రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

ABN , First Publish Date - 2022-08-31T06:42:22+05:30 IST

మైనింగ్‌ మాఫియాకు బాసర కేంద్రమైంది.

రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా
నిజామాబాద్‌ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా బాసర వైపు వస్తున్న ఇసుక టిప్పర్‌ నిదర్శనంగా చెప్పుకోవచ్చు

బాసర కేంద్రంగా ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణా 

రాత్రి, పగలూ తేడా లేకుండా దందా 

నిజామాబాద్‌, మహారాష్ట్ర నుంచి వస్తున్న ఇసుక.. జిల్లా నుంచి  మహారాష్ట్రకు మొరం తరలింపు

చోద్యం చూస్తున్న అధికారులు 

బాసర, ఆగస్టు, 30 : మైనింగ్‌ మాఫియాకు బాసర కేంద్రమైంది. బాసర మీదుగా ఇసుక, మొరం పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చివరికి మట్టిని కూడా వదలడం లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా దందా కొనసాగుతోంది. దీనిని పట్టించుకునే నాథుడే లేడు. దీంతో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మహారాష్ట్ర నుంచి ఇసుక జిల్లాకు వస్తుండగా.. మహారాష్ట్రకు మొరం తరలిస్తున్నారు. ఇక నిజామాబాద్‌ జిల్లా నుంచి అక్రమంగా ఇసుక, మొరం జిల్లాకు అక్రమం గా తెస్తున్నారు. బాసరతో పాటు ఈ ప్రాంతం కూడా మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, ముథోల్‌, భైంసా ప్రాంతాలకు ప్రతీరోజు పెద్దసంఖ్యలో టిప్పర్లతో అక్రమ తరలింపు జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధి కారుల చర్యలు కనిపించకపోవడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అడ్డగోలుగా ఇసుక రవాణా 

వర్షాకాలం కావున కాళేశ్వరం మినహా ఇక్కడి  ప్రాంతంలో అధికారిక ఇసుక క్వారీలు ఏవీ కొనసాగడం లేదు. కానీ ప్రతిరోజు బాసర గుండా పదుల సంఖ్యలో ఇసుక లారీలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి బాసరతో పాటు నిజామాబాద్‌ వైపు, భైంసా వైపు నడుస్తుండగా నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి మండలం ప్రాంతాల నుండి బాసర వైపు అక్రమ ఇసుకరవాణా జరుగుతుంది. ఎలాంటి కనీస అనుమతులు లేకుండా దందా కొనసాగిస్తున్నారు. సాధారణ వ్యక్తులు ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో జమ అయిన ఇసుకను తెచ్చుకుంటే ట్రాక్టర్లను సీజ్‌ చేసి చర్యలు తీసుకునే అధికారులకు ఇంత పెద్దఎత్తున జరుగుతున్న కని పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరలో కూడా ఎక్కడ చూసినా ఇసుక డంపులే దర్శనమిస్తున్నాయి. 

కరిగిపోతున్న మొరం గుట్టలు  

ఇసుకనే కాదు మొరందందా కూడా ఈ మాపియా గప్పిట్లోనే ఉంచుకొని కొనసాగిస్తుంది.. బాసరలో మొరందందా మూడు ట్రాక్టర్లు... ఆరుటిప్పర్లు అన్న చందంగా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం అధికారిక కార్యాలయం ముందు నుండే అక్రమంగా తరలించడం ఇక్కడ బహిరంగ రహస్యం. ఒక్కరోజు వందలసంఖ్యలో తరలించాలంటే రాత్రుల్లో దందాను నడిపిస్తున్నారు. బాసరతో పాటు పొరుగున మహారాష్ట్రకు తరలిస్తున్నారు. బాసరలోని చెరువులు, కుంటల్లో పెద్దగుంతలు తీసి మొరం తీయడంతో పాటు మొరగుట్టను తవ్వుతూ కరిగిచ్చేస్తున్నారు. బాసర బాసర మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని బిద్రెల్లి వాగు ప్రాంతం, కిర్గుల్‌ (బీ), కిర్గుల్‌ (కే), ఓని గ్రామాల పరిధిలో ఈ దందా నడుస్తుంది. మొరం ధర ఇక్కడ ఆకాశన్నంటుతుంది. ఒక టిప్పర్‌ రూ.4500 వసూలు చేస్తున్నారు. నిర్మాణాలతో పాటు కొత్వ వెంచర్లకు అవసరం ఏర్పడడంతో ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. 

మట్టినీ వదలడం లేదు

మొరం, ఇసుకనే కాదు బాసరలో మట్టిని తరలించాలన్న అక్రమార్కు లతోనే సాధ్యం, సాధారణ వ్యక్తులు మట్టిన కూడా తమ అవసరాలను తరలించుకొనలేదని స్థితి. ఈ క్రమంలో బాసరలో చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. లోతట్టు ప్రదేశాల్లో నింపుకోవడానికి మట్టి అవసరం ఏర్పడుతుంది.ఇసుక, మొరం తరలించే వారే అధికారులు తమ గుప్పిట్లో ఉండడంతో దర్జాగా చెరువు, గుట్టల నుండి మట్టిని తరలిస్తున్నారు. 

అధికారులు ఏమంటున్నారంటే..

ఈ అక్రమ దందా గురించి తహసీల్దార్‌ నారాయణ, ఎస్‌ఐ మహేష్‌ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా మా దృష్టికి రాలేదని అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read more