‘మెప్మా’లో లెక్కతేలిన అవినీతి

ABN , First Publish Date - 2022-11-28T22:24:33+05:30 IST

కాగజ్‌నగర్‌, నవంబరు 28: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధిని ఏర్పాటు చేసింది. కొంతమంది మహిళలతో గ్రూపులుగా ఏర్పాటు చేసి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఆయా బ్యాంకుల నుంచి రుణం ఇచ్చే ఏర్పాట్లను చేసింది.

‘మెప్మా’లో లెక్కతేలిన అవినీతి

-అక్రమాల విలువ రూ.33,89,638

-సభ్యులకు తెలియకుండానే నిధులు డ్రా

-బ్యాంకు నోటీసులతో కుంభకోణం బట్టబయలు

-చర్యలకు ఆదేశించిన అధికారులు

-కేసు నమోదుకు రంగం సిద్ధం

కాగజ్‌నగర్‌, నవంబరు 28: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధిని ఏర్పాటు చేసింది. కొంతమంది మహిళలతో గ్రూపులుగా ఏర్పాటు చేసి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో ఆయా బ్యాంకుల నుంచి రుణం ఇచ్చే ఏర్పాట్లను చేసింది. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, గ్రూపుల్లో పూర్తిస్థాయిలో ఆడిటింగ్‌ చేయక పోవడం, మెప్మా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించటంతో స్త్రీనిధి రుణాలు పక్కదారి పట్టాయి. రెండు నెలల క్రితం కాగజ్‌నగర్‌ పట్టణంలో రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పి) అనిత పరిధిలోని స్వయం సహాయక సంఘాల గ్రూపుల నుంచి నిధులు దుర్వినియోగంపై గ్రూపు సభ్యులు స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఎంత మేర పక్కదారి పట్టాయన్న విషయంపై విచారణ జరపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులకు ఆదేశించారు. దీంతో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ పదిరోజులుగా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదికలను సిద్ధం చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కోసం ఉన్నతాధికారులకు పంపించారు.

క్షేత్ర స్థాయిలో విచారణ

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని వివిధ మహిళా సంఘాలకు మెప్మా సిబ్బంది స్త్రీనిధి పథకం కింద బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించారు. రుణాల రికవరీ చేసే బాధ్యత రిసోర్స్‌పర్సన్‌పై ఉంటుంది. మున్సిపాల్టీలోని మార్కెట్‌ ఏరియాకు ఆర్పీగా అనిత వ్యవహరిస్తున్నారు. వాసవీ స్లమ్‌, లెవల్‌ ఫెడరేషన్‌, సత్యసాయి సంఘం గ్రూపులో ఆర్పీ అనిత గ్రూపు లీడర్ల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రూ.30వేలు గ్రూపు సభ్యులకు తెలియకుండా డ్రాచేశారని విచారణలో తేలింది. అలాగే ఎస్‌ఎల్‌ఎఫ్‌ నిధులు రూ.16లక్షలు ఉండాల్సి ఉండగా, కేవలం రూ.2లక్షలు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. వీటితో పాటు శ్రీమతి ఆయేషా సిద్దికి చాందినిసంఘంలో రూ.లక్ష డబ్బులు కూడా గ్రూపు సభ్యులను నమ్మించి సొంత అకౌంటులో వేసుకున్నట్టు విచారణ అధికారికి ఆగ్రూపు సభ్యులు తెలిపారు.

అక్రమదారి పట్టిన డబ్బులు రూ.33,89,638

కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో ఆర్పీ అనితపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆయా గ్రూపుసభ్యులను అదనపు జిల్లాగ్రామీణ అభివృద్ధి అధికారి విచారిం చారు. రికార్డులన్నింటినీ పరిశీలించారు. చివరికి ఓ నివేదికను రూపాందిం చారు. ఆ నివేదిక ప్రకారం.. రూ.33,89,638 పక్కదారి పట్టినట్టు తేల్చారు.

నివేదిక జాబితా వివరాలు..

1)గ్రూపు సభ్యులకు తెలియకుండా డ్రా చేసిన డబ్బులు రూ.7,98,000

2)ఫోర్జరీ చేసి డ్రా చేసి డబ్బులు రూ.8,66,168

3)సభ్యుల నుంచి నెలనెలా వసూలు చేసిన కిస్తీలు రూ.1,61,970

4)ఎస్‌ఎల్‌ఎఫ్‌(స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌) నిధులు రూ.14,60,500

5)టీఎల్‌ఎఫ్‌(టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌) నిధులు రూ.1,03,000

==================================

మొత్తం రూ.33,89,638

==================================

తదుపరి చర్యలు..

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో ఆర్‌పి అనిత డబ్బులు పక్కాదారి పట్టించినట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విచారణ నివేదికను పూర్తి చేసి కలెక్టర్‌కు పంపించారు. ప్రస్తుతం కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు నిధులు డ్రా చేసిన వివరాలు, ఏ సంఘం నుంచి నిధులు మళ్లించారు, వాటి వివరాలన్నింటిని మెప్మా సిబ్బంది రికార్డుల ద్వారా ఒక్కొక్కటి సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిధులు దారి మళ్లించడంపై నెలరోజుల క్రితం జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కాగజ్‌నగర్‌ డీఎస్పీకి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆర్పీ నిధులు మళ్లించిన విధానంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ ఇచ్చిన నివేదికను రెండురోజుల క్రితం మెప్మా అధికారులు నేరుగా డీఎస్పీకి కలిసి అందజేశారు. ఇక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అంతా వేచి చూస్తున్నారు.

నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం..

-అంజయ్య, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో స్త్రీనిధి డబ్బులు పక్కాదారి మళ్లించిన విషయంలో పదిరోజుల క్రితం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. తదుపరి ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నాం. మళ్లించిన నిధులు రూ.33.89లక్షలు తేలినట్టు నిర్ధారనైంది.

పూర్తిగా విచారించాం..

-మోతీరాం, డిస్ట్రిక్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో ఆర్పీ అనిత పర్యవేక్షిస్తున్న స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలు జరిగినట్టు కొంతమంది సభ్యుల ఫిర్యాదు మేరకు విచారించాం. నిధుల దారి మళ్లించిన వాటిపై నివేదిక సిద్ధమైంది. పూర్తి వివరాలతో కూడిన జాబితాను పోలీసులకు అందజేశాం.

Updated Date - 2022-11-28T22:24:35+05:30 IST