ఆసరా నిరాశ!

ABN , First Publish Date - 2022-09-21T05:24:44+05:30 IST

ఆసరా నిరాశ!

ఆసరా నిరాశ!
అర్పనపల్లిలో పింఛన్‌ మంజూరై నిలిచిపోయిన కుండె మల్లయ్య, ఇనుగుర్తిలో ఆసరా పింఛన్‌ తీసుకునేందుకు పోస్టాఫీసుకు వచ్చిన లబ్ధిదారులు (ఫైల్‌)

ఆసరా పింఛన్‌ కార్డు ఇచ్చారు.. తీసుకున్నారు

కొత్త పింఛన్ల మంజూరులో గందరగోళం

ఒకే ఇంట్లో రెండు పింఛన్లకు నో 

రహస్యంగా కొత్త నిబంధనలు అమలు ?

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల వడపోత

జిల్లాలో 5,355 దరఖాస్తుల తిరస్కరణ

అర్హులకు అందని ‘ఆసరా’

కొన్నిచోట్ల అనర్హుల ఎంపిక


కేసముద్రం, సెప్టెంబరు 20 : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన నూతన ఆసరా పింఛన్ల మంజూరులో గందరగోళం నెలకొంది. పింఛన్‌ మంజూరు చేస్తూ కార్డులను జారీ చేసి సభలు ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇటీవలె ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఇక తమకు ఆసరా పింఛన్‌ వచ్చినట్లేనని లబ్ధిదారులు ఆ కార్డులను చూసి మురిసిపోయారు. కార్డులు తీసుకున్న కొంతమందికి మాత్రం ఆ సంతోషం కొద్దిరోజులే నిలుపుతూ ‘మీ దరఖాస్తు తిరస్కరణకు గురైందని’ పేర్కొంటూ ఇచ్చిన ఆసరా పింఛన్‌ కార్డును తిరిగి తీసుకుంటున్నారు. గ్రామాల్లో బహిరంగ సభలో అట్టహాసంగా వేదికపై ఎమ్మెల్యే, మంత్రులతో ఆసరా పింఛన్‌కార్డు తీసుకున్నప్పటికీ తిరిగి రద్దయిందని చెప్పడం ఏమిటని లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. నూతన ఆసరా పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త నిబంధనలను రహస్యంగా అమలు చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక కుటుంబంలో రెండు వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయలేదు. వృద్ధాప్య, గీతకార్మికులు మినహా దివ్యాంగులు, వితంతువు, ఒంటరి మహిళ పింఛన్లకు కుటుంబంలో అర్హులుంటే ఒకటికంటే ఎక్కువ మందికి సైతం మంజూరు చేశారు. ఈసారి నూతన పింఛన్‌ మంజూరులో మాత్రం ఒక కుటుంబంలో ఒక రకమైన పింఛన్‌ ఉంటే మరొకరికి ఇవ్వలేదని సమాచారం. 


5355 దరఖాస్తుల తిరస్కరణ...

జిల్లాలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ల కోసం గత ఏడాది ఆగస్టు 15 నుంచి 31వ తేదీ వరకు 18,733 మంది, అక్టోబర్‌ 16 నుంచి 30వ తేదీ వరకు 1,657 మంది వెరసి రెండు దఫాలుగా 20,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 15,035 మందికి నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయగా 5,355 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాల్లో 16 మండలాల్లో తొర్రూరు మండలంలో అత్యధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. తొర్రూరులో 2087 మంది దరఖాస్తు చేసుకోగా 1,355 మందికే (64.93శాతం)పింఛన్‌ మంజూరు చేసి 732 మంది దరఖాస్తులను తిరస్కరించారు. కొత్తగూడలో 828 మంది దరఖాస్తు చేసుకోగా అత్యధికంగా 685 మందికి (82.73శాతం) పింఛన్‌ మంజూరు చేసి 143 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో అత్యధికంగా మహబూబాబాద్‌ మండలంలో  2,334 దరఖాస్తులు రాగా 1,886 మందికి పింఛన్‌ మంజూరు చేసి 448 మంది దరఖాస్తులను తిరస్కరించారు. 


ఆన్‌లైన్‌తో అర్హులకు అందని ఆసరా...

నూతన ఆసరా పింఛన్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించడంతో తిరస్కరణకు గురై పలువురు అర్హులకు పింఛన్‌ అందకుండా పోతోంది. అన్ని అర్హతలున్నప్పటికీ తమకు ఆసరా పింఛన్‌ రాలేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆసరా దరఖాస్తులను గత ఏడాది రెండు దఫాలుగా మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించారు. ఆన్‌లైన్‌ ద్వారా పంపిన దరఖాస్తులను ‘డేటా ఇంట్రిగేషన్‌’ ద్వారా వడపోసినట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తుదారుల పేరుపై నాలుగు చక్రాల వాహనం, బిల్డింగ్‌ రిజిస్ర్టేషన్‌ ఉన్నట్లయితే రద్దు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఒక రకం పింఛన్‌ వస్తే మిగతావారి దరఖాస్తులను చాలా మందివి తిరస్కరించారు. మరికొంతమందికి మంజూరు అయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లాలోని గార్ల, మరికొన్ని గ్రామాల్లో అనర్హులకు పింఛన్‌ మంజూరైంది. ప్రభుత్వం ఉద్యోగం ఉన్నవారి కుటుంబంలో మరొకరికి, ఉద్యోగ పింఛన్‌ తీసుకుంటున్నవారికి ఆసరా పింఛన్‌ మంజూరుకావడం గమనార్హం. 


క్షేత్రస్థాయిలో పరిశీలించాలి...

ఆసరా పింఛన్ల మంజూరులో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల వడపోత వల్ల కొంతమంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఆదాయపన్ను తప్పించుకునేందుకు నాలుగు చక్రాల వాహనాలను కొంతమంది నిరుపేదలను బినామీలుగా పెట్టి కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. వాహనాలను కొనుగోలు చేసిన వారిలో ఆర్థికంగా నష్టపోయి దివాళా తీసినవారు లేకపోలేదు. ఎనిమిదేళ్ల క్రితం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. కొందరు దంపతుల మధ్య వివాదం ఏర్పడి విడిపోయి కుటుంబ ఆదాయ ప్రమాణాల్లో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకోవడం వల్ల పలువురు అర్హులకు ఆసరా పింఛను అందకుండా పోతోంది. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రస్తుతం ఒంటరి మహిళ పింఛన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఇందుకు నిదర్శనంగా కేసముద్రం మండలంలోని అర్పనపల్లిలో కుండె మల్లయ్య వృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తూ చేసుకోగా ఆయన భార్యకు కొన్నేళ్లుగా దివ్యాంగ పింఛన్‌ వస్తున్నందున తిరస్కరించారు. ఇదే గ్రామంలో చిట్టె కట్టమ్మ దివ్యాంగ పింఛన్‌ కోసం దరఖాస్తు చేయగా ఆమె భర్త ముత్తయ్యకు వృద్ధాప్య పింఛన్‌ వస్తున్న కారణంగా నిలిపివేస్తున్నట్లు తిరస్కరణ జాబితా పంపించారు. అమినాపురంలో ఒక మహిళ పదేళ్లుగా భర్తతో వివాదం ఏర్పడి విడిపోయి ఉంటున్నారు. ఆమె ఒంటరి మహిళ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమె భర్తకు గతంలో దివ్యాంగ పింఛన్‌ వస్తుండడంతో ఆమె దరఖాస్తు సైతం తిరస్కరించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులకు ఆసరా పింఛను మంజూరు చేయాలని, అనర్హులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.


తిరస్కరణకు గురైన వారిని పరిశీలిస్తాం : సన్యాసయ్య, డీఆర్‌డీవో, మహబూబాబాద్‌

నూతన పింఛన్‌ జాబితాలో పేరు వచ్చి తిరస్కరణకు గురైన వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలిస్తాం. ఈ మేరకు తిరస్కరణ జాబితాలో ఉన్నవారిలో అర్హులను గుర్తించే విధంగా మండల అధికారులకు త్వరలో ఆదేశాలిస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ మంజూరు కోసం పంపిస్తాం.

Updated Date - 2022-09-21T05:24:44+05:30 IST