ఆసిఫాబాద్‌లో రేషన్‌ కార్డుల పునరుద్ధరణకు కసరత్తు

ABN , First Publish Date - 2022-07-19T03:51:10+05:30 IST

ఆహార భద్రత, రేషన్‌ కార్డులకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో పాటు తిరస్కరించిన కార్డులను పునరుద్దరించాలని ఆదేశించటంతో ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

ఆసిఫాబాద్‌లో రేషన్‌ కార్డుల పునరుద్ధరణకు కసరత్తు

-సుప్రీం కోర్టు తీర్పుతో తరలిన అధికారులు

-రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ 

-గతంలో సాంకేతిక కారణాలతో కార్డుల రద్దు

-తిరస్కరించిన కార్డుల సంఖ్య 6800

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆహార భద్రత, రేషన్‌ కార్డులకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో పాటు తిరస్కరించిన కార్డులను పునరుద్దరించాలని ఆదేశించటంతో ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గతంలో రద్దయిన కార్డుల జాబితాను అనుసరించి కార్డులు అందని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయటం ద్వారా కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. ఇందుకు సంబంఽధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలననుసరించి రేషన్‌ కార్డుల పునరుద్దరణ కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తునే సంబంధిత దరఖాస్తు దారులు కార్డులు పొందటానికి అర్హులా..? కాదా అనే విషయం తేల్చటం కోసం క్షేత్ర స్థాయిలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు తాజాగా మీ సేవా ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు సంబంధించి మొత్తం 6,860 కార్డులు గతంలో తిరస్కరణకు గురైనట్టు అధికార గణాంకాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం స్థానికేతరులు సరైన ధ్రువపత్రాలు చూయించక పోవటం, ఆధార్‌ కార్డులు వెరే జిల్లాలో ఉండటం వంటి సాంకేతిక కారణాలే ఎక్కువ. అయితే ఇందులో సింహభాగం కార్డులు ఎలాంటి కారణాలు లేకుండానే తిరస్కరణకు గురయ్యాయని రెవెన్యూకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొనటం ఎంతైనా ప్రస్తావనార్హం. ముఖ్యంగా తిరస్కరణకు గురైన కార్డుల జాబితా సింహభాగం దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవి ఉన్నట్టు చెబుతున్నారు. సాంకేతికంగా నిబంధనల ప్రకారం తిరస్కరణకు గురైన కార్డుల సంఖ్య 1000కి మించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్డుల రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించటంతో దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కార్డు అందని దరఖాస్తుదారులు మరోసారి దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

మండలాల వారీగా తిరస్కరణకు గురైన కార్డుల జాబితా

సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరస్కరణకు గురైన జాబితా అధికారులు సిద్ధం చేశారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మండలాల వారీగా తిరస్కరణకు గురైన యూనిట్ల సంఖ్య ఇలా ఉంది. ఆసిఫాబాద్‌ మండంలో 2,480, బెజ్జూరులో 91, చింతలమానేపల్లిలో 120, దహెగాంలో 132, జైనూరులో 201, కాగజ్‌నగర్‌లో 1,177, కెరమెరిలో 175, కౌటాలలో 124, లింగాపూర్‌లో 91, పెంచికల్‌పేట 50, రెబ్బెనలో 1,179, సిర్పూరు(టి) 85, సిర్పూరు(యు)లో 42, తిర్యాణిలో 765, వాంకిడిలో 168 మొత్తం 6,860 కార్డులను తిరిగి పునరిద్దరించేందుకు చర్యలు ప్రారంభించారు.  

కార్డుల పునరుద్దరణకు చర్యలు..

-స్వామికుమార్‌, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి 

గతంలో తిరస్కరణకు గురైన కార్డులను పునరుద్దరించాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున అందుకనుగుణంగా కార్డుల పునరుద్దరణ కోసం చర్యలు ప్రారంభించాం. మండలాల వారీగా తిరస్కరణకు గురైన లబ్ధిదారుల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. నోటీసులు అందిన లబ్ధిదారులు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ జరిపి అర్హులా..? కాదా అనే విషయాన్ని తేలుస్తాం.

Read more