గుట్టలో క్షేత్రపాలకుడికి ఆకు పూజ

ABN , First Publish Date - 2022-11-30T00:24:17+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి నాగవల్లీదళార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు నిత్యపూజా కైంకర్యాలు నిర్వహించారు.

గుట్టలో క్షేత్రపాలకుడికి ఆకు పూజ

యాదగిరిగుట్ట, నవంబరు 29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి నాగవల్లీదళార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు నిత్యపూజా కైంకర్యాలు నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద నున్న ఆంజనేయస్వామిని, శివాలయంలోని, పాతగుట్ట ఆలయంలో కొలువైన ఆంజనేయస్వామిని అర్చకులు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసి, సింధూరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. స్వామికి ప్రీతియైున తమలపాకులతో సహస్రనామార్చనలు జరిపారు. స్వామికి బూరెలు, వడలు, బెల్లంపానకం, వడపప్పు, అరటి పండ్లు నివేదించి, వితరణ చేశారు. కొండపైన వానరాలకు అరటి పండ్లను ఆహారంగా అందజేశారు. కాగా నృసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్త్రరీతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల రూ.22,94,511 ఆదాయం సమకూరినట్టు, బ్రేక్‌ దర్శనాల్లో సుమారు 459మంది భక్తులు దర్శించుకున్నట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు.

స్వామి సేవలో ప్రముఖులు

యాదగిరివాసుడిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామిని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, తెలంగాణ రాష్ట్ర ఇన్స్‌పెక్టర్‌ జెనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ప్రధానాలయంలో కొలువుదీరిన స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-11-30T00:24:20+05:30 IST