డీసీసీ పదవిపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-11-25T01:05:38+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. డీసీసీ అధ్యక్షునిగా వ్యవహారించిన రామారావు పటేల్‌ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

డీసీసీ పదవిపై ఉత్కంఠ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల పోటాపోటీ

సమర్ధుల కోసం అన్వేషిస్తున్న మహేశ్వర్‌ రెడ్డి

నిర్మల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. డీసీసీ అధ్యక్షునిగా వ్యవహారించిన రామారావు పటేల్‌ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న రామారావు పటే ల్‌ పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్‌పార్టీకి కొత్త సారథిని నియమించేందుకు అధిష్టానం సిద్దమవుతోంది. అయితే మొదటి నుంచి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న మహేశ్వర్‌రెడ్డి భుజస్కంధాలపై డీసీసీ అధ్యక్ష పదవి నియామక వ్యవహారం ఉందంటున్నారు. జిల్లాలో సమర్ధులైన సీనియర్‌ నాయకుల కోసం మహేశ్వర్‌రెడ్డి అన్వేషణ మొదలుపెట్టారని చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతల కోసం మహేశ్వర్‌రెడ్డి అన్వేషణ మొదలుపెట్టారంటున్నారు. దిలావర్‌పూర్‌ మండలానికి చెందిన డి. ముత్యంరెడ్డి, దిలావర్‌పూర్‌ జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, లక్ష్మణచాంద మండలం మాజీ ఎంపీపీ సరికెల గంగన్న, ఖానాపూర్‌కు చెందిన కిషోర్‌ నాయక్‌, దొనికెని దయానంద్‌, భరత్‌ చౌహన్‌, రాజురా సత్యం, భైంసాకు చెందిన ఆనంద్‌ పటేల్‌లతో పాటు తదితరులు డీసీసీ అఽధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా మహేశ్వర్‌రెడ్డి కూడా వారి పేర్లను పరిశీలిస్తున్నారంటున్నారు. మహేశ్వర్‌రెడ్డి సిఫారసు చేసిన వారికే డీసీసీ అధ్యక్ష పదవి లభిస్తుందన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర అధిష్టానం మహేశ్వర్‌రెడ్డి సిఫారసులను అంగీకరించడం లాంఛనప్రాయమే అవుతుందని అందుకే మహేశ్వర్‌ రెడ్డి అధ్యక్షపదవి ఎంపిక విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నారంటున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలన్నీ తాను స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉన్నందున ఈ సారి ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని మహేశ్వర్‌రెడ్డి యోచిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీని, యూత్‌లో బలమైన సా నుభూతి కలిగిన బీజేపీని ఎదుర్కొనే సత్తా గల నాయకత్వం పార్టీకి తప్పనిసరి అన్న భావనలో మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అలాంటి నాయకుని కోసం ఆయన వేట సాగిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానపార్టీలకు దీటుగా కాంగ్రెస్‌పార్టీని తీర్చిదిద్దడమే కాకుండా ప్రస్తుతం ఉన్న కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపడం, ఉన్న కేడర్‌ను చేజారిపోకుండా చూసుకోవడం కొత్త అధ్యక్షునికి సవాలుగా మారబోతుందంటున్నారు.

అచితూచి ఎంపిక

కాగా ఈ సారి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి బలమైన సారథిని నియమించాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి భావిస్తున్నారు. జిల్లా పార్టీని ఏకతాటిపై నడపగలిగే సత్తా ఉన్న నేత కోసం ఆయన అన్వేషిస్తున్నారు. నిన్నటి వరకు పార్టీలో కొనసాగి ఉన్నత పదవి చేపట్టిన రామారావు పటేల్‌ పార్టీని వీడడమే కాకుండా తన అనుచరులతో బీజేపీలో పార్టీలో చేరబోతుండడాన్ని మహేశ్వర్‌ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఆయనకు కౌంటర్‌గా బలమైన నేతను తిరిగి డీసీసీ అధ్యక్ష పదవి పీఠంపై కూర్చోబెట్టాలని మహేశ్వర్‌రెడ్డి భావిస్తున్నారంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల నుంచి బలమైన నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు. ముథోల్‌ నుంచి ఆనంద్‌రావు పటేల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి గుగ్లావత్‌ కిషోర్‌ నాయక్‌, దొనికెని దయానంద్‌, రాజురా సత్యంలతో పాటు భరత్‌చౌహాన్‌ పేరును కూడా తెరపైకి తెస్తున్నారు. వీరిలో నుంచి అందరిని సమన్వయ పరుస్తూ పార్టీని ముందుకు నడిపే సత్తా గల నాయకుడిని డీసీసీ పదవి కోసం ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

సవాలుగా డీసీసీ పదవి

కాగా ఈ సారి డీసీసీ అధ్యక్ష పదవి ఆ పదవి చేపట్టిన నేతలకు అత్యంతసవాలుగా మారనుందంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉండడం, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తుండడం లాంటి అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ రెండు పార్టీలను బలంగా ఢీకొంటూ కాంగ్రెస్‌ పార్టీ మెనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లి తిరిగి ప్రజల సానుభూతిని పొందేందు కోసం ప్రయత్నించే నాయకుడు కావాలని అధి ష్టానం కోరుకుంటోంది. గత కొంతకాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీలోని చాలా మంది సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల్లో చేరిపోయారు. ఉన్న కొద్దిమంది కేడర్‌ను కాపాడుకునే నాయకుడు ప్రస్తుతం పార్టీకి అవసరమంటున్నారు. ఇలా అనేక ప్రలోభాలు, హమీలు, వాగ్దానాలను అధిగమించి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అటు పార్టీకి ఇటు కేడర్‌కు కొత్త జవసత్వాలు నింపాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎన్నికల వరకు డీసీసీ అఽధ్యక్ష పదవి ముళ్ల కిరీటం లాంటిదేనని అందరిని సమన్వయం పర్చడం, ఉన్న కేడర్‌ చేజారిపోకుండా చూడడం, ప్రజల్లో తిరిగి మద్దతు సంపాదించడం లాంటి అంశాలు కొత్త డీసీసీ అధ్యక్షునికి సవాలుగా నిలుస్తాయంటున్నారు.

Updated Date - 2022-11-25T01:05:38+05:30 IST

Read more