చలితో ఆసిఫాబాద్‌ ఏజెన్సీ గజ..గజ

ABN , First Publish Date - 2022-11-30T22:17:37+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 30: జిల్లాలో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతుండడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. గతేడాదితో పోల్చి చూస్తే చలి పంజా విసురుతోంది. దీంతో అటవీప్రాంత గ్రామాలు చలిదెబ్బకు గజగజ వణికిపోతున్నాయి.

చలితో ఆసిఫాబాద్‌ ఏజెన్సీ గజ..గజ

- రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

- సిర్పూర్‌(యు)లో 8.6డిగ్రీల ఉష్ణోగ్రత

- చలితోపాటు వణికిస్తున్న శీతలగాలులు

- వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ఆసిఫాబాద్‌, నవంబరు 30: జిల్లాలో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతుండడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. గతేడాదితో పోల్చి చూస్తే చలి పంజా విసురుతోంది. దీంతో అటవీప్రాంత గ్రామాలు చలిదెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్లలో చలి తీవ్రత పెరగడంతో ఉదయం పది, పదిన్నర గంటలైనా జనం రోడ్డెక్కని పరిస్థితి నెలకొన్నది. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు ఊహించని మార్పులకు లోనయ్యాయి. మధ్యలో తుఫాన్‌ ప్రభావంతో కొన్నిరోజులు కాస్త చలి తీవ్రత తగ్గినప్పటికీ నాలుగైదు రోజుల్లో ఒక్కసారిగా పెరిగింది. అత్యల్పంగా బుధవారం సిర్పూర్‌(యూ)లో 8.6డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మధ్యాహ్న 12గంటల వరకు కూడా చలిగాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా మధ్యాహ్నం తరువాతే రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత నాలుగు రోజులుగా 8.3 నుంచి 11.5డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం 12గంటలు దాటితే కానీ జనం రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని 15మండలాల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులు, రైతుకూలీలు రోజు వారి పనులు చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా కెరమెరి, జైనూర్‌, వాంకిడి, తిర్యాణి, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, బెజ్జూరు వంటి మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువ నమోదు అవుతున్నాయి. బుధవారం అటవీ ప్రాంతాలైన జైనూర్‌, కెరమెరి, సిర్పూర్‌(యు), తిర్యాణి, లింగాపూర్‌ మండలాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 8.6నుంచి 10.6డిగ్రీల స్థాయికి పడిపోయినట్లు గణంకాలు చెబుతున్నాయి. పొగమంచు కూడా విపరీతంగా కురుస్తుడడంతో చర్మ సంబంధ వ్యాధుల బారిన పడి చికాకులు ఎదుర్కొంటున్నారు. గాలిలో తేమ కారణంగా శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పత్తి తీసే సీజన్‌ కావడంతో రైతు కూలీలు పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సాధారణంగా కూలీలు వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంతం అయిదు గంటల వరకు పని చేయడం రివాజు. తాజా పరిస్థితులతో పది, పదిన్నర గంటలు దాటితే తప్ప కూలీలు చేలకు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఉదయం, రాత్రి వేళల్లో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా చలిదెబ్బకు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది, పది గంటలు దాటితే తప్పా కూరగాయల మార్కెట్‌లలో జనం కనిపించడం లేదు. దాంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకవైపు చలితోపాటు మరో వైపు శీతలగాలులు వీస్తుండడంతో ప్రజలు దగ్గు, దమ్ము, జ్వరాల బారిన పడుతున్నారు.

వ్యాధులతో అప్రమత్తం..

వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇస్నోఫీలియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రతి ఏడాది డిసెంబర్‌, జనవరి మాసాల్లో ఈ వ్యాధి బారిన పడిన బాధితుల సంఖ్య అధికంగా నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో సరైన రక్షణ లేకుండా చలిగాలిలో తిరిగే వారిలోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. రక్తంలో ఎర్రకణాల సంఖ్య పడిపోయి తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల ఇస్నోఫిలియా ప్రభావం పెరుగుతుందన్నారు. ఫలితంగా దగ్గు, జలుబు వంటి అలర్జీలతోపాటు ఒంటిపై దురద, దద్దుర్లు రావడం వంటి సమస్యలకు గురవుతారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా రక్తంలో తేడా వల్ల వ్యాధి ముదిరి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది 0-5చిన్నారుల్లో శ్వాస సంబంధమైన సమస్యలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జరం లక్షణాలు కనిపించక పోయినా చిన్న పిల్లలకు దగ్గు, జలుబు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

గత ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు..

తేదీ ఉష్ణోగ్రతలు

నవంబరు 30 10.6 డిగ్రీలు

నవంబరు 29 8.3 డిగ్రీలు

నవంబరు 28 9.1 డిగ్రీలు

నవంబరు 27 9.7 డిగ్రీలు

నవంబరు 26 11.5 డిగ్రీలు

జాగ్రత్తలు పాటించాలి..

- డాక్టర్‌ సత్యనారాయణ, ఆసిఫాబాద్‌

చలికాలంలో చర్మ సంబంధ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఇస్నోఫిలియా కారణంగా తెల్ల రక్తకణాల శాతం పెరిగి అలర్జీ బారిన పడుతారు. ఆస్తమా, బ్రాంకైటీస్‌ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. చలిగాలులకు బయట తిరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది. చిన్న దెబ్బ తగిలినా, కాలిన గాయాలైనా ఈ సీజన్‌లో మానడం చాలా కష్టం. వీలైనంత ఎక్కువ జాగ్రత్తలు పాటించడం మంచిది.

Updated Date - 2022-11-30T22:17:39+05:30 IST