దసరా అమ్మకాలు మామూలే

ABN , First Publish Date - 2022-10-07T04:53:11+05:30 IST

దసరా పండుగ అమ్మకాల్లో ఈయేడు జోరు తగ్గింది. దసరా నేపథ్యంలో దుస్తులు, మద్యం, విందులో ప్రజలు మునిగి తేలుతుంటారు. పండుగ సీజన్‌లో వ్యాపారులకు భారీ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈయేడు గతంతో పోలిస్తే విక్రయాలు గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

దసరా అమ్మకాలు మామూలే

గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు 

వస్త్ర వ్యాపారులదీ అదే పరిస్థితి

వేతనాలు ఆలస్యం కావడమే కారణం  

30 శాతం మేర తగ్గిన విక్రయాలు  

మంచిర్యాల, అక్టోబరు 6 (ఆంద్రజ్యోతి): దసరా పండుగ అమ్మకాల్లో ఈయేడు జోరు తగ్గింది. దసరా నేపథ్యంలో దుస్తులు, మద్యం, విందులో ప్రజలు మునిగి  తేలుతుంటారు. పండుగ సీజన్‌లో వ్యాపారులకు భారీ అమ్మకాలు జరుగుతాయి.  అయితే ఈయేడు గతంతో పోలిస్తే విక్రయాలు గణనీయంగా తగ్గడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మద్యం అమ్మకాలు సైతం గణనీయంగా పడిపోయాయి. దాదాపు 30 శాతం మేర విక్రయాల్లో తేడా వచ్చినట్లు తెలుస్తోంది.   

గణనీయంగా పడిపోయిన మద్యం అమ్మకాలు 

దసరా పండుగ నేపథ్యంలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగేవి. 15 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో వ్యాపారులు నిరాశకు గురవుతున్నారు. గతేడాది దసరా సమయంలో రూ. 16.20 కోట్లు ఆబ్కారి శాఖకు ఆదాయం సమకూరగా ఈ సంవత్సరం రూ. 10.99 కోట్లకు పడిపోయాయి. గత సంవత్సరం అక్టోబర్‌ 11 నుంచి  14 వరకు ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) 16032 కేసులు విక్రయాలు జరగగా బీర్లు 19989 కేసులు అమ్ముడు పోయాయి. ఈ యేడు ఈ నెల 4వ తేదీ వరకు ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ 7882 కేసుల విక్రయాలు జరగగా బీర్ల అమ్మకాలు 28167 కేసులు జరగగా మొత్తంగా 10.99 కోట్ల ఆదాయం సమకూరింది. ఐఎంఎల్‌ విక్రయాలు పడిపోగా బీర్ల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. లిక్కర్‌ అమ్మకాలు పడిపోవడానికి ధరల పెంపు కూడా కారణమైంది. ఒక్కో బాటిల్‌పై సుమారు 100 పైచిలుకు ధర పెరగడంతో మద్యం కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. బీర్ల ధరలు పెరిగినా యువత కొనుగోలు చేసేందుకు మక్కువ చూపినట్లు తెలు స్తోంది. 

వెలవెలబోయిన వస్త్ర దుకాణాలు.....

దసరా పండుగను పురస్కరించుకొని  వస్త్ర, రెడిమేడ్‌ దుకాణాల్లో గిరాకీలు లేక వెలవెలబోయాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.25 కోట్ల వ్యాపా రం జరిగినట్లు అంచనా. 15 ఏండ్లతో పోలిస్తే వస్త్ర దుకాణాల్లో 40 శాతం మేర ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలోనూ ఇంత అద్వాన్న పరిస్ధితి నెలకొనలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు మాంసం దుకాణాలలోనూ విక్రయాలు గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. 

వేతనాలు ఆలస్యం కావడంతోనే....?

ఉద్యోగులకు సకాలంలో వేతనాలు జమకాకపోవడంతోనే వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రతీ నెల  1వ తేదీన వేతనాలు పడాల్సి ఉండగా ఈ నెల 5న బ్యాంకుల్లో జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతనాలు పడలేదు. ఈ ప్రభావం దసరా పండుగపై చూపినట్లు ప్రచారం జరుగు తోంది. సింగరేణి ఉద్యోగులకు ఈ నెల  1న యాజమాన్యం లాభాల వాటాను  జమ చేసింది. ఒక్కో కార్మికునికి సగటున రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు లాభాల వాటా చేతికి వచ్చింది. అయినప్పటికి వ్యాపారం పుంజుకోక పోవడం గమనార్హం. దసరా పండుగ ముందు నెలలో మూడో వారంలో లాభాల బోనస్‌ కార్మికుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  దసరా పండుగ మొదటి వారంలో రావడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటుగా పనులు చేసే వారికి రెండో వారంలో వేతనాలు చేతికి అందుతాయి.  దాదాపు పది రోజుల ముందుగా పండుగ రావడంతో ప్రజల చేతిలో డబ్బు లేక కొనుగోలుకు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.   

Read more