జాతీయ రహదారుల నిర్వహణపై నీలినీడలు

ABN , First Publish Date - 2022-10-14T06:10:09+05:30 IST

జిల్లాకేంద్రంగా కొనసాగుతున్న రెండు నేషనల్‌ హైవేలతో పాటు మరో రెండు స్టేట్‌హైవేల నిర్వహణ, నియంత్రణలపై ప్రభావం పడే అవకాశాలు ఏర్పడుతున్నాయంటున్నారు.

జాతీయ రహదారుల నిర్వహణపై నీలినీడలు
జిల్లా క్రేందంలోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయం ఇదే

నిర్మల్‌ నుంచి తరలిపోతున్న ప్రాజెక్టు కార్యాలయం

కామారెడ్డిలో ఏర్పాటుకు రంగం సిద్ధం 

రెండు నేషనల్‌ హైవేలు, మరో రెండు స్టేట్‌ హైవేలపై ప్రభావం 

నిర్మల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రంగా కొనసాగుతున్న రెండు నేషనల్‌ హైవేలతో పాటు మరో రెండు స్టేట్‌హైవేల నిర్వహణ, నియంత్రణలపై ప్రభావం పడే అవకాశాలు ఏర్పడుతున్నాయంటున్నారు. హైదరాబాద్‌ నుంచి మూడు, నాలుగు జిల్లాల మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దు వరకు గల 44వ నంబర్‌ నేషనల్‌ హైవే రోడ్డుతో పాటు మహారాష్ట్రలోని కల్యాణ్‌ నుంచి నిర్మల్‌ వరకు గల నేషనల్‌ హైవే నంబర్‌ 61 రహదారిని పర్యవేక్షించే నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆఫీస్‌ గల పదేళ్ల నుంచి నిర్మల్‌లోనే కొనసాగుతోంది. ఇక్కడి ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆఫీసు ఈ రెండు నేషనల్‌ హైవేలతో పాటు నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు నిర్మిస్తున్న స్టేట్‌ హైవే, బోధన్‌ నుంచి బాసర మీదుగా భైంసా వరకు బీబీబీ స్టేట్‌ హైవే పనులను ఇక్కడి పీడీ ఆఫీసు పర్యవేక్షించడమే కాకుండా రెండు స్టేట్‌ హైవేలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ప్రతీరోజూ ఈ నేషనల్‌, స్టేట్‌ హైవేలపై వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధాన అంతరాష్ట్ర రోడ్డుమార్గంగా ఈ హైవేలకు గుర్తింపు ఉంది. ఇలాంటి ప్రధానహైవేల నిర్వహణ భారమంతా నిర్మల్‌లోని పీడీ ఆఫీసు పర్యవేక్షిస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు మరో పది మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతినిత్యం ఇక్కడి ప్రాజెక్టు ఆఫీసు నేషనల్‌ హైవే రోడ్డును పరిశీలించడమే కాకుండా అవసరమైన చోట్ల మరమత్తులు, ఆధునీకరణ పనులు లాంటివి చేపడుతుంటుంది. నేషనల్‌ హైవేలకు బాసటగా నిలుస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఎన్‌హెచ్‌ఎఐ పీడీ ఆఫీసు నిర్మల్‌ నుంచి కామారెడ్డికి తరలించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. నిర్మల్‌ కేంద్రంగా గత పదేళ్ల నుంచి కొనసాగుతున్న పీడీ ఆఫీసును ఉన్నపళంగా తరలించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత వర్గాలు, రవాణారంగంలో కొనసాగుతున్న వారంతా అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. 

భారంకానున్న రెండు హైవేల నిర్వహణ

నేషనల్‌ హైవేనంబర్‌ 44,61  రహదారుల నిర్వహణ ఇక భారం కానుందంటున్నారు. ఎన్‌హెచ్‌ఎఐ పీడీ కార్యాలయాన్ని నిర్మల్‌ నుంచి కామారెడ్డికి తరలిస్తున్న కారణంగా రోడ్ల మరమత్తులు, ఆధునీకరణ పనులతో పాటు ఇతరత్రా పనుల నిర్వహణకు సమస్యలు తలెత్తవచ్చంటున్నారు. సంబంధిత అధికారులు, ఈ రెండు హైవేలకు కేంద్ర బిందువైన కార్యాలయం అందుబాటులో ఉండకపోయే అవకాశం ఏర్పడబోతున్నందున నిర్వహణకు ఆటంకాలు తలెత్తవచ్చంటున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు డైరెక్టర్‌ నిర్మల్‌లోనే ఉంటున్న కారణంగా ఈ రెండు హైవేల నిర్వహణ పకడ్భందీగా కొనసాగుతుందంటున్నారు. వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడడం, అలాగే రోడ్లు తేగిపోవడం, ఇతరత్రా సమస్యలను పీడీ ఎప్పటికప్పుడు పరిష్కరి స్తూ రవాణా రంగానికి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

రెండు స్టేట్‌ హైవేలకు ఇబ్బందులే..

కాగా నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఉన్న 61వ నంబర్‌ హైవే అలాగే బోధన్‌ - బాసర - భైంసా వరకు గల స్టేట్‌హైవేల నిర్మాణ పనులకు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చంటున్నారు. ఇప్పటికే బీబీబీలుగా పిలుస్తున్న భోధన్‌-బాసర-భైంసా హైవే నిర్మాణ పనులకు ఇటీవలే టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. నేషనల్‌ హైవే తరహాలో నిర్మించనున్న ఈ స్టేట్‌హైవే కోసం రూ.520 కోట్ల నిధులు వ్యయం చేయనున్నారు. అలాగే నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు నిర్మిస్తున్న స్టేట్‌హైవే పనుల కోసం రూ.వంద కోట్లు వ్యయం చేస్తున్నారు. ఈ రెండు స్టేట్‌ హైవేలకు ఎన్‌హెచ్‌ఎఐ ద్వారా సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు. హైవేల నిర్మాణంలో అలాగే నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ ఈ స్టేట్‌హైవేల నిర్మాణంలోని లోపాలు, నాణ్యత లాంటి అంశాలపై సహాకరించనుంది. ఈ రెండు స్టేట్‌హైవేలకు ఎన్‌హెచ్‌ ఏఐ పీడీ కార్యాలయంలో సమీపంలో ఉన్నందున ఎప్పటికప్పుడు ఈ సహకారం కొనసాగుతోంది. అయితే ఇక్కడి పీడీ కార్యాలయం కామారెడ్డికి తరలిపోతున్న కారణంగా ఇలాంటి సాంకేతిక సహకారం తక్షణమే అందడం కష్టతరంకానుందంటున్నారు. 

విస్తరించనున్న ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు కనెక్టివిటీ

ప్రస్తుతం జిల్లా కేంద్రానికి నాలుగు వైపుల విస్తరించిన నేషనల్‌ హైవేల కారణంగా అంతరాష్ట్ర రవాణా కనెక్టివిటీ విస్తరిస్తోందంటున్నారు. రోడ్డు, రవాణా రంగంలో ఈ హైవేలు ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, ఓరిస్సా లాంటి రాష్ర్టాలకు ఈ హైవేలు కనెక్టివిటీ కల్పిస్తున్నందున రవాణా రంగం పెద్ద ఎత్తున విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతోంది. మొత్తానికి నిర్మల్‌ నుంచి ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్యాలయం మరో వారం పది రోజుల్లో కామారెడ్డికి తరలిపోనున్న కారణంగా పరిపాలన పరమైన సమస్యలు తలెత్తే అవకాశం లేకున్నప్పటికి రోడ్ల నిర్వహణలో సాంకేతిక పరమైన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు. 

పరిపాలన సౌలభ్యం కోసమే

పరిపాలన సౌలభ్యం కోసమే ఇక్కడి ఎన్‌హెచ్‌ఎఐ పీడీ కార్యాలయాన్ని కామారెడ్డికి తరలిస్తున్నారు. రోడ్ల నిర్వహణకు ఈ కార్యాలయం తరలింపుతో పెద్దగా అవరోఽధాలు ఎదురుకాకపోవచ్చు. కామారెడ్డి ప్రాంతంలో ఆరు లైన్‌ల హైవే ప నులు కొనసాగుతున్నందున వాటి పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతంలోని నేషనల్‌ హైవేలను కన్సల్టెన్సీ సర్వీసులు చూసుకుంటాయి. ముఖ్యంగా నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ వరకు నిర్మిస్తున్న స్టేట్‌ హైవే పనులకు గాని, భోధన్‌ నుంచి బాసర మీదుగా భైంసా వరకు నిర్మించే హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకుంటాం. 

సుభాష్‌, డీఈ నేషనల్‌ హైవే, ఆర్‌ అండ్‌ బి శాఖ 


Read more