ముమ్మరంగా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-12-10T01:35:25+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతుండటం రైతులకు కాస్త ఊరటనిస్తోంది.

ముమ్మరంగా ధాన్యం కొనుగోలు
ధాన్యం తూకం వేస్తున్న హమాలీలు

జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం

ఇప్పటికే 98 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

ప్రభుత్వం, వ్యాపారులు పోటాపోటీ

దిలావర్‌పూర్‌, డిసెంబరు 9 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతుండటం రైతులకు కాస్త ఊరటనిస్తోంది. పంట పండించడం ఒకఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం ఇంకోఎత్తు. ఈ ఏడాది రైతులు ధాన్యం అమ్ముకోవడం కాస్త సులభమైంది. ఇంకా కలిసొచ్చే అంశమేమిటంటే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పంపక ముందే ప్రైవేటు ధాన్యం వ్యాపారులు కల్లాల దగ్గరకు వచ్చి బేరమాడుతున్నారు. తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. అయితే దొడ్డుధాన్యంలో కొనుగోలులో కొంతకోత విధిస్తుండటంతో రైతులు నిరాకరిస్తున్నారు. కేవలం సన్నరకం ధాన్యం వ్యాపారులకు ఇవ్వడం లాభదాయకం కావడంతో వారికే అమ్ము కుంటున్నారు. దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలన్నీ అయిపోయాయని అంటున్నారు. దీనికిపై ప్రభుత్వం లాభాలు మూటకట్టుకుందనే ప్రతిపక్ష నాయకులు పుకార్లు చేస్తున్నారు. ఏది ఏమై నా ప్రభుత్వం, మిల్లర్లు, దళారులు, వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ధాన్యం అమ్మకం సులభమై.. వ్యవహారం లాభదాయకంగా మారింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటికే 98 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధిస్తున్నామని అధికారులు తెలిపారు.

నాలుగు ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు

గతంలో ధాన్యం విక్రయించి డబ్బుల కోసం రైతులు నెలల తరబడి వేచి ఉండేవారు. కానీ ఈ ఏడాది ఆ సమస్య లేదు. ధాన్యం విక్రయించిన వారం పదిరోజుల్లోనే రైతుల అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. జిల్లా లో ఇప్పటికే 21 వేల 365 మంది రైతుల వద్ద నుంచి 98 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ట్యాబ్‌ ఎంట్రీ చేయగా, 12 వేల మంది రైతులకు రూ.102 కోట్లను రైతుల అకౌంట్‌లో వేశారు. కాగా ఇంకా రూ.143 కోట్లకు సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీచేయగా, రూ.105 కోట్లకు సంబంధించి డాక్యుమెంట్లను స్వీకరిం చారు. మొత్తానికి సుమారు రూ. 108 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది.

వెనువెంటనే ధాన్యం రైస్‌ మిల్లులకు తరలింపు

జిల్లాలో నాలుగు ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని 69 రైస్‌ మిల్లులకు తరలించారు. రోజు వారీగా సుమారు రూ. 10 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్మకాలు సాగుతుండటం, వారం రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

అందుబాటులో సరిపడా గన్ని బ్యాగులు

గత సంవత్సరం గన్ని బ్యాగుల కొరతతో ఏర్పడిన ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని అధికారులు ఈ ఏడాది గన్నిబ్యాగుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గన్నీబ్యాగుల కొరతను అధిగమించి సరిపడా గన్నీబ్యాగులను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం 38.59 లక్షలు అవసరం కాగా అధికారులు 43.96 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 25.33 లక్షల గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయగా, ఇంకా 18.63 లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచారు.

ఏ గ్రేడ్‌ కొనుగోలు కేంద్రాలకు.. బి గ్రేడ్‌ ప్రైవేట్‌ కేంద్రాలకు

ఈ ఏడాది ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉండటం రైతులకు కలిసి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ రకానికి రూ. 2060లు, బి గ్రేడ్‌ రకం రూ. 2040లకు కొనుగోలు చేస్తుండగా ప్రైవేట్‌ వ్యాపారులు ఏ గ్రేడ్‌ (దొడ్డు)రకానికి అదనంగా రూ.100 నుంచి 150ల ధర అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అదే బిగ్రేడ్‌ (సన్న) రకానికి కొనుగోలు చేస్తుం డగా ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం రూ. 2700ల నుంచి రూ. 2850ల ధర చెల్లించి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రైవేట్‌ వ్యాపారులు నగదు చెల్లింపులో రూ.100కు రెండు చొప్పున మినహా యించుకుని రైతులకు నగదు చెల్లిస్తుండటంతో రైతులు ఏ గ్రేడ్‌ రకంగా భావించే దొడ్డురకం ఽధాన్యాన్ని కొనుగోలు కేంద్రా ల వైపు మొగ్గుచూపుతున్నారు. బి గ్రేడ్‌ రకంగా భావించే సన్నరకం, మధ్యస్థ రకం ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో తక్కు వ ధర ఉండటంతో ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యా పారులు సైతం సన్నరకం ధాన్యాన్ని పంట పొలాల్లోకి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు రవాణా చార్జీలు మిగలడంతో పాటు ధర కూడా గిట్టుబాటు అవుతుండటంతో సన్నరకం ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపా రులకే అమ్ముకుంటున్నారు. సన్నరకానికి వ్యాపారులు వెంటనే నగదు చెల్లిస్తున్నారు.

ఏజెన్సీల వారీగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం

జిల్లాలో నాలుగు ఏజెన్సీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టారు. వీటి లో డీఆర్‌డీఏ ద్వారా 26 కొనుగోలు కేంద్రాల్లో 1791 మంది రైతుల నుంచి 5950.760 మెట్రిక్‌టన్నులు, పీఏసీఎస్‌ ద్వారా 93 కేంద్రాల్లో 9965 మంది రైతుల నుంచి 43871.240 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 75 కేంద్రాల్లో 9366 మంది రైతుల నుంచి 47105.480 మెట్రిక్‌టన్నులు, జీసీసీ ద్వారా నాలుగు కేంద్రాల్లో 243 మంది రైతుల నుంచి 884.880 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

నెలాఖరు వరకు కొనుగోళ్లు

ఈ ఏడాది ఎలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగు తున్నాయి. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ వల్ల ఇప్పటి వరకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిపి 69 రైస్‌ మిల్లులకు తరలించాం. ఈ నెల 31 వరకు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేపడతాం. రైతులు ఈలోగా ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.

- శ్రీకళ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌

ఈ ఏడాది ధాన్యం అమ్మడంలో ఇబ్బంది పడలేదు

ఈ ఏడాది ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మేశాం. గత సంవత్సరం డబ్బుల కోసం మూడు నెల లు ఎదురుచూశాం. కానీ ఈ సారివారం రోజుల్లోనే పూర్తి డబ్బులు మా బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయి. ఆనం దంగా ఉంది.

Updated Date - 2022-12-10T01:35:27+05:30 IST