పల్లెల్లో బైపోల్‌ పంచాయితీ!

ABN , First Publish Date - 2022-09-24T06:08:42+05:30 IST

జిల్లాలో పలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలతో పాటు వార్డు స్థానాలు ఖాళీ ఏర్ప డి యేడాది గడిచిపోతున్నా.. ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించ డం లేదు. దీంతో గ్రామాల్లో పంచాయతీ బైపోల్‌ ఇంకెప్పుడన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా.. పంచాయతీ ఎన్నికల పైనే చర్చించుకోవ డం కనిపిస్తోంది. అయితే గత ఐదు నెలల క్రితమే జిల్లాలోని పంచాయతీలలో ఏర్పడిన

పల్లెల్లో బైపోల్‌ పంచాయితీ!
ఉట్నూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం

జిల్లాలో 9 సర్పంచ్‌ స్థానాలతో పాటు 208 వార్డు స్థానాలు ఖాళీ

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక పట్టుతప్పుతున్న పాలన

ఉట్నూర్‌ గ్రామ పంచాయతీపై ఇంకా ఊగిసలాటే..

ఆశావహ నేతలకు తప్పని ఎదురుచూపులు

ప్రత్యేకాధికారులతో నెట్టుకొస్తున్న పాలన

జిల్లా వ్యాప్తంగా మొత్తం 468 గ్రామ పంచాయతీలు 

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలతో పాటు వార్డు స్థానాలు ఖాళీ ఏర్ప డి యేడాది గడిచిపోతున్నా.. ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించ డం లేదు. దీంతో గ్రామాల్లో పంచాయతీ బైపోల్‌ ఇంకెప్పుడన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా.. పంచాయతీ ఎన్నికల పైనే చర్చించుకోవ డం కనిపిస్తోంది. అయితే గత ఐదు నెలల క్రితమే జిల్లాలోని పంచాయతీలలో ఏర్పడిన ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు హడావుడి చేసి అంతలోనే మరిచిపోయారు. దాదాపుగా ఉపఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేశారు. మొత్తం తొమ్మిది సర్పంచ్‌ స్థానాలతో పాటు 208 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 217  పంచాయతీలలో సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గతంలోనే పంచాయతీ ల్లో బైపోల్‌ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంతో ఆశావాహ నేతల్లో కొత్తఆశలు చిగురించాయి. దీంతో సర్పంచ్‌, వార్డు స్థానాల్లో పోటీ చేసేందుకు కొందరు నేతలు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. మేలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు కూడా ప్రకటించారు. ఎలాగైనా పంచాయతీ ఎన్నికలు జరుగడం ఖాయమని అందరూ భావించారు. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. చివరకు నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో ఆశావాహ నేతల్లో తీవ్ర నిరాశను నింపింది. 

ప్రత్యేకాధికారులతోనే పాలన

జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన తొమ్మిది సర్పంచ్‌ స్థానాలతో పాటు 208 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఇందులో బేల మండలంలోని కొబ్బాయి, కొగ్దూరు, మాంగ్రూడ్‌, ఆదిలాబాద్‌ మండలం అంకోలి, గాదిగూడ మండలం డోంగర్‌గామ్‌, సిరికొండ మండలం జంగుగూడ, తలమడుగు మండలం రుయ్యాడి, ఉమ్రి గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేరు. దీంతో ప్రత్యేకాధికారులతోనే ఈ పంచాయతీల పాలన నెట్టుకొస్తున్నారు. యేడాదికిపైగా ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పంచాయతీ పాలన పట్టుతప్పడంతో పాటు అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు గ్రామాభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారానికి ఒకటి, రెండు సార్లు పంచాయతీకి వస్తూ.. పోతున్నారని గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అర్థం కాని పరిస్థితుల్లో గ్రామ ప్రజలు కనిపిస్తున్నారు. అలాగే జిల్లాలో వందలాది వార్డు స్థానాలు ఖాళీ కావడంతో వార్డు సమస్యలపై పంచాయతీల్లో ప్రశ్నించే వారే కరువయ్యారు. ముఖ్యంగా వానాకాలం సీజన్‌లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పల్లె ప్రజలు వాపోతున్నారు. పల్లె ప్రగతి పేరిట గ్రామాల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నా.. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రణాళికల రూపకల్పనలో కూడా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.

కలగానే మున్సిపాలిటీ

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉట్నూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉట్నూర్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడానికి చట్టపరమైన ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. గతంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను ఇక్కడ నిర్వహించనే లేదు. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చినట్లు కనిపించడం లేదు. దీంతో ఇంకా ఊగిసలాటలోనే కనిపిస్తోంది. గత కొన్నాళ్ల క్రితం ఉట్నూర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అది కూడా జరుగకపోవడంతో ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత మూడున్నరేళ్లుగా ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతోంది. ఇక్కడ సర్పంచ్‌ స్థానంతో పాటు 18 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపోటములను నిర్ణయించే ఉట్నూర్‌పై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. గత కొంత కాలంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోనే మేజర్‌ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన ఉట్నూర్‌ పంచాయతీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఉప ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు లేవు

: శ్రీనివాస్‌, డీపీవో, ఆదిలాబాద్‌

జిల్లాలో నిర్వహించే ఉప ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు లేవు. గతంలో ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవడంతోనే ఆలస్యవుతోంది. ఓటరు జాబితాను సైతం సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయినా.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సర్పంచులు లేని గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా.. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2022-09-24T06:08:42+05:30 IST