వ్యవసాయాధికారులు ఫీల్డ్‌కు వెళ్తేనే హాజరు

ABN , First Publish Date - 2022-12-09T22:32:24+05:30 IST

వాంకిడి, డిసెంబరు 9: క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)ని నియమించింది.

వ్యవసాయాధికారులు ఫీల్డ్‌కు వెళ్తేనే హాజరు

- లైవ్‌ లొకేషన్‌తో అందుబాటులోకి

- యాక్టివిటీ లాంగర్‌ యాప్‌ రూపకల్పన

- ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లి ఫొటో దిగాల్సిందే

- మరింత మెరుగుపడనున్న వ్యవసాయశాఖ సేవలు

వాంకిడి, డిసెంబరు 9: క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సూచనలిస్తూ నూతన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)ని నియమించింది. వీరు గ్రామాల్లో పర్యటించి సాగుచేసిన పంటలను పరిశీలిస్తూ రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలి. అయితే ఇంతకుముందు వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లక పోయినా హాజరు పడేది. ఈ క్రమంలో వ్యవసాయాధికారుల గైర్హాజర్‌కు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించే వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 70మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోలు) పనిచేస్తున్నారు. జిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉండగా 4.45 లక్షల ఎకరాలు సాగుచేస్తున్నారు.

సేవలు మెరుగుపర్చేందుకు..

రైతులకు క్షేత్రస్థాయిలో సేవలు విస్తరించడం, వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపర్చేందుకు యాక్టివిటీ లాంగర్‌ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో పంటలను పరిశీలించాల్సిన వ్యవసాయ విస్తరణాధికారుల్లో కొంతమంది కేవలం రైతు వేదికలకే పరిమితమయ్యేవారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యాప్‌ను రూపొందించి. అయితే యాప్‌లో లోపాలను ఆసరా చేసుకున్న కొంతమంది ఏఈవోలు పాత చిత్రాలను నమోదు చేసేవారు. అవీ వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు యాప్‌ను అధునీకరించి లైవ్‌లొకేషన్‌ ఉండేలా చేశారు. దీంతో ఏఈవోలు ఎక్కడికెళ్లినా నిర్దేశిత సమయంలో రైతులతో ఫొటో దిగి యాప్‌లో పొందుపరిస్తేనే హాజరుపడినట్లు లెక్క. యాప్‌లో నమోదు చేయని పక్షంలో ఆరోజు సంబంధిత ఏఈవోలు విధులకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు

- 17అంశాలు నమోదు..

వ్యవసాయ రంగంలో తీసుకున్న సంస్కరణల్లో భాగంగా ఏఈవోలు యాక్టివిటీ లాంగర్‌ యాప్‌లో 17అంశాల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకక్లస్టర్‌ చొప్పున ఏర్పాటు చేసి యాప్‌లో పంటల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పంటల నమోదు, రైతుబీమా, రైతుబంధు పత్రాల నమోదు, పీఎం కిసాన్‌ యోజన వెరిఫికేషన్‌, సమావేశాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన తదితర విషయాలను యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పర్యటనను ముగించుకొని తిరిగి ఏఈవోలు రైతువేదిక వద్దకు చేరుకోవాలి. ఇలా 17అంశాలతో జాబ్‌కార్డును తయారు చేసుకోవాలి. యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన వివరాలు వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు చేరవేయాలి. దాని ఆధారంగా ఏఈవోల పనితీరుకు గ్రేడింగ్‌ ఇస్తారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్‌తో ఏఈవోల పనితీరు మెరుగుపడడమే కాకుండా రైతులు వ్యవసాయసాగులో అధిక దిగుబడులు సాధించేందుకు ఎంతో ఉప యోగపడుతుంది.

పనితీరు మెరుగుపడుతుంది

- వ్యవసాయ అధికారి మిలింద్‌కుమార్‌

వ్యవసాయశాఖలో అమలు చేస్తున్న యాక్టివిటీ లాంగర్‌యాప్‌ ద్వారా ఏఈవోల పనితీరు మరింత మెరుగుపడుతుంది. క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయి. ఏఈవోలు ఉదయం రైతు వేదికకు చేరుకొని అక్కడినుంచి ఫీల్డ్‌లోకి వెళ్తారు. లైవ్‌లొకేషన్‌ యాప్‌తో ఏఈవోలు అందు బాటులో ఉండటమే కాకుండా రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తారు. ఏఈవోలు ప్రతిఒక్కరూ క్లస్టర్ల్‌లో విధిగా క్షేత్ర పర్యటనలు చేపడుతున్నారు.

Updated Date - 2022-12-09T22:37:33+05:30 IST