పోడుపై సందిగ్ధం!

ABN , First Publish Date - 2022-11-24T23:46:28+05:30 IST

: పోడు భూముల పట్టాల పై మళ్లీ సందిగ్ధం నెలకొంది. దశాబ్దా కాలానికి పైగా పోడు భూముల కోసం చేసిన పోరాటాల ఫలితంగా దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోడు దరఖాస్తులను స్వీకరించింది.

పోడుపై సందిగ్ధం!

ఆయుధాలు లేకుండా పని చేయలేమంటున్న అధికారులు

నిబంధనలు సడలించాలని డిమాండ్‌

గందరగోళంగా పోడు రైతుల పరిస్థితి

ఆదిలాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : పోడు భూముల పట్టాల పై మళ్లీ సందిగ్ధం నెలకొంది. దశాబ్దా కాలానికి పైగా పోడు భూముల కోసం చేసిన పోరాటాల ఫలితంగా దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోడు దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో 2021నవంబరు 8 నుంచి డిసెంబరు 16 వరకు పోడు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 333 గ్రామ పంచాయతీలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరిశీలన చేపట్టి హక్కు పత్రాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొంత ఆలస్యమే అయిన పట్టాల జారీకి కసరత్తు మొదలు పెట్టింది. జిల్లాలో 24561 మంది రైతులు పోడు భూములకు హక్కు పత్రాలను ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 96,763.26 ఎకరాల పోడు భూమికి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి.ఇప్పటికే దాదాపుగా 95.77శాతం సర్వే పనులను కూడా పూర్తి చేసింది. గ్రామసభలలో అర్హుల జాబితాకు ఆమోదం తెలిపితే ఇక పట్టాల జారీయే మిగిలి ఉంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్టు రేంజ్‌ అధికారిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనతో అటవి శాఖ ఆవేశంతో రగిలి పోతోంది. భద్రత కల్పించాలంటూ సమావేశాలను బహిష్కరించడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు పూర్తిగా నిలిచి పోయాయి. వీరికి పంచాయతీ కార్యదర్శులు కూడా మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. అటవీ అధికారులు లేనిదే గ్రామసభలు నిర్వహించడం మావల్ల కాదంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోడు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచి పోయింది. వచ్చే నెల మొదటి వారంలోనే పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. దీంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పోడు రైతుల పరిస్థితి మళ్లీ గందరగోళంగా మారింది.

గిరిజనేతరులకు పట్టాలు డౌటే..

ఎన్నో ఏళ్లుగా పోడు భూమిని సాగు చేసుకుంటున్న ప్రభుత్వం విధించిన నిబంధనలతో అర్హతను కోల్పోతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలను సడలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల బోథ్‌ మండలం ధన్నూర్‌(బి) గ్రామంలో రైతులు గ్రామసభను బహిష్కరించి తీర్మానం చేశారు. కాస్తులో ఉన్న సాగులో లేని కారణంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వబోమని అధికారులు చెప్పడంతో అర్హత కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. అటవీ, రెవెన్యూ శాఖలు సరిహద్దులు గుర్తించి సాంకేతిక నిఫుణుల పర్యవేక్షణలో తిరిగి సర్వే జరిపించాలని, గిరిజనేతర రైతులు మూడుతరాల వారసత్వాన్ని చూపించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలను రెవెన్యూ, పంచాయతీ అధికారులే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సాగులో లేని పోడు రైతులకు ప్రస్థుతం వ్యవసాయం చేసుకునేందుకు జిల్లా అధికారులే హామీ ఇవ్వాలని అప్పటి వరకు గ్రామసభలు జరిపేది లేదంటూ నిర్ణయించారు. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందని ఎందరో మంది గిరిజన, గిరిజనేతర రైతులు దరఖాస్తులు చేసుకున్న నిబంధనల ప్రకారం ఎవరికి పట్టాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడుభూములకు పట్టాలు ఇచ్చిన సందర్భంలో ఏ ఒక్క గిరిజనేతర (ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ) రైతుకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ సారి కూడా కఠినమైన నిబంధనలను విధించి అరకొరగానే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

మళ్లీ తెరపైకి ఆయుధాలు..

జిల్లాలో పలుమార్లు కలప స్మగ్లర్లు అ టవీ శాఖ అధికారుల పై దాడులకు దిగి తీవ్రంగా గాయపరిచి న సంఘటనలు ఎ న్నో ఉన్నాయి. దీంతో అప్పట్లో అటవీ శాఖాధికారులకు ఆయుధాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. కానీ ఆచరణ సాధ్యం కాక పోవడంతో ప్రభుత్వం ఆయుధాల మాటనే పూర్తిగా మరిచి పోయింది. తాజాగా జరిగిన ఫారెస్టు రేంజ్‌ అధికారి హత్య ఘటనతో మళ్లీ ఆయుధాల మాట తెరపైకి వస్తుంది. గతంలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ప్రభుత్వం అటవీ శాఖాధికారులకు ఆయుధాలను అప్పగిస్తే మావోయిస్టుల దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. అలాగే ఆయుధాల వినియోగంతో పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని, వాటి వినియోగంపై ఎలాంటి పరిజ్ఞానం లేని అటవీ శాఖాధికారులకు ఆయుధాలను అప్ప గించడానికి ప్రభుత్వం కొంత వెనుకడుగు వేసింది. కానీ ప్రతియేటా జిల్లాలో కలప స్మగ్లర్‌, పోడు భూముల వద్ద వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులతో అటవీశాఖాధికారుల మధ్య ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. చట్టాల పై ఏ మాత్రం అవగాహ న లేని ఆదివాసీ గిరిజనులు కొంత దురుసుగా ప్రవర్తించడంతో వివాదాలకు దారి తీ స్తోంది. తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న పోడు భూముల సాగును అడ్డుకోవడంతో వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. ఆయుధాలు ఇచ్చిన చట్టాలపై అవగాహన లేక పోతే సమస్య మరింత ఝటిలమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామసభలు కొనసాగుతాయి..

- రాజశేఖర్‌, డీఎఫ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో దాదాపుగా పోడుభూముల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సర్వే పనులను పూర్తి చేయడం జరిగింది. గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖాధికారులు విధులను బహిష్కరించడంతో ఇతర అధికారులతో గ్రామసభలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెలలో పట్టాలు జారీ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-11-24T23:46:28+05:30 IST

Read more