ఇంటర్‌ సప్లిమెంటరీలో 47 శాతం ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-08-31T08:46:56+05:30 IST

ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 47.74 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీలో 47 శాతం ఉత్తీర్ణత

అడ్మిషన్ల గడువు సెప్టెంబరు 15కు పొడిగింపు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు 1కి పొడిగింపు

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 47.74 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే.. మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 67.72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మంగళవారం విడుదల చేశారు. 1,02,236 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయగా, 48,816 మంది ఉత్తీర్ణత(47.74 శాతం) సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలను 2,20,456 మంది రాయగా, 1,49,285 మంది(67.72 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఒకేషన్‌ కోర్సుల్లో 57.28 శాతం మంది విద్యార్థులు, రెండో ఏడాది 65.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలకు సంబంధించి రీ-వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం సెప్టెంబరు 5 నుంచి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్‌ సూచించారు. 


అడ్మిషన్ల గడువు 15 వరకు పొడిగింపు..

ఇంటర్‌ అడ్మిషన్ల గడువును సెప్టెంబరు 15 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు సెప్టెంబరు 1తో ముగియనుంది. రాష్ట్రంలో 1,582 జూనియర్‌ కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని కమిషనర్‌ వెల్లడించారు. వీటిలో 780 కాలేజీలకు గుర్తింపు జారీ చేశామని, మిగిలిన కాలేజీలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 586 కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను వారం రోజుల్లో సిద్ధం చేస్తామని చెప్పారు. కాగా కాంట్రాక్టు లెక్చెరర్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఇక, ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ కాలేజీల్లో పనిచేయడానికి 1,654 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది.


ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును సెప్టెంబరు 1 వరకు పొడిగించారు. అలాగే, ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెం బరు 2, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు సెప్టెంబరు 3 వరకు గడువు పొడిగించారు.

Updated Date - 2022-08-31T08:46:56+05:30 IST