ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు

ABN , First Publish Date - 2022-09-11T04:06:04+05:30 IST

పాఠ్యపుస్తకాల్లో ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకవచ్చింది. పాఠ్యపుస్తకాలపైన క్యూఆర్‌ కోడ్‌ ముద్రించింది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పాఠాలను చదవడమే కాకుండా వాటిని వీడియోలు, చిత్రాల రూపంలో కూడా చూడొచ్చు. ఆయా పాఠాలకు సంబంధించిన వీడియో లింకును ఈ కోడ్‌లో నిక్షిప్తం చేశారు. ఒక్క స్కాన్‌తో పాఠం సంపూర్ణంగా అర్థమయ్యే వరకు మళ్లీమళ్లీ వినవచ్చు. దృశ్యరూపంగాను వీక్షించవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు

- ప్రతీ పాఠానికి క్యూఆర్‌ కోడ్‌

- స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేసుకునే వీలు

- పాఠాలు అర్థమయ్యే వరకూ మళ్లీ వినొచ్చు, చూడొచ్చు

- ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఈ అవకాశం

- అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనం

బెజ్జూరు, సెప్టెంబరు 10: పాఠ్యపుస్తకాల్లో ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకవచ్చింది. పాఠ్యపుస్తకాలపైన క్యూఆర్‌ కోడ్‌ ముద్రించింది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పాఠాలను చదవడమే కాకుండా వాటిని వీడియోలు, చిత్రాల రూపంలో కూడా చూడొచ్చు. ఆయా పాఠాలకు సంబంధించిన వీడియో లింకును ఈ కోడ్‌లో నిక్షిప్తం చేశారు. ఒక్క స్కాన్‌తో పాఠం సంపూర్ణంగా అర్థమయ్యే వరకు మళ్లీమళ్లీ వినవచ్చు. దృశ్యరూపంగాను వీక్షించవచ్చు. విద్యార్థులు విన్న పాఠాల్లోని సారాంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఇవి దోహదపడతాయని ప్రభుత్వం భావించి ఈ కోడ్‌ను ముద్రించింది.

ఇబ్బందులకు చెక్‌

గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోయినా, ఆ సమయంలో బడికి వెళ్లకపోయినా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక అవస్థలు పడేవారు. అర్థం కాలేదని అడిగే ధైర్యం లేకపోవడం, ఉపాధ్యాయులు ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1258ఉన్నాయి. జిల్లా వ్యాప్తం గా 30వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ కారణంగా విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.

ఒక్కో పాఠానికి.. ఒక్కో కోడ్‌

గతంలో పాఠ్యపుస్తకానికి మొత్తం కలిపి ఒక్కటే క్యూఆర్‌ కోడ్‌ ఉండేది. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతీపాఠం వద్ద క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌చేస్తే చక్కగా డిజిటల్‌ పాఠాలను మరింత వివరంగా సమాచారం, వీడియోలు, చిత్రాల ద్వారా వినవచ్చు. మొదట్లో గణితం, భౌతికం, సాంఘిక శాస్ర్తాల పుస్తకాలపైనే క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. అప్పట్లో దీక్షయాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్‌ ఇచ్చి ఆ తరువాత క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైన కోడ్‌ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్‌ లేకున్నా నేరుగా గూగుల్‌ లెన్స్‌ ద్వారా కోడ్‌ స్కాన్‌ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు.

ఆసక్తి పెంచేలా

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తూ వినేపాఠాలు కొత్తగా ఆస క్తిగా ఉంటాయి. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు అర్థం కాని సమయంలో ఉపయోగకరంగా ఉంటున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వీడియో రూపంలో పాఠాలు వినడంతో బాగా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో మొత్తం సమాచారాన్ని ముద్రించలేరు. పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్నవారు, తెలివైన విద్యార్థులుమరింత లోతుగా, వివరంగా తెలుసుకోవాలనుకునేందుకు ఈ సాంకేతికత ఉపకరిస్తుందని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు.

అవగాహన కల్పించాలి

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దృశ్యరూపక పాఠాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ సాంకేతికత విధానంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. పాఠాలను అవసరమైనప్పుడు విద్యార్థి మళ్లీ మళ్లీ వినడం వల్ల ఆయా పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకొని పరీక్షలు బాగా రాసి ఉన్నత స్థితికి చేరేందుకు దోహదపడుతుంది. ఇందుకు గాను ఉపాధ్యాయులు క్యూఆర్‌ కోడ్‌ విధానంపై విద్యార్థులకు చెప్పినట్లయితే వారికి అవగాహన కలుగుతుంది.

పాఠాలు ఆసక్తిగా ఉంటున్నాయి

- సీహెచ్‌ వరప్రసాద్‌, విద్యార్థి

తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి మళ్లీ వింటున్నాం. ఇది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉన్నాయి. ఆయా పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగకరంగా ఉంది.

విద్యార్థులకు ఎంతో ఉపయోగం:

-రవికుమార్‌, హెచ్‌ఎం, జడ్పీఎస్‌ఎస్‌

క్యూఆర్‌ కోడ్‌ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు పునశ్చరణ ద్వారా ఆయా పాఠాల సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. పుస్తకంలోని పాఠంతో పాటు అదనంగా సమాచారం ఉండడం వల్ల తెలివైన విద్యార్థులు సంపూర్తి అవగా హనతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. తల్లి దండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి. స్మార్ట్‌ ఫోన్‌లను పాఠాలు వినేలా ప్రోత్సహించాలి.

Read more