దేహదారుఢ్య శిక్షణ పేరుతో ఓ వర్గంపై కత్తి

ABN , First Publish Date - 2022-09-21T07:19:22+05:30 IST

కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌, దేహ దారుఢ్య శిక్షణ పేరుతో ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని అందుబాటులో..

దేహదారుఢ్య శిక్షణ పేరుతో ఓ వర్గంపై కత్తి

  • ఆ వర్గానికి చెందిన వారిని మట్టుబెట్టడంపై పీఎఫ్‌ఐ శిక్షణ..
  • ఎన్‌ఐఏ రిమాండ్‌ రిపోర్ట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌, దేహ దారుఢ్య శిక్షణ పేరుతో ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని అందుబాటులో ఉన్న ఆయుధాలు ఉపయోగించి ఎలా చంపాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టుకు వెల్లడించింది. గత ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ... నలుగురు పీఎఫ్‌ఐ నాయకుల్ని అరెస్ట్‌ చేసి సోమవారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించింది. ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన సయ్యద్‌ యాసిన్‌ సమీర్‌, ఫెరోజ్‌ఖాన్‌, మహ్మద్‌ ఉస్మాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ల రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. 


నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌తో కలిసి ఈ నలుగురు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొంది. అబ్దుల్‌ ఖాదర్‌తోపాటు మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న స్థానిక పోలీసుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు. పీఎఫ్‌ఐకి చెందిన కొందరు నేతలు ఇచ్చిన నిధులతో అబ్దుల్‌ ఖాదర్‌ తన ఇంటిపై నిర్మాణం చేసి ఐదు రోజుల పాటు శరీర దారుఢ్య శిక్షణ పేరుతో కర్రలు, ఇనుప రాడ్లు, కత్తులు, నాన్‌చాక్‌, కొడవలి వంటి వాటిని ఉపయోగించి ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని ఎలా దాడి చేసి చంపాలనేదానిపై శిక్షణ ఇస్తున్నట్లు తేలిందన్నారు. శరీరంలోని ఏ అవయవాలపై దాడి చేయడం వల్ల ఎదుటి వారిని మట్టుబెట్టవచ్చనే అంశంలోనూ శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని, భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ఓ వర్గం వారిని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడేలా పథకం రూపొందించారని రిమాండ్‌ రిపోర్టులో వివరించారు. శిక్షణ కోసం పీఎ్‌ఫఐకి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించారని అధికారులు పేర్కొన్నారు.  

Read more