చేనేతపై జీఎస్టీ రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-08-07T08:19:38+05:30 IST

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చేనేతపై జీఎస్టీ రద్దు చేయండి

టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులివ్వండి 

సిరిసిల్ల పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఎప్పుడు? 

కేంద్ర మంత్రికి కేటీఆర్‌ లేఖ

మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులివ్వండి 

కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ మంత్రికి కేటీఆర్‌ లేఖ  


హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపైనా పన్ను విధించిన బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర అరాచక, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న నిరసనలను దృష్టిలో ఉంచుకోనైనా కేంద్రం తన తీరు మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. టెక్స్‌టైల్‌ రంగానికి చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ నెల 7తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగానైనా జీఎస్టీని రద్దు చేయాలన్నారు. వ్యవసాయం తరువాత అత్యధికంగా దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌ టైల్‌ రంగంపై మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని,  ‘శుష్క వాగ్దానాలు-రిక్త హస్తాలు’ అన్నట్టుగా వ్యవహరిస్తూ నేతన్నల కడుపు కొడుతోందని మండిపడ్డారు.


తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని తెలంగాణ నేతన్నకు సహాయం చేయాలని హితవు పలికారు. ఇటీవలే తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సుమారు రూ.1552 కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. పైగా మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు. ఇప్పటికైనా మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులివ్వాలని కోరారు. 


టెక్స్‌టైల్‌ రంగంలో వెనకబాటేనా?

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌, శ్రీలంకతో పాటు అనేక చిన్న చిన్న దేశాలు టెక్స్‌టైల్‌ రంగంలో మనకంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేస్తున్నాయని, ఈ విషయంలో భారత్‌ వెనకబడుతోందని, ఇందుకు కేంద్రప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యధిక పవర్‌ లూమ్‌లు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్రం స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో నేతన్నల కోసం వీవింగ్‌ పార్క్‌, అపెరల్‌ పార్క్‌తో పాటు కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌తో పాటు హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్‌ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-07T08:19:38+05:30 IST