు కౌట్ల, జాప్రాపూర్‌, మాధాపూర్‌, సిద్ధిలకుంట, గాంధీనగర్‌లతో పాటు తదితర గ్రామాలు రోడ్డుసౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు కోసం ఆరు గ్రామాలు, మూడు వార్డుల ప్రజలు పదేళ్ల నుంచి జరుపుతున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. గతంలో ఓ సారి రోడ్డు నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. నిధులు విడుదలకాకపోవడంతో నిర్మాణ పనులు మొదలుకాలేదు. అప్పటి నుంచి స్థానికులు రోడ్డు కోసం వివిధ రూపాల్లో పోరాటం కొనసాగించారు. ఉన్నతాధికారులకు సైతం పలుసార్లు ఫిర్యాదు చేశారు. ఈద్గాం నుంచి మొదలుకొని కౌట్ల వరకు గల ఈ రోడ్డు ఆధ్వాన్నంగా మారింది. రోడ్డు పొడవునా భారీ గుంతలు అలాగే దుమ్ముదూళితో జనాలు పదేళ్ల పాటు తీవ్రఇబ్బందుల పాలయ్యారు. వాహనాలపై ప్రయాణించడం దేవుడెరుగు కాని కనీసం కాలినడకకు కూడా ఈ రోడ్డు నరకాన్ని తలపించింది. ఈ క్రమంలో ప్రజల ఒత్తిడి ఓ వైపు, ప్రతిపక్షాల విమర్శలు అలాగే మరోవైపు ప్రజా ప్రతినిధుల విజ్ఙప్తులపై సర్కారు సీరియస్‌గా స్పందించింది. మొదట్లో మం జూరు చేసిన రూ.8 కోట్ల నిధులకు సంబంధించిన ఫైలును తిరిగి తెరపైకి తెచ్చింది. రూ.8కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్‌అండ్‌బీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు మరోసారి సర్వే జరిపి ఇటీవలే పనులకు శ్రీకారం చుట్టారు. గత పదిరోజుల క్రితం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపన సైతం చేశారు. శంకుస్థాపన అయిన మరుసటి రోజూ నుంచే ఆర్‌అండ్‌బి అధికారులు పనులను మొదలుపెట్టారు. ప్రస్తుతం రోడ్డుపనులు యుద్ద ప్రాతిపాదికన కొనసాగుతుండడం విశేషం.

పదేళ్లుగా నరకయాతన

ఈద్గాం - కౌట్ల రోడ్డు ఆఽధ్వాన్నంగా మారడంతో ఈ రోడ్డుపై నడిచే వందలాది మంది అలాగే తిరిగే వందలాది వాహనాలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యాయి. ఓ దశలో ఆటోరిక్షాలు కూడా ఈ రోడ్డుపై తిరిగేందుకు నిరాకరించాయి. అలాగే భారీగుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగేవి. దుమ్ముదూళి కారణంగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలున్నాయి. మున్సిపల్‌ అధికారులు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు అడపాదడపా గుంతలను పూడ్చే ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి పరిస్థితి యధావిధికి చేరుకునేది. ప్రతియేటా వర్షకాలంలో ఈ రోడ్డు పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. చాలా మంది గుంతలపై ప్రయాణంతో వెన్ను, మెడ, కండరాల నొప్పులకు గురయ్యారు. దాదాపు 11 కిలోమీటర్ల పొడవు గల ఈ రోడ్డు ప్రయా ణం ప్రతిరోజూ సాహసోపేతమే. ప్రత్యామ్నాయ మార్గం లేక వారంతా కష్టాలు ఎదుర్కొంటూ ఇదే రోడ్డుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రజలంతా రోడ్డు కోసం తమ పోరాటాన్ని ఉదృతం చేశారు.

వినూత్నరీతిలో పోరాటం

రోడ్డు కోసం స్థానికులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆలిసిపోయారు. చివరకు ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్ప డింది. ఇటీవల తీవ్రప్రభావం చూపుతున్న సోషల్‌మీడియాను వారు అస్త్రంగా మలుచుకొని తమ నిశబ్ద ఆందోళనను మొదలుపెట్టారు. ప్రతీరోజూ ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను, ఏర్పడ్డ భారీ గుంతలు, ఆ గుంతలపై వాహనాలు నడుస్తున్న తీరును వీడియోలు తీసి సోషల్‌మీడియాలో వైరల్‌ చేసేవారు. అలాగే విసిగిపోయిన వీరంతా రోడ్డు బాధితుల సంఘం పేరిట ఏర్పడి ఇటు సోషల్‌ మీడియా ద్వారాను అలాగే నాయకులు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతం లో పర్యటించేటప్పుడు నిరసనలు తెలిపి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఇలా అన్ని వేదికలను వినియోగించుకుంటూ వారం తా తమ దశాబ్ద కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి పోరాడి ఎట్టకేలకు విజయం సాధించారు.

రూ. 8 కోట్లతో సాగుతున్న పనులు

ఇదిలా ఉండగా స్థానికుల ఒత్తిడి, ప్రజాప్రతినిధుల విజ్ఙప్తుల మేరకు రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి రోడ్డునిర్మాణం కోసం రూ.8 కోట్లను మంజూరు చేయడమే కాకుండా ఆ నిధులను విడుదల చేసింది. దీంతో ఆర్‌ అండ్‌ బి అధికారులు సర్వే మొదలుపెట్టి రోడ్డు నిర్మాణానికి సంబందించి చర్యలు మొదలుపెట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి ఈ రోడ్డు పనులు చకచకా కొనసాగుతున్నాయి. మొదట ఈద్గాం నుంచి కౌట్ల వరకు రోడ్డుపై ఉన్న భారీ గుంతలను పూడ్చడమే కాకుండా అవసరమైన చోట్లరోడ్డును కొంత మేర వెడల్పు చేశారు. ప్రస్తుతం ఈ పనులు జోరుగా జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రాథమిక మరమత్తుల పనులు పూర్తి కాగానే కౌట్ల(కె) వరకు బీటీ రోడ్డును నిర్మించనున్నారు. అయితే రోడ్డు నిర్మాణ పనులకు ఏర్పడుతున్న స్వల్ప అవరోధాలు, సమస్యలను స్థానికులు ఎక్కడికక్కడ పరిష్కరించి పనులు ముందుకు సాగేలా చొరవ తీసుకుంటున్నారు. అధికారులు సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులను పకడ్భంధీ పర్యవేక్షిస్తూ నాణ్యత లోపం లేకుండా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు నిధులు మంజూరు చేయించి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సైతం స్థానికులు కృతజతలు తెలుపుతున్నారు.

Updated Date - 2022-11-12T01:43:17+05:30 IST