స్త్రీనిధి రుణాల రికవరికీ చర్యలు

ABN , First Publish Date - 2022-11-11T22:48:38+05:30 IST

కాగజ్‌నగర్‌, నవంబరు 11: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన డబ్బుల అవకతవకలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగదు రికవరీ చేసేందుకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఆరోపణలు వచ్చిన గ్రూపులపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.

స్త్రీనిధి రుణాల రికవరికీ చర్యలు

-తేరుకున్న అధికారులు

-‘మన స్త్రీనిధి’ యాప్‌పై విస్తృత ప్రచారం

కాగజ్‌నగర్‌, నవంబరు 11: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరిగిన డబ్బుల అవకతవకలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగదు రికవరీ చేసేందుకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఆరోపణలు వచ్చిన గ్రూపులపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఏపీడీ) శ్రీనివాస్‌ వారంరోజుల క్రితం వివరాలు సేకరించారు. వాసవీ మహిళా సమాఖ్య గ్రూపులో ఇచ్చిన రుణాలు? కట్టిన డబ్బులు? ఇతర అంశాలపై ప్రతి సభ్యురాలి నుంచి వివరాలు సేకరించారు. ఇందులో రూ.33లక్షల డబ్బులు పక్కదారి పట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అఽధికారికంగా మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అవకతవకలు పాల్పడిన గ్రూపులకు సంబంధించిన వాటి విషయంలో రికవరీ చేసేందుకు ఐదుగురు ఓబీ(ఆఫీస్‌ బేరర్‌)లను నియమించారు. ఈ ఓబీలంతా కూడా ఐదు రోజులుగా వివిధ వార్డుల్లో తిరుగుతూ ఆరోపణలు వచ్చిన స్త్రీనిధి గ్రూపు సభ్యులతో కలిసి ఎంత రుణం కట్టారు? ఇంకా ఎంత రుణం కట్టాలన్న విషయాలు తెలుసుకుని డబ్బులు వసూలు చేసి సంబంధిత ఎకౌంట్‌లో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రుణాల వసూలు చేస్తుండటంతో ఇతర గ్రూపుల్లో కూడా అలజడి మొదలైంది. అక్రమాలు జరిగిన వాటిపై ఏపీడీ నివేదిక రూపొందిచారు. ఈ నివేదిక ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా వివరాలు సేకరించారు. అధికారి నివేదిక కోసం అంతా నిరీక్షిస్తున్నారు. స్త్రీనిధి రుణాలపై నెల రోజుల క్రితం కూడా అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి రుణాల రికవరీ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని గ్రూపులపై నిఘా..

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని 30వార్డులకు 42స్త్రీనిధి గ్రూపులున్నాయి. ఇందులో మూడు యాక్టివ్‌లో లేకపోవటంతో కేవలం 39గ్రూపులనే కొనసాగిస్తున్నారు. శ్రీనిధి పథకం ద్వారా మహిళా గ్రూపులకు రుణాన్ని మంజూరు చేసేందుకు సభ్యులంతా తీర్మాణం చేశారు. ఈ తీర్మాణం కాపీని సంబంధిత మెప్మా అధికారులు బ్యాంకు లీంకేజీ ద్వారా రుణాలను అందజేస్తారు. తిరిగి చెల్లింపులు చేసే విషయంలో అవకతవకలు జరుగుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. పట్టణంలో 2020-2021 సంవత్సరానికి గాను రూ.2కోట్ల రుణాన్ని మహిళా గ్రూపులు తీసుకున్నాయి. ఇప్పుడు గ్రూపులో ఎంతమంది సభ్యులు తీసుకున్నారు? తీసుకున్న వారిలో ఎంతమంది చెల్లించారు? అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే స్త్రీనిధి పథకం పక్కాదారి పడుతున్నట్టు మహిళలు పేర్కొంటున్నారు.

‘మన స్త్రీనిధి’ యాప్‌తోనే అక్రమాలకు చెక్‌

అవినీతి అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం ‘మన స్త్రీనిధి’ యాప్‌ను ప్రవేశపెట్టింది. రుణం తీసుకున్న గ్రూపు సభ్యుల సెల్‌ నంబర్లు ఇందులో నమోదు చేస్తారు. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత సెల్‌ నంబరు ఎంటర్‌ చేస్తే పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ యాప్‌పై కాగజ్‌నగర్‌లోని మెప్మా సిబ్బంది అన్ని గ్రూపుల సభ్యులకు అవగాహన పరుస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారానే బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఎవర్నీ ఊపేక్షించేది లేదు..

-శ్రీనివాస్‌, స్త్రీనిధి మేనేజర్‌

స్త్రీనిధి పథకం ద్వారా తీసుకున్న రుణాలను ఖచ్చితంగా చెల్లించాల్సిందే. పక్కదారి పట్టిన డబ్బుల విషయంలో వారంరోజుల క్రితం కూడా ఏపీడీతో విచారణ పూర్తైంది. నివేదికలు రావాల్సి ఉంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం. రికవరీ చేసేందుకు ప్రత్యేకంగా ఐదుగురు ఓబీలను నియమించాం. అవినీతి ఆరోపణలు వస్తున్న గ్రూపుల నుంచి డబ్బులను తప్పుకుండా రికవరీ చేస్తారు. ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

సభ్యులందరికీ అవగాహన కల్పిస్తున్నాం..

-మోతీరాం, డిస్ట్రిక్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ కాగజ్‌నగర్‌

స్త్రీనిధి రుణాల చెల్లింపులపై గ్రూపు సభ్యులందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ‘మన స్త్రీనిధి’ యాప్‌పై అందరికీ వివరిస్తున్నాం. యాప్‌ ద్వారా ఎంత రుణం చెల్లించారు, ఎంత కట్టాల్సి ఉందన్న విషయం ఇట్టే తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాం.

Updated Date - 2022-11-11T22:48:40+05:30 IST