సింగరేణి కార్మికులకు లాభాల్లో 30%

ABN , First Publish Date - 2022-09-29T07:55:59+05:30 IST

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు.

సింగరేణి కార్మికులకు లాభాల్లో 30%

  • వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం
  • 2021-22లో సంస్థ నికర లాభాలు రూ.1227 కోట్లు
  • 30% వాటా కింద కార్మికులకు 368 కోట్లు 
  • అక్టోబరు 1న ఖాతాల్లో జమ: సీఎండీ
  • వాటా చెల్లింపుపై ఎమ్మెల్సీ కవిత హర్షం

హైదరాబాద్‌/కొత్తగూడెం/ఇల్లెందు టౌన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకం దసరాలోపే అందేలా వెంటనే చెల్లించాలని సింగరేణి సీఎండీకి సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంస్థ మొత్త లాభాలు రూ.1227 కోట్లలో 30 శాతం వాటా కింద అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తంలో భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు గరిష్ఠంగా రూ.లక్షకుపైగా అందనుండగా, ఉపరితల గనుల్లో పనిచేసే వారికి రూ.70 వేల నుంచి రూ.80 వేల దాకా అందనున్నాయి. 2021-22లో సింగరేణి రూ.26,607 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ టర్నోవర్‌పై పన్నుల చెల్లింపునకు ముందు రూ.1,722 కోట్ల లాభాలను సంస్థ ఆర్జించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.3596 కోట్లు చెల్లించారు. నికర లాభాలు రూ.1227 కోట్లుగా తేల్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ 2021-22 నాటికి 29 శాతం వృద్థితో 650 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2013-14లో రూ.419 కోట్ల నికర లాభాలు సాధించగా.. 2021-22 నాటికి ఈ లాభాలు రూ.1227 కోట్లకు చేరాయి. 


గత ఏడాది కన్నా ఒక శాతం పెంపు..

2020-21 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా ఇవ్వగా.. ఈసారి 30 శాతానికి పెంచారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల్లో వాటాను అక్టోబరు 1న (శనివారం) వారి ఖాతాల్లో వేస్తామని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు. కాగా, కార్మికులకు దసరా సందర్భంగా లాభాల్లో వాటాను ప్రకటించడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వ సహకారంతో సంస్థ మరింత ముందుకెళుతూ దేశానికి వెలుగులు పంచాలని ఆకాక్షించారు.

Updated Date - 2022-09-29T07:55:59+05:30 IST