ఎనిమిది జిల్లాల్లో 58% సిజేరియన్లు

ABN , First Publish Date - 2022-10-11T09:04:19+05:30 IST

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 45 శాతానికి పైగా డెలివరీలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండటంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు.

ఎనిమిది జిల్లాల్లో 58% సిజేరియన్లు

  • 6 జిల్లాల్లో 45 శాతం డెలివరీలు ప్రైవేటులోనే 
  • వైద్య శాఖ సిబ్బందిపై మంత్రి హరీశ్‌ ఆగ్రహం
  • మెదక్‌, ములుగు జిల్లాల్లో 80 శాతం కాన్పులు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే... సిబ్బందికి అభినందన

        సంగారెడ్డి జిల్లా ఖాజిపల్లి సబ్‌ సెంటర్‌ పరిధిలో 100% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో..

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 45 శాతానికి పైగా డెలివరీలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండటంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు. అలాగే 8 జిల్లాల్లో 58 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు జరగడంపై అధికారులను ప్రశ్నించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌, సూర్యాపేట, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ డెలివరీలు జరిగాయని, వీటిపై  వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌వోలు సమీక్ష జరపాలని ఆదేశించారు. హన్మకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో సీ సెక్షన్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీనాటల్‌ చెక్‌పలు అతి తక్కువగా వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, యాదాద్రి, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో జరుగుతున్నాయన్నారు.


 గత నెలలో నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లోని 399 సబ్‌ సెంటర్ల పరిఽధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధికంగా డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందుకు గల కారణాలను ఆన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో కూడా ఇదే పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మెదక్‌, ములుగు జిల్లాలో 80 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగితే మిగతా జిల్లాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ న్యూట్రిషిన్‌ కిట్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఖాజిపల్లి సబ్‌ సెంటర్‌లో వంద శాతం డెలివరీలు ఏఎన్‌సీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. దీంతో పాటు ప్రథమ స్థానంలో నిలిచిన మెదక్‌, ములుగు జిల్లాల డీఎంహెచ్‌వోలు, వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను మంత్రి హరీశ్‌ రావు అభినందించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-11T09:04:19+05:30 IST