పాలకుర్తి అభివృద్ధే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-16T06:05:07+05:30 IST

పాలకుర్తి అభివృద్ధే సీఎం లక్ష్యం

పాలకుర్తి అభివృద్ధే సీఎం లక్ష్యం
పాలకుర్తిలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

 పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి, ఫిబ్రవరి 15 : పాలకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో ఆయన మాట్లాడారు. పాలకుర్తి, తొర్రూరు ఉన్నత శ్రేణీ ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేవరుప్పుల, రాయపర్తి ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. పెద్దవంగర మండలానికి ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. పాలకుర్తి మండలంలోని పాలకుర్తి, బమ్మెర, వల్మిడి గ్రామాల్లో చేపట్టే పర్యాటక శాఖ పనులు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. నిధులు సరిపోకపోవడంతో మరో రూ. 15 కోట్లు నిధులు ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు వివరించారు. రాయపర్తి మండలంలోని సన్నూరులోని వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి మరిన్నీ నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాసరావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పసునూరి నవీన్‌, సర్పంచు యాకాంతరావు ఉన్నారు.

కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు పండుగలా జరపాలి

 సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ప్రజలంతా పండుగలా జరుపాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉన్నతశ్రేణి ఆస్పత్రిలో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు ఆయన పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16న రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జడ్పీటీసీ శ్రీనివాసరావు, సర్పంచు యాకాంతరావు, డాక్టర్లు యామిన, ప్రయాంక, జడ్పీకోఅప్షన్‌ సభ్యు డు మదార్‌, మార్కెట్‌ చైర్మన్‌ రాంబాబు, సర్వర్‌ఖాన్‌ తదితరులున్నారు.

‘ప్రజల కలను నిజం చేసిన మహానుభావుడు’

దేవరుప్పుల : తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను నిజం చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు.  కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. అనంతరం లంబాడీల ఆరాధ్యదైవమైన సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్‌, నాయకులు సుందర్‌రామ్‌రెడ్డి, కోతి ప్రవీణ్‌, కృష్ణమూర్తి, రమాదేవి, కిష్టయ్య, చింత రవి, సోమనరయ్య పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో త్వరలో ఉచిత విద్య, వైద్యం’ 

పాలకుర్తి : రాష్ట్రంలో మార్చి తర్వాత ఉచిత విద్య, వైద్యాన్ని అమలు చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజవర్గ కేంద్రంలో మంగళవారం సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా త్వరలో విద్య, వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని వివ రించారు. రూ.20 వేల కోట్లు కేటాయించి, ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు పథకం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణకు స్వర్ణయుగం రానుందని అన్నారు. రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ నియోజకవర్గంగా పాలకుర్తి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేసీఆర్‌ తెలంగాణ గాంధీ అని కొనియాడారు. 70 ఏళ్లుగా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఆయన వచ్చాక గ్రామాలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయని మంత్రి వివరించారు.

Read more