‘దళితబంధు’కు కసరత్తు

ABN , First Publish Date - 2022-01-28T05:43:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

‘దళితబంధు’కు కసరత్తు

- ప్రతీ నియోజకవర్గంలో 100 మంది ఎంపికే లక్ష్యం

- కలెక్టర్‌, ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు

- జిల్లాలో 200 మందికి లబ్ధి

ఆసిఫాబాద్‌, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో 100 మందిని ఎంపికి చేసి పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా కలెక్టర్‌తో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయనున్నారు. 

- నియోజకవర్గానికి 100 మంది ఎంపిక..

జిల్లాలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున దళితబంధు పథకం కింద అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క లబ్థిదారుడికి రూ. 10 లక్షలను మంజూరు చేసి ఈ నిధుల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుడికి యూనిట్‌ను మంజూరు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు యూనిట్లు నెలకొల్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

- ఫిబ్రవరి 5 లోపు అర్హుల గుర్తింపు..

దళితబంధు పథకం కింద అర్హులను ఫిబ్రవరి 5లోగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సూచించింది. ఇందుకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అర్హులను గుర్తించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అర్హులను గుర్తించి ఆమోదం తెలుపుతారు. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా  దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రతీ లబ్ధిదారుడికి రూ. 10 లక్షలు మంజూరు చేసి వివిధ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయించడం ద్వారా అయా లబ్ధిదారుల ఆర్థిక స్థితి గతులను మెరుగుపరచడం సామాజికంగా అసమానతలు తొలగించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను కాకుండా దరఖాస్తు చేసుకొనే ప్రతీ దళిత కుటుంబానికి పథకాన్ని వర్తింప చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

లబ్ధిదారుల ఎంపిక తర్వాతే కార్యాచరణ..

- సజీవన్‌, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద ఆసిఫాబాద్‌ జిల్లాకు లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్‌కు అప్పగించింది. ప్రజాప్రతినిధులతో కలిసి అర్హులైన ల్ధధారులను ఎంపిక చేసిన తర్వాత కార్పోరేషన్‌ ద్వారా యూనిట్ల గ్రౌండింగ్‌కు అవసరమైన కార్యచరణను అమలు చేస్తాము. 


Read more